మాటరాని మౌనం


ఆఫీస్లో క్లైంట్స్తో మీటింగ్ పూర్తి చేసుకుని అప్పుడే తన సీట్లో కూర్చుని ఒక్క క్షణం అలసటగా కళ్లు మూసుకున్న నిర్గుణ మొబైల్ మోగింది. ఎవరో అనుకుంటూ ఫోన్ ఎత్తింది.

"హలో నిర్గుణా?"

"యస్..." అవతల కంఠం ఏమి చెప్పిందోగాని...

"వాట్?"

"అవును... హాస్పిటల్లో అడ్మిట్ చేశాము."

"నేను నమ్మలేకపోతున్నాను."

"మా అందరి పరిస్థితీ అలాగే ఉంది. ఇంకా షాక్లోనే ఉన్నాం" దుఃఖం నిండిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అరుణ్.

నియతి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందా... నమ్మలేకపోతున్నాను... నేను విన్నది నిజమేనా... నాలుగు రోజుల క్రితమే కదా మాట్లాడాను దానితో. ఎప్పుడూ ఉండే సమస్యల గురించే మాట్లాడుకున్నాం. ఇంతలో కొత్తగా ఏమైంది? అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది నీతూ?

ఆఫీస్లో నా కొలీగ్కు చెప్పి నేను అర్జంట్గా చెయ్యాల్సిన పనిని తనకు అప్పగించి హాస్పిటల్కు పరుగు తీశాను.

కొంగుతో మాటిమాటికీ కళ్లు తుడుచు కుంటూ, దుఃఖాన్ని
దిగమింగుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ నియతి అమ్మగారు ఐసీయూ ముందు కనిపించారు. నన్ను చూడగానే కట్టలు తెంచుకున్న దుఃఖంతో నా చెయ్యి పట్టుకుని "చూశావా తల్లీ, ఎంత పని చేసిందో నీ స్నేహితురాలు" అంటూ నన్ను కౌగిలించుకుని ఏడ్చేయడం మొదలుపెట్టారు. ఓదార్పుగా ఆవిడ భుజంమీద మృదువుగా తడుతూ...

"ఇప్పుడెలా ఉందాంటీ?" అడిగాను.

"48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు.

"ఏం చేసుకుంది" అడగలేక అడగలేక అడిగాను.

“నిద్ర మాత్రలు మింగేసిందట... వెంటనే అరుణ్ గ్రహించి అంబులెన్సుకి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు."

"అంతా సర్దుకుంటుందాంటీ, మీరు ఏడ్వకండి" అంటూ ఓదార్పుగా

ఆవిడ భుజం చుట్టూ చెయ్యివేశాను.

ఇంతలో అంకుల్ వచ్చారు. అంకుల్ వెనకాలే అరుణ్... సర్వం కోల్పోయినట్లుగా దిగాలుగా కనిపిస్తున్నాడు.

"చూశావమ్మా ఏం చేసిందో నీ ఫ్రెండ్" అంకుల్ గొంతులో బాధతో సమానంగా కోపమూ వినిపించింది. 'అలా అనకండి' అని సూటిగా అనలేక, “ప్లీజ్ అంకుల్" అన్నాను. నాకా సమయంలో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. దూరంగా నిలబడి ఎటో శూన్యంలోకి చూస్తున్న అరుణ్ దగ్గరకు వెళ్లాను పలకరించడానికి.

"డాక్టర్ ఏమంటున్నారు అరుణ్?" పలకరించాను.

"పరిస్థితి క్రిటికల్గానే ఉందనీ 48 గంటలు గడిస్తేగానీ చెప్పలేమనీ అంటున్నారు. హెవీ డోస్ తీసుకుందట" కళ్లల్లో తిరుగుతున్న నీళ్లు కనిపించకుండా పక్కకు చూస్తున్నాడు.

“డోంట్ వర్రీ, షి విల్ బి ఓకే" మాటలు కూడబలుక్కున్నాను. "హోప్ సో" ఇంక మాట్లాడటం ఇష్టం లేనట్టు పక్కకు తిరిగాడు.

నేను ఆంటీ దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాను. చీరకొంగు నోటికడ్డం పెట్టుకున్నా, ఎగిసి పడుతున్న గుండెలు దుఃఖాన్ని దాయలేకపోతున్నాయి. “నా చిట్టితల్లి ఏం పని చేసిందో చూశావా నిర్గుణా, కన్నతల్లిని బతికే ఉన్నాను. ఏనాడూ దాని బాధలు నాతో చెప్పుకోలేదు. 'చాలా సంతోషంగా ఉన్నానమ్మా' అంటూ ఉండేది. మనసులో మోయలేనన్ని బాధలు పెట్టుకుని అలా నటించడం ఏమైనా బాగుందా తల్లీ" బేలగా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవిడను ఎలా ఓదార్చాలి? నాకు లేదూ బాధ... నియతి అలా చేసినందుకు నేనూ తట్టుకోలేకపోతున్నాను.

రాత్రి దాకా ఉండి ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం ఈ వార్త తెలిసినప్పటి నుంచీ నాలో కమ్ముకున్న దిగులు మేఘాలు ఉరుములు మెరుపులతో వర్షించటం మొదలుపెట్టాయి. తలగడల మధ్యలో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంకా ఇంకా ఊరుతూనే ఉన్న ఈ కన్నీటికి ఆనకట్ట వెయ్యలేకపోతున్నాను. ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు?

నీతూ డియర్, ఇలా ఎందుకు చేశావు? నీలో భావాల సంఘర్షణను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా? లేక తేలికగా తీసుకున్నానా? నిన్ను నిర్లక్ష్యం చేశానా? నేను సైతం నీ ఆవేదనకు కారణమయ్యానా?

ఇంతలో "నీకేదో సాయంత్రం కొరియర్ వచ్చిందే నిర్గుణా" అంటూ అమ్మ ఒక లెటర్ తెచ్చి ఇచ్చింది.

అమ్మకు చెప్పనా ఈ విషయం... నో, ఇప్పుడు చెబితే కంగారు పడుతుంది. నియతిని అమ్మ ఎంత అభిమానిస్తుందో నాకు
తెలుసు.

లెటర్... నాకెవరు రాస్తారు? ఆత్రంగా విప్పాను. నియతి చేతిరాత! నియతిని ప్రేమగా ‘నీతూ' అని పిలవడం నాకు చాలా ఇష్టం. అలాగే నీతూ నన్ను 'నిగ్గూ' అని పిలుస్తుంది.

నా ప్రాణమైన నిగ్గూ...

చివరిసారిగా వీడ్కోలు తీసుకోబోతూ, నీకు ఈ లెటర్ రాస్తున్నాను.

నిగ్గూ, నువ్విచ్చిన ప్రోత్సాహం నువ్వందించిన సహకారంతోనే ఇప్పటిదాకా ఈ బండిని లాక్కొచ్చాను. ఇక నావల్ల కాదు. ఎందుకీ నిర్ణయం తీసుకున్నానంటే... ఎక్కడ మొదలుపెట్టను? ఏమని రాయను? నీకు తెలియకపోతే కదా?! అరిగి పోయిన గ్రామఫోన్ రికార్డ్లగా పదే పదే చెబుతూ ఇన్నిరోజులూ నిన్ను విసిగిస్తూ వచ్చాను. ఇక నీ నీతూ నిన్ను విసిగించదులే నిగ్గూ.

చిన్నప్పటి నుండీ నా భవిష్యత్ ప్రణాళిక అంతా నాన్నగారిదే. 'నాకు ఇంజినీరింగ్ చదవాలని లేదు నాన్నా చక్కగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటా'నంటే నో, 'నువ్వు ఇంజినీర్ అవ్వాల్సిందే' అని బలవంతంగా చదివించారు. నా చిన్న చిన్న కోరికలను కాదని నాన్నకు ఇష్టమైనవన్నీ నామీద రుద్దేరు. డాన్స్ నేర్చుకోవాలన్న నా కోరిక, సాహిత్యం చదవాలన్న నా అభిలాష, వీణ వాయించాలన్న నా ఆశ... అనేకానేక ఆంక్షల సంకెళ్లలో బంధింపబడి నా స్వేచ్ఛకు ప్రశ్నలుగా మిగిలాయి. పుస్తకాలలో పాఠాలను నేర్చుకున్నాను, బతికే స్థైర్యాన్ని నేర్చుకోలేకపోయాను.

నేను ఎదుగుతున్నానా లేక కుంచించుకు పోతున్నానా అని ఆలోచించే ధ్యాస మా ఇంట్లో ఎవరికీ లేదు. మార్కుల జాబితాలో నేనూ ఓ మార్కునే! అమ్మ, నాన్న, పరువు, కులం... వీటికి భయపడుతూ నా • ప్రేమను చంపేసుకున్నానే కానీ సాహసం చేయలేకపోయాను. అది ప్రేమో ఆకర్షణో తేల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా మనసూ నోరూ నొక్కేశాను.

'నీ మనసు చెప్పినట్టు విను. నీ జీవితం నీ సొంతం, కాంప్రమైజ్ అవ్వకు' అంటూ ఆ రోజు నన్నెంత ప్రోత్సహించావో. కానీ నాకు మరో ఛాయిస్ లేదు. తలవంచేశాను. నాన్న కోరుకున్నట్లుగా నేనో శ్రీమంతుల ఇంటి కోడలైనాను.

మా అత్తగారిల్లు ఒక జైలు... విలాసవంతమైన జైలు. అందులో నేను శాశ్వతంగా బంధింపబడిన ఒక ముద్దాయిని. ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అందరూ నావైపే వేలు చూపిస్తారు. మా అత్తగారికి బీపీ పెరిగితే 'అమ్మకు సెపరేట్గా ఉప్పులేకుండా కూరలు వండమని వంట మనిషికి చెప్పలేవా, దగ్గరుండి చూసుకోవద్దా' అంటూ మావారు నామీద ఎగురుతారు. మా మామగారు షుగర్తో బాధపడుతున్నా రహస్యంగా ఎవరూ చూడకుండా స్వీట్స్ తినేస్తారు. ఆయన షుగర్ లెవల్ పెరిగినా నేనే ముద్దాయిని. మావారికి ఆఫీసులో పని ఎక్కువైనా దానికీ నేనే కారణం. 'ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్వి ఇల్లు మానేజ్ చేయడం రాదం'టూ అందరి ఎదురుగా నన్నే దోషిని చేస్తాడు అరుణ్. పెళ్లై మూడేళ్లు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని మా ఆడపడుచు ఎదురుగా నన్ను నిలబెట్టి దోషిగా చూసే మా అత్తగారి చూపులకు సిగ్గుతో కుంచించుకుపోతూ, నేను నిలబడి ఉన్నచోట భూమి చీలిపోయి అందులో నేను శాశ్వతంగా భూస్థాపితం అయిపోతే ఎంత బాగుండనుకుంటాను. ఈ అవమానాన్ని ఒకసారి అరుణ్ దగ్గర ప్రస్తావిస్తే 'పిల్లలని కనేస్తే నిన్ను ఎవరూ ఏమీ అనరుగా? అయినా అమ్మకి కూడా మనవడినో మనవరాలినో చూసుకోవాలని ఉంటుందిగా' అంటూ మా అత్తగారికే సపోర్ట్... పిల్లలని కనడంలో నా ఒక్కదానిదే పాత్ర ఉంది అన్నట్లుగా. ఏరోజూ నా మనసు పరవశించిన సందర్భం లేదు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇదేనేమో నిగ్గూ!నేను చాలా అదృష్టవంతురాలిని బయట లోకానికి. నా బాధలు చెప్పినా నమ్మరు సరికదా నన్నో పిచ్చిదాన్నిగా చూస్తారు. ఫలానా వారి ఇంటి కోడలంటే ఎంత అదృష్టాన్ని నోచుకున్నానో అనుకుంటారు. వారి అంతస్తుకి తగినట్లుగా నడుచుకోవాలట. నాకంటూ ఒక అభిప్రాయం, నా భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ ఉండకూడదు. ఇంజినీరింగ్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను... అదీ ఐటీ బ్రాంచ్లో కానీ బావిలో కప్పలా అందరిచేతా మాటలనిపించుకుంటూ బతుకుతున్నాను. పోనీ ఆ ఇంటినుండి శాశ్వతంగా బయటకు వచ్చేద్దామనుకుంటే- అమ్మానాన్నా నాకు సర్దుకుపోవడం రాదనీ, నాదే తప్పనీ నిందిస్తారు.

నాకు ఓర్చుకోలేని బాధ కలిగినప్పుడల్లా నీ భుజంపై వాలిపోయేదాన్ని. ఎన్నాళ్లిలా సర్దుకుపోయి బతుకుతావు. నీ ఇష్టాలు చెప్పు, కష్టాలు ఎత్తి చూపంటూ నువ్వెన్ని సార్లు చెప్పినా ఆ పని చెయ్యలేకపోయాను. నాలోని పిరికితనం మాటునున్న అసమర్ధత, చేతకానితనం నన్ను కట్టిపడేస్తూనే ఉన్నాయి ఈ క్షణం వరకు.

ప్రేమకోసం తపించి తపించి అలిసిపోయాను. నాపై చూపించే అధికారాన్నే ప్రేమని భ్రమపడుతూ బతకలేను. ఎదిరించి నిలదీసి బతికే ధైర్యాన్ని నా జీవితంలో నేను నేర్చుకోలేకపోయాను.

నీ ప్రోత్సాహం నన్ను ధైర్యంగా ముందుకు అడుగువేయమన్నా

నడిచే శక్తి నాకు లేదు. అందుకే ఓడిపోతూ వెళ్లిపోతున్నానే.

బై... మరో జన్మ అంటూ ఉంటే మళ్లీ నువ్వే నా ప్రియనేస్తానివి.

నీ నీత

నా కన్నీటి చుక్కలతో అక్కడక్కడా అక్షరాలు అలుక్కుపోయాయి. ప్రతి వాక్యం నియతి గుండెల్లో గూడుకట్టుకున్న గుబులునూ, ఒంటరితనాన్నీ తెలియజేస్తున్నాయి.

నేను ఎంత తప్పు చేశాను. నాలుగుమాటలు చెప్పి ఊరుకున్నానేకానీ తను డిప్రెషన్లోకి కూరుకుపోతోందని గ్రహించలేకపోయాను. కౌన్సెలింగ్కి తీసుకెళ్లాలన్న ఆలోచనే రాలేదు నాకు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదేమో.

“అవుట్ ఆఫ్ డేంజర్. ఈరోజు రూమ్కి షిఫ్ట్ చేస్తారంట" అరుణ్ మొహంలో రిలీఫ్.

ప్రమాదం తప్పిందన్న ఆనందం అంకుల్ కళ్లలో కనిపిస్తుండగా, "అంకుల్, మీరు కోపం తెచ్చుకోను అంటే ఒక మాట చెబుతాను" అన్నాను.

ప్రశ్నార్థకంగా నావైపు చూశారు. నియతి రాసిన ఉత్తరం అంకుల్ చేతిలో పెట్టాను. లెటర్ చదువుతుండగా అంకుల్ కళ్లలో కదలాడిన చెమ్మ నాలో ఆశను పెంచింది. "మీకు మీ అమ్మాయంటే ఎంతిష్టమో నాకు తెలియంది కాదు. తనకోసం మీరు అన్నీ సమకూర్చిపెట్టారు. కానీ అంకుల్... మీ కూతురికీ కొన్ని ఇష్టాలు ఉంటాయనే విషయాన్ని మాత్రం మరిచిపోయారు. మీ కూతురు శ్రమ లేకుండా ప్రయాణించాలను కుంటూ చక్కని రహదారిని నిర్మించి ఇచ్చారు. ఆ దారి మీ కూతురికి నచ్చిందో లేదో కూడా అడగటం విస్మరించారు."

"నేనేది చేసినా తన మంచికే కదమ్మా చేశాను."

"నాకు అర్థమైంది అంకుల్. మీ కూతురి భవిష్యత్ పైన చాలా ఎక్కువ కలలు కంటూ అదే ధ్యేయంగా భావించారు. మన మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. ఒక పరిధిలో ఉంచుతూ ఎంతో పద్ధతిగా పెంచుతారు. ఊపిరి సలపనంత పద్ధతిగా పెరుగుతాం మేము" గొంతులో ఏదో అడ్డు పడ్డట్లుగా అయి మాట్లాడలేక చేతుల్లో ముఖం దాచుకున్నాను.

పది నిమిషాలు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు అంకుల్. నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను.

“మరొక్క మాట... నియతినీ అరుణ్ను కౌన్సెలింగ్కు పంపిద్దాం" అంకుల్ మౌనాన్ని చేధిస్తూ అన్నాను.

సమాధానం చెప్పలేక తలదించుకున్నారు.

"నియతిని నేను సమర్థించడం లేదు అంకుల్. తను అలా తొందరపడకుండా ఉండాల్సింది. అయినా మనమెవ్వరమూ తనను నిందించవద్దు. కోప్పడి 'ఇలా చేశావేంటి' అని తిడితే ఇంకా ముడుచుకుపోతుంది. మనసు విప్పి మాట్లాడదు. ప్రేమగా మాట్లాడదాం. నీకు మేమున్నాం అనే ధైర్యాన్ని కలిగిద్దాం."

అంకుల్ మౌనంగా తలూపారు, ఆయనలో పశ్చాత్తాపం దహించివేస్తోంది.

"అరుణ్, మీరూ నియతీ కలిసి ఒకసారి కౌన్సెలింగ్కి వెళ్లండి. పరిస్థితులు చక్కబడతాయి."

"చివరకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మీ ఫ్రెండ్" బాధగా అన్నాడు అరుణ్.

"చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలా?"

“నేను నియతికి ఏం తక్కువ చేశాను?"

"మీరేమీ తక్కువ చేయలేదు అరుణ్. మోయలేనన్ని సుఖాలూ, వద్దన్నకొద్దీ ధనం, చీరలూ, నగలూ... అన్నీ ఇస్తున్నారు. కానీ తనకు ఏది ఇష్టమో తెలుసుకోలేకపోయారు. ఆమె సున్నితమైన మనసు ఎంత గాయపడితే ఇటువంటి పని చేసిందో ఆలోచించండి. మీ ఇంట్లో అది ఇన్నాళ్లూ ఒక దోషిలా, జీవచ్ఛవంలా బతుకుతోంది. చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఏడుపు మానడానికి వాడిముందు ఎన్నో బొమ్మలు పడేస్తాం. వాడు చికాకుగా అన్నీ తోసేస్తూ అలాగే ఏడుస్తుంటాడు. కానీ వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటూ ముద్దాడితే వెంటనే ఏడుపాపేసి కిలకిలమని నవ్వుతాడు. నీతూ మనసు కూడా అటువంటిదే. మానసికంగా తనను మీ మనసుకు హత్తుకున్నారా... తన మనసులోని ఆవేదన ఏమిటో తెలుసుకున్నారా... తనకి ఏం కావాలో అడిగారా... నీతూ ఎంత ఒంటరితనంతో బాధపడుతోందో ఒక్కసారి ఆలోచించండి అరుణ్."
అరుణ్ మాటలు రానివాడిలా తలదించుకున్నాడు. అతని ముఖంలో తప్పు చేశానన్న అపరాధభావం కనబడింది.

ఇంకా ఎంతో మాట్లాడాలన్న నా ఆత్రాన్ని ఆపేసుకుంటూ, "మీకు ప్రేమ లేదని కాదు. ఒక కమ్యూనికేషన్ గ్యాప్. నీతూని అర్థం చేసుకోండి" అన్నాను.

నాలుగు రోజుల్లో నియతి కాస్త కోలుకుంది. కాస్తంత ఆహారం తీసుకోగలుగుతోంది.

మానసికంగా ఎంత ఒత్తిడికి లోనయిందో తన మొహం చూస్తుంటే అర్థం అవుతుంది.

ఏకాంతం దొరకగానే 'నీతూ' అంటూ పిలిచాను. నేను మాట్లాడేలోపు భోరున ఏడ్చేసింది. ఏడవనీ, కరవుతీరా ఏడవనీ. మనసు కరిగి నీరవ్వనీ. నేను మాట్లాడకుండా తననే చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి సర్దుకుంది.

"ఏయ్ పిచ్చిమొద్దూ... మమ్మల్నందరినీ వదిలేసి అలా ఎలా వెళ్లిపోదామనుకున్నావు? ఈ బంధం అంత తేలికగా తెగిపోతుందను కున్నావా? చూడు మీ పేరెంట్స్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ డాక్టర్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారో? 'మా బంగారుతల్లి భవిష్యత్తు కోసం కనని కల లేదు, చెయ్యని ఏర్పాటు లేదు. చివరకు ఇలా అయింది' అంటూ ఇద్దరూ కుమిలిపోతున్నారు.

అరుణ్ హటాత్తుగా పదేళ్లు పై పడినట్లు అయిపోయాడు. 'మీరెళ్లి ఫ్రెష్ అయి రండి, నేనుంటాను నీతూ దగ్గర' అని నేనెన్నిసార్లు చెప్పినా, నిన్ను క్షణం కూడా వదిలి వెళ్లలేదు. అతని కళ్లల్లో కదలాడిన దిగులు వెనుక ప్రేమ లేదంటావా? నువ్వు నాకు రాసిన లెటర్ను అరుణ్కి ఇచ్చి చదువుకోమన్నాను. ఉత్తరం చదివి విలవిల్లాడిపోయాడు. దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. అతనికి నీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచటం చేతకాదను, ఒప్పుకుంటాను. కానీ, నీలోని మెతకతనాన్నీ మంచితనాన్నీ ఎన్నాళ్లు కప్పేసుకుంటావు నీతూ. నీకేం తక్కువైందని? ధైర్యంగా నీ మనసులోని మాటలను చెప్పలేవా? మూడేళ్లకే పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు అంటుంటే జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోవడమేమిటే? అనుక్షణం కాంప్రమైజ్ అవుతూ బతకమని నేను చెప్పను. నీకు నచ్చని, నీకు సంబంధంలేని విషయాలను సూటిగా చెప్పు. అలా చేయలేననుకుంటే ఆ ఇంటి నుండి శాశ్వతంగా వచ్చేసి స్వేచ్ఛగా బతుకు. అంతేకానీ జీవితాన్ని ముగించు కోవాలనుకోవడం పరిష్కారం కాదు.

స్వేచ్ఛ అనేది ఎవరో నీకు ఇచ్చే వస్తువు కాదు నీతూ. ఆ స్వేచ్ఛను పొందే ప్రయత్నం చేయాలి. భగవంతుడు నీకిచ్చిన అపురూపమైన జీవితాన్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోవడం ఎంతవరకూ న్యాయం చెప్పు? నువ్వింత పిరికిదానివి అవుతావని నేను ఊహించలేకపోయాను. అరుణ్ తన పొరపాటు గ్రహించాడు. ఈ డిప్రెషన్ నుండి బయటపడు"

నా ఒళ్లో తల పెట్టుకుని మాటిమాటికి కళ్లు తుడుచుకుంటూ నేను చెబుతున్న మాటలకు చిన్నపిల్లలా తల ఊపుతున్న నియతి జుట్టుని ప్రేమగా నిమురుతూ... 'నీకు నేను లేనా నీతూ?' అంటూంటే చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడుస్తూ మరింత అంటుకుపోయింది. నియతి చేత మరోసారి ఇటువంటి పిచ్చిపని చేయనని ఒట్టు వేయించుకున్నాను.

ఈలోగా అరుణ్ వచ్చాడు. నియతి చటుక్కున అరుణ్ వైపు చూసింది. ఇద్దరి కళ్లూ క్షణం సేపు కలుసుకున్నాయి. 'నన్ను క్షమించవూ' అన్నట్టు జాలిగా అభ్యర్థనగా చూస్తున్న అతని చూపులకు తల వంచుకుంది. నియతి తలను దిండుమీదకు జరిపి ఆమె నుదుటిని మృదువుగా స్పృశించి నెమ్మదిగా బయటకు అడుగులు వేశాను... వారిరువురికీ ఏకాంతాన్ని కల్పిస్తూ.





ప్రచురణ: ఈనాడు
రచయిత: యశోదాకైలాస్ పులుగుర్త

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి