నాకు నా కొడుకు వేసే ప్రశ్నలకి నవ్వొస్తుంది, కోపమొస్తుంది, చెప్పలేక విసుగొస్తుంది. వాడి పేరు కార్తీక్. మూడో ఏడు వచ్చి కూడా ఆరునెలలు దాటింది. కరోనా వల్ల ప్లే' స్కూలు కూడా లేదు. ఇంట్లో ఉండి చేతిలో ఫోను పెట్టుకుని చూస్తూ ఉంటాడు. చిన్న పిల్లలు ఫోన్లు చూడటం కళ్లకి మంచిది కాదని నాకు తెలుసు, ఆరోగ్య సూత్రాలూ తెలుసు.
కానీ అవి పాటించే ఓపికా, వాడి ప్రశ్నలకి జవాబిచ్చే తీరికా ఉండడం లేదు. కారణం నేను మళ్లీ కన్సీవ్ కావటమే. ఈసారి ఆపరేషన్ చేయించుకోవాలని చూస్తున్నాను. మొదటిసారి అమ్మదగ్గరకి వెళ్లాను కానీ ఈసారి డెలివరీకి పంపించటానికి మావారు ఇష్టపడటం లేదు. కారణం మా అమ్మా నాన్నా సొంతింటికి - విజయవాడ దగ్గరలో ఉన్న పల్లెటూరికి వెళ్లిపోయారు. 'మీ అమ్మావాళ్లున్నది సిటీలో కాదు. సడెన్గా ఏ అర్ధరాత్రో హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఇబ్బంది పడతావు. మీ అమ్మనీ నాన్ననీ ఇక్కడికే రమ్మని చెబితే బాగుంటుంది కదా' అని తన నిర్ణయం చెప్పారు.
ఇంతలో నాన్నకి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. అన్నయ్యా వదినా వచ్చి కొన్నాళ్లున్నారు. నాన్నకి కాలూ చెయ్యీ ఇంకా ఫ్రీగా రాలేదు. నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా వెళ్లి దగ్గరుండి సహాయం చెయ్యాల్సిన పరిస్థితి. నిండు గర్భిణినైన నేను వెళ్లినా నన్ను ఏ పనీ చెయ్యనివ్వరు. ఈ టైంలో వాళ్లకి భారమవ్వటం తప్ప ప్రయోజనం ఉండదు. దాంతో మా అత్తగారినీ మామగారినీ రమ్మని చెప్పారు. మావారు.
అప్పటినుంచీ నాకు భయం పట్టుకుంది. కారణం- రేఖతో ఏడాది క్రితం జరిగిన సంభాషణే. రేఖ నా స్నేహితురాలు. ఈ కాలనీలోనే ఉంటుంది. రేఖకి తల్లి లేదు. తండ్రి రేఖ అన్నయ్య దగ్గరుంటున్నాడు. రేఖ డెలివరీకి వాళ్లత్తగారు వచ్చి వెళ్లింది. తర్వాత కొన్నాళ్లకు రేఖా నేనూ కలుసుకున్నాం. అవీ ఇవీ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే 'ఏమైనా డెలివరీకి అత్తగారిని పిలిపించుకోకూడదే' అంది హఠాత్తుగా. నాకు ఆశ్చర్యం కలిగింది. 'అమ్మ వస్తేనే హాయి. మనకి స్వతంత్రంగా ఉంటుంది. అత్తగారు ఎంత మంచివారైనా మనకుండే మొహమాటాలు మనకుంటాయనుకో అంది మళ్లీ ఏదో జీవితాన్ని కాచి వడపోసేసినట్లు.
"ఏం పాపం, మీ అత్తగారు వంటా అదీ చేసి పెట్టిందిగా" అన్నాను.
నిజమే, రేఖ అత్తగారు వంట చేసేది. పాపాయికి నీళ్లు పోసేది. టిఫిన్లు చేసేది. మొత్తం నాకు తెలిసినంతవరకూ చాలానే చేసింది. అయినా అత్తగారిని అమ్మతో పోల్చుకుంటే ఎలా? అలా పోల్చుకుంటే అత్తగార్లు కోడల్ని కూతురితో పోల్చుకుంటారు. ఈ తారతమ్యాలు లోక సహజమా? మా అత్తయ్యా మామయ్యా మంచివారే. ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ని తీసుకుని వెళితే అత్తయ్య వాడిని ఎంత ముద్దుగా చూసిందో. నన్ను వంట కూడా చెయ్యనివ్వలేదు. తను కూడా చెయ్యకుండా వంట మనిషిని పెట్టి మనవడితో ఆడుకునేది. ఏమో... ఏదయినా అత్తగారితో కొన్ని మొహమాటాలు తప్పవేమో.
“వంట చేస్తే సరిపోయిందా వాణీ... పైన ఎన్ని పనులు చెయ్యాలో తెలుసా? మా అత్త వస్తూనే పచ్చడి ప్యాకెట్లన్నీ తెచ్చి నాముందు పడేసి సీసాల్లో పెట్టమంది. నాకప్పటికే తొమ్మిదోనెల వచ్చింది. ఎక్కువసేపు నుంచోలేను, కూర్చోలేను. అయినా అలాగే చేశాననుకో. వంటేదో చేసేది. మిగిలిన పనులన్నీ నావే. సెలవురోజుల్లో అమ్మా కొడుకూ కలిసి ఊరు చూడటానికి వెళ్లేవారు. వచ్చేసరికి నేనే వంట చెయ్యాల్సివచ్చేది. మావారికి వాళ్లమ్మా నాన్నా వచ్చారని సంతోషం. తల్లి కష్టపడుతుంటే చూడలేరు. అక్కడికీ ఇక్కడికీ తిప్పాలని తాపత్రయం. పైగా మా అత్తగారు వంట చేస్తే గిన్నెలన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి. కూరల తొక్కులూ, గిన్నెలమీద మూతలూ కిందపడి ఉంటాయి. అవన్నీ సర్దుకునే సరికి నాకు నడుం లాగేసేదనుకో. పైగా డెలివరీ అయిన నెలకల్లా 'నీకు నార్మల్ డెలివరీనే కదా సాయంత్రం వంట చెయ్యి' అని చెప్పేసింది. నేను పిల్లకి పాలివ్వాలి. రాత్రిళ్లు నిద్ర ఉండదు. వారం వారం ఇద్దరూ ఎక్కడికో వెళ్లొస్తే పిల్లల్ని చూసుకుంటూ వంట చెయ్యాలి నేనే. నాకు మా అమ్మ ఎన్నిసార్లో గుర్తొచ్చింది. డెలివరీ అయ్యాక కాళ్లు ఒకటే లాగుతూ ఉండేవి. కాసేపు ఎవరైనా నా కాళ్లు నొక్కితే బావుండని అనిపించేది. అరికాళ్లు మంటలు. 'కాసేపు నాకాళ్లు నొక్కండి, అరికాళ్లకి కొబ్బరినూనె రాయండి' అని ఎవరిని అడగను? అమ్మయితే అడిగేదాన్నేమో ఇలాంటివి చాలా ఉన్నాయి.
మామూలుగా ఉంటే అత్తగారినీ మామగారినీ కూర్చోబెట్టి చేస్తా. కానీ ఇలాంటి టైమ్లో కూడా విశ్రాంతి లేకపోతే ఎలా? ఆవిడ దోసెపిండి రుబ్బితే అవి పెనం మీద వేసే పని నాదే. తలో రెండో మూడో వెయ్యాలంటే అట్ల పేరమ్మలా అయిపోయేది నా పని. అంటే అత్తలందరూ అలానే ఉంటారని చెప్పను. కానీ వాళ్లు ఏ పని చేస్తున్నా వెనకాల కోడలు
ఉండాలనుకుంటారేమోనని నా అనుమానం. మొత్తంమీద ఏదో చేసి
వెళ్లారనుకో మా అత్తగారు. కానీ టెన్షన్ టెన్షన్గా గడిచింది" అంటూ
ఏవేవో చెప్పింది. అవన్నీ గుర్తొస్తుంటే నాకు మనసులో బెరుకుగానే ఉంది.
ఇప్పుడున్న స్వేచ్ఛ ఉంటుందో ఉండదో నాకు లేనిపోని పని పెరిగిపోదు.
కదా. రేఖ చెప్పినవి విన్న తర్వాత లేనిపోని చిక్కుల్లో పడబోతున్నానా
అన్న ఆలోచన వేధిస్తోంది.
అనుకున్న రోజు దగ్గర పడుతోంది. మామగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైరయ్యారు. అత్తయ్య సందడి మనిషి. పూజలూ నేవైద్యాలూ ఉపవాసాలూ ఎక్కువ. ఆయన రమ్మని చెప్పగానే ఇద్దరూ వారం రోజుల్లో సామాన్లు సర్దుకుని వచ్చేశారు. అత్తయ్య పెద్దబొట్టుతో జరీచీరలతో కళకళలాడుతూ ఉంటుంది. కార్తీక్కి ఇష్టమని కజ్జికాయలూ, వేరుశనగపప్పు ఉండలూ, జంతికలూ తీసుకొచ్చింది. భోజనం చేసి ఇద్దరూ కాసేపు నిద్రపోయారు. మధ్యాహ్నం మూడింటికి గానీ లేవలేదు. కాఫీ కలిపి ఇద్దరికీ ఇచ్చి, అక్కడే నిలబడ్డాను. "కూర్చో వాణీ, ఎంతసేపు నిలబడతావు" అన్నారు. నేను కూడా కూర్చున్నాను.
"కాఫీ చాలా బావుందమ్మా. కానీ రేపటినుంచీ నువ్వు కలపకు" అంది.
నేను ప్రశ్నార్థకంగా ఎందుకు అన్నట్లు చూశాను.
"నేను వచ్చింది ఎందుకు? నీచేత కాఫీ కలిపించుకోవడానికీ, వంట చేయించుకుని తినటానికి కాదు కదా. నీకు సహాయం చెయ్యాలని వచ్చాను మాకు సేవ చేయాలని అనుకోకు" అంది.
నేనేమీ మాట్లాడలేదు.
ఆరాత్రి వంటేమీ లేదు. అందరం కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపోయి పడుకున్నాం. నాకయితే తెల్లవారి తొమ్మిదింటికి కానీ మెలకువ రాలేదు. లేవగానే కంగారొచ్చేసింది. వంటింట్లోంచి ఏవో వాసనలొస్తున్నాయి. 'అయ్యో అత్తయ్య ఏదో చేసేస్తోంది. ఏవి ఎక్కడున్నాయో వెతుక్కుంటుందో ఏమో- మిక్సీ శబ్దం కూడా వినపడుతోంది. ఆవిడ ఏమనుకుంటుందో. రోజూ ఇలాగే పడుకుంటుందనుకుంటుందో ఏమో' అనుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్లాను.
అత్తయ్య అప్పటికే ఫ్రిజ్లోంచి ఇడ్లీపిండి తీసి ఇడ్లీ వేస్తోంది. కుక్కర్లో వంట అవుతోంది. మావయ్యగారు వంకాయలు తరుగుతున్నారు. ఇలా లేట్గా లేచినందుకు ఏమంటారో అనుకుంటూ "అయ్యో అత్తయ్యా... నిన్నేగా వచ్చారు. ఏవి ఎక్కడున్నాయో ఏం తెలుస్తుంది పాపం? రెండు రోజులు నేను చేస్తాను లెండి" అన్నాను అపరాధ భావనతో.
"లేదులే వాణీ. ఇన్నాళ్లనుంచీ లేచినా లేవకపోయినా నువ్వే చేసుకున్నావు కదా. ఇప్పుడు కూడా పనంతా నువ్వే చేస్తే నేనొచ్చిన ప్రయోజనమేముంది? వెళ్లి మొహం కడుక్కుని రా" అంది ఇడ్లీ పచ్చడి తిరగమోత వేస్తూ.నేనేమీ మాట్లాడలేకపోయాను. మొహం కడుక్కుని వంటింట్లోకి రాగానే కాఫీ గ్లాసు అందించింది అత్తయ్య. 'ఇవాళ నా కాఫీ రుచి చూడు' అంటూ.
ఉదయం లేవగానే కాఫీ గ్లాసు చేతికందిస్తే ఎంత హాయిగా ఉంటుందో నిజంగా నాకు అనుభవంలోకి వచ్చింది. అమ్మకి కూడా ఇంత రుచిగా కాఫీ కలపటం రాదు. కాఫీ బాగా తాగేవాళ్లకే ఆ ఫిల్టరు కాఫీ చేసే విధానం కూడా బాగా వస్తుందేమో అనుకుంటూ ఉంటాను. ఎవరొచ్చినా నాకు కాఫీ పని తప్పేది కాదు. ఇవాళ అత్తయ్య ఇచ్చిన కాఫీ అద్భుతంగా ఉంది. 'సోఫాలో కూర్చుని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగు' అంది అత్తయ్య నవ్వుతూ.
నేను కాఫీతాగి "మీరు వంటకోసం హడావుడి పడకండి అత్తయ్యా. ఆయన ఇంట్లోంచే వర్కు చేస్తారు. కార్తీక్కి స్కూలూ లేదు. మెల్లగా చేసుకోవచ్చు" అన్నాను.
"సరేనమ్మా, ఇవాల్టికి అయిపోయిందిలే. పన్నెండయ్యాక అన్నం వండుకోవచ్చు."
మావయ్య కార్తీక్కి చక్కగా స్నానం చేయించారు. వాడు కూడా నిన్నటినుంచీ తాతయ్య- నానమ్మల వెనకాలే తిరుగుతున్నాడు. మావారు కూడా వాళ్లమ్మా నాన్నా వచ్చాక రిలాక్సయ్యారు.
"అమ్మయ్యా... ఇవాళ నువ్వు చేస్తున్నావుకానీ రోజూ నేను ఎన్ని పనులు చేసేవాడినో తెలుసా అమ్మా... కూరలు తరగటం, కాఫీ పెట్టడం, కార్తీక్కి స్నానం చేయించటం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం... ఒకటి
కాదనుకో" అన్నారు అత్తయ్యతో ఆయన. అత్తయ్య నవ్వుతూ "సహాయం చెయ్యకపోతే ఎలారా? అసలే లేవలేని పిల్ల. ఎన్ని చేస్తుంది? ఇంకా వంట చేసి పెట్టింది, సంతోషించాలి" అంది.
నావైపు తిరిగి "అమ్మాయ్, నువ్వు కూడా పెందరాడే టిఫిన్ తినెయ్యి" అని చెప్పింది.
మర్నాడు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసి, బూజులన్నీ దులిపి, దేవుళ్లందరినీ చక్కగా సర్ది దీపం వెలిగించింది. మేం ఉండేది అపార్ట్మెంట్, పెద్దగా పూలేమీ లేవు.
నేను వంట చేస్తున్నప్పుడు అంతా హడావుడి. తేలికగా అయిపోయే పదార్థాలని చేసేదాన్ని. దేవుడి మందిరం శుభ్రం చెయ్యటాలూ అవేమీ లేవు. అసలు టైం ఉండేది కాదు.
అత్తయ్య వచ్చిన దగ్గర్నుంచీ రకరకాల రుచులు రుచి చూపిస్తోంది. వంకాయ కూర అనేక రకాలుగా చేస్తుంది. అన్ని రకాలుగా చేయొచ్చని కూడా నాకు తెలీదు. రకరకాల పచ్చళ్లు నూరేది. ఎవరయినా వంట చేసి పెడుతుంటే ఎదురుగా ఉన్నవారికి ఆకలి ఎక్కువట అనేది అనుభవంలోకి వచ్చింది.
"ఏదయినా తినాలనుంటే చెప్పు వాణీ, దాచిపెట్టుకోకూడదు" అనేది అత్తయ్య హాస్యంగా. నేను మొహమాటంగా ఏమీ చెప్పేదాన్ని కాదు. తనే ఏదో ఒకటి చేసేసేది. అత్తయ్యే పని మొత్తం చేస్తుంటే నాకేదోలా ఉండేది.
కార్తీక్ని తీసుకుని కాసేపు బయట నడిచి వచ్చేది. మావయ్యకయితే కాలక్షేపానికి అసలు కొదవలేదు. కార్తీక్కి ఏవో కథలు చెప్పేవారు. ఇక టీవీ ఉండనే ఉంది కదా. ఏ సినిమా అయినా మధ్యలో ఉన్నా ఫాలో అవుతూ చూస్తుండేవారు. కాసేపు ఇంటర్నెట్లో పేపరు చూడటం, వాకింగ్కి తప్పకుండా వెళ్లటం... ఇవి నిత్యకృత్యాలే ఆయనకి.
నిజానికి అత్తయ్య వచ్చాక నాకు కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. అత్తయ్య ఏపనీ చెయ్యనివ్వకుండా రెస్టు తీసుకోమంటుంది. దాంతో నాకు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. ఈసారి పాప పుడితే బాగుండు అని మనసులో కోరికగా ఉంది. ఆలోచనలతోనే రోజులు దగ్గర పడ్డాయి. ఆ క్షణం రానే వచ్చింది. మనసులో ఏదో చెప్పలేని భయం.
నేను పెయిన్స్తో బాధపడుతుంటే అత్తయ్య తల నిమిరింది. "కాసేపే తల్లీ, పండంటి బిడ్డని ఎత్తుకుంటావు" అని ధైర్యం చెప్పింది.
నా కోరికతీరి ఆడపిల్ల పుట్టింది. నాకు స్పృహ వచ్చాక కూడా మత్తుగానే ఉంది
“నా మనవరాలు ఎంత ముద్దుగా ఉందో చూడరా" చాలాసేపయ్యాక అత్తయ్య గొంతు వినపడుతోంది.
రెండుగంటల తర్వాత పాపాయిని చూస్తూ ఆనందం పట్టలేకపోయాను. రెండు గుప్పిటలు మూసుకుని కళ్లు తెరిచి చూస్తోంది నా బిడ్డ. జుట్టు నల్లగా మొహమంతా కప్పేసింది. మనసులో ఏదో తృప్తి, ఆనందం. మళ్లీ నీరసంతో నా కళ్లు మూతలు పడ్డాయి.
అయిదో రోజున ఇల్లు చేరాం. అత్తయ్య కొబ్బరికాయతో దిగతుడిచి లోపలికి తీసుకెళ్లింది. నాకు వేరే మంచం మీద పక్కకూడా సిద్ధం చేసింది. పురిటినీళ్లనాడు శాస్త్రోక్తంగా సూర్యుడికి ఆవుపాలతో అర్ఘ్యం ఇప్పించింది. చుట్టుపక్కల వారందరికీ స్వీట్లు పంచింది. బాలింతరాలికి పథ్యం అంటూ కారప్పొడీ, శొంఠిపొడీ... ఇలా రకరకాలుగా చేసేది. నాక్కూడా బాగా ఆకలిగా ఉండేదేమో అవి అమృతంలా ఉండేవి. నాకు కాళ్లకి చెప్పులూ తల చుట్టూ గుడ్డా లేకపోతే అత్తయ్య ఊరుకునేది కాదు. తీరిక టైమ్లో పాపని ఎత్తుకుని ముద్దులాడుతూ కూర్చునేది. బారసాల సింపుల్గా
చేశాం. పేరు పెట్టే విషయంలో అత్తయ్యా మామయ్యా ఏం కల్పించుకోలేదు. 'శ్రావ్య' అని పేరు పెట్టాం. నా భర్త ఎక్కడినుంచో స్టాండ్ ఉయ్యాల తెచ్చారు. ఇరుగు పొరుగుని పిలిచింది అత్తయ్య. ఓ బకెట్లో నీళ్లు నింపి దానికి మూడు పక్కలా పసుపురాసింది. 'నూతిలో చేద' అనే కార్యక్రమం జరిపి ఫొటోలు తీయించింది. కార్తీక్ టైమ్లో అమ్మకూడా ఇలానే జరిపించింది. తలచుట్టూ గుడ్డ, చెవుల్లో దూదులు... నా రూపం నాకే వింతగా అనిపించి నవ్వుకున్నాను. కార్తీక్ చెల్లెలు దగ్గరే కూర్చునేవాడు. దాని చిట్టి చిట్టి చేతులు వింతగా చూస్తుండేవాడు.
ఒక ఆదివారం మావారు అత్తయ్యతో కబుర్లు చెబుతూ "అమ్మా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాణీ డెలివరీ అయిపోయిందిగా- పొద్దున్న వెళ్లి సాయంత్రం వచ్చేద్దాం" అన్నారు.
"నేను రానురా. కావాలంటే నాన్నని తీసుకు వెళ్లు" అంది అత్తయ్య శ్రావ్యని జో కొడుతూ.
"అదేం ఎందుకు?"
అత్తయ్య పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చింది.
"వాణీ నీరసంగా ఉంది. పసిపిల్ల చీటికీ మాటికీ ఏడుస్తూ ఉంటుంది. పాపం వాణీకి రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదు. డెలివరీ అయిపోగానే బలం వచ్చేస్తుందా? ఈ టైమ్లో తోడుండాలి తప్పకుండా. నేను మాత్రం నా కోడలిని వదిలి బయటకు రాను. ఈసారి వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్లొచ్చులే. ఒకవేళ నాన్నకి ఏమీ తోచకపోతే తీసుకెళ్లు" అంది.
నిజమే, రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదు. శ్రావ్య పగలల్లా పడుకుని రాత్రి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యని ఎత్తుకుని భుజాన వేసుకుని నన్ను పడుకోమని చెప్పి తనెత్తుకుని జోలపాటలు పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.
రేఖ వాళ్లత్తగారి గురించి చెబుతూ 'వంట ఒకటీ చేసి పడేసి కొడుకుని ఆ గుడికెళదాం ఈ గుడికెళదాం తీసుకెళ్లు అని చెప్పి రోజూ బయటకెళ్లిపోయేది, అని చెప్పిందే. పాపం అత్తయ్య అయితే వచ్చిన దగ్గర్నుంచీ ఇల్లు కదల్లేదు నాతో హాస్పిటల్కి రావడం తప్ప.
"వెళ్లండత్తయ్యా ఒక్కరోజుకేముంది. నేను చూసుకుంటాను" అన్నాను.
"మీరెవరు చెప్పినా విననమ్మా. నీకు బాగా ఓపిక వచ్చేదాకా నేను ఎక్కడికీ వెళ్లను. పిల్లని చూసుకోవాలి. ఇల్లంతా సర్దుకోవాలి. ఎవరయినా ఫోను చేస్తే మాట్లాడాలి. శ్రావ్య ఏడిస్తే ఎత్తుకోవాలి. నీకు ఓపిక వచ్చింది అనుకుంటున్నావు కానీ ఇంకా కొన్నాళ్లు పోవాలి. అదీకాక నేను శ్రావ్యని వదిలిపెట్టి ఉండలేను. భుజంమీద అది లేకపోతే ఏదో లోటుగా ఉంటుంది" అంది నవ్వుతూ.
నేనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోయాను. ఏడుపొచ్చింది. ఈ మధ్య డిప్రెషన్లాగా తరచూ ఏడుపొస్తోంది. డాక్టర్ని అడిగితే 'అది సహజం క్రమంగా తగ్గుతుంది' అని చెప్పింది. నిజమే, అత్తయ్య బయటకెళితే చేసుకోలేని పరిస్థితే నాది. పాపం అత్తయ్య నా మనసు తెలిసినట్లు ప్రవర్తిస్తుంది
శ్రావ్యకి అయిదో నెల వచ్చింది. బోర్ల పడుతోంది. పడీ పడగానే అత్తయ్య బొబ్బట్లు చేసింది. శ్రావ్యని చాపమీద పడుకోపెడితే అరుస్తూ నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య శ్రావ్యకి రోజూ తలకి నూనె పట్టిస్తుంది. దానికి ఇప్పటికే జుట్టు అంతా పెరిగిపోయి రింగుల రింగులుగా మొహం మీద పడుతూ ఉంటుంది. దానికి వాళ్ల నానమ్మలాగా వొంకుల జుట్టు అనుకుంటా. రాను రాను శ్రావ్య నాకన్నా అత్తయ్యను గుర్తుపట్టడం మొదలుపెట్టి అత్తయ్య కనపడితే చాలు నా దగ్గర్నుంచి ఆవిడ మీదికి ఉరుకుతోంది. పసిబిడ్డ కోసం మురుగులు తెచ్చిందత్తయ్య. అవి ఇప్పుడు జారకుండా కొంచెం సరిపోతున్నాయి. చిట్టి చిట్టి చేతులు అందంగా కనిపిస్తున్నాయి. మెల్లగా అత్తయ్యా మామయ్యా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. సొంత ఊళ్లో ఇల్లు పాడయిపోతుంది వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఒక రెండు రోజుల్లో ప్రయాణమనగా అత్తయ్య ఎన్ని పనులు చేసిందో చెప్పలేను. పాపాయి గౌన్లను గుర్తుగా సర్దింది. వంటింట్లో పప్పులడబ్బాలు కూడా ఒక వరసలో పెట్టి పోపులపెట్టెలో అన్నిరకాలూ ఫుల్గా నింపిపెట్టింది. నేను దేనికీ వెతుక్కోకుండా ఇడ్లీ పిండీ, దోసెపిండీ గ్రైండర్లో వేసి రెడీ చేసింది. ఒకటికాదు, క్షణం తీరికలేకుండా పని చేస్తూనే ఉంది. మర్నాటికి కూరలు కూడా తరిగి ఫ్రిజ్లో పెట్టింది. అంతా అయిపోయిన తర్వాత శ్రావ్యని ఎత్తుకుని ముద్దులాడుతూ కూర్చుంది. వెళ్లేముందు నన్ను దగ్గరకి తీసుకుని, "పిల్లలు జాగ్రత్త, కొన్ని పనులు వాడికి కూడా అప్పగించు. పనులకోసం హడావుడి పడకు. మళ్లీ ఎప్పుడయినా అవసరమైతే ఫోన్ చేయి, క్షణాలమీద వస్తాను, సరేనా?" అంది. నాకు ఏడుపొచ్చేసింది. ఏమీ మాట్లాడలేకపోయాను. అత్తయ్యకి బొట్టుపెట్టి పట్టుచీర పెట్టాను. మామయ్యకి ఆయన బట్టలు పెట్టారు. ఇద్దరికీ మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టాను.
"నేను పనే మరిచిపోయానత్తయ్యా మీరు వచ్చాక. అమ్మ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ చెయ్యలేదు. మీరు నాకు నిజంగా అత్తగారు కాదు, అత్తమ్మ. మీలో మా అమ్మను చూశాను" అన్నాను దుఃఖపడుతూ. అత్తయ్య నా భుజం తట్టి 'పిచ్చిపిల్లా' అన్నారు. మావారు నవ్వుతూ “అత్తాకోడళ్ల అనుబంధం" అన్నారు.
“ఈసారి వచ్చినప్పుడు బెంగళూరు అంతా చూపిద్దువుగానీ లేరా" అన్నారు మావయ్య. నాకు ఒకటే అనిపించింది... 'అత్తా మామా వద్దు ఒంటరిగా ఉండాలి అనుకునే అమ్మాయిలు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అని. శ్రావ్యకి ఏమనిపించిందో అత్తయ్యావాళ్లు కారెక్కుతుంటే గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. తనకు రోజూ కనపడే నానమ్మా తాతయ్యా వెళ్లిపోతున్నారని తెలిసిందేమో. దాన్ని గుండెలకి హత్తుకున్నాను. కానీ నాకళ్లు అత్తయ్యని తలుచుకుంటూ చెమరుస్తూనే ఉన్నాయి.
ప్రచురణ:ఈనాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి