Credits:ఈనాడు [14-11-2021]
-పూర్ణిమ
“ఏమన్నారు డాక్టర్” అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి.
"బీపీ బాగా పెరిగి బ్రెయిన్లో క్లాట్ వచ్చిందట. అందుకే కోమాలోకి వెళ్లింది. మెడికేషన్కి రెస్పాండ్ అయితే సరే. లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదట" కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది శృతి.
"అమ్మ ఇలా ఇంతసేపు పడుకోవడం ఎప్పుడూ చూడలేదు కదా" చరణ్ అన్న మాటలకి జలజలా నీళ్లు రాలాయి కృతి కళ్లలో నుంచి. అవేం వినిపించుకోకుండా మాలతినే చూస్తోంది ప్రశాంతి. 'బాగా అలసిపోయాను. కాసేపు పడుకుంటాను' ఫోన్లో మాలతి అన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. 'కాసేపు అని చెప్పి రెండు రోజులైంది మాలతీ, ఇంకలే నిద్రలో నుంచి' అనుకుంటుంటే ప్రశాంతి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. కానీ నిగ్రహించుకుంది పిల్లలని చూసి. “ఏం టెన్షన్ పడకండమ్మా, అమ్మకి ఏం కాదు, లేస్తుంది. ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి తగ్గనిది ఏదీ లేదు. ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను, ఏం కాదు” ఏడుస్తున్న కృతిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి. "ఏదయినా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండీ మేము. మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతికి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది. ఈ మాత్రమన్నా తను బతికి ఉందంటే అంతా మీ చలవే, థ్యాంక్యూ" చేతులు జోడించి చెబుతున్న ప్రవీణ్ని చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి.
“ఆంటీ, మీరు ఊరి నుంచి ఇటే డైరెక్టా వచ్చేశారు కదా... కాసేపు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. అమ్మకి మెలకువ వస్తే నేను కాల్ చేస్తాను. అయినా ఇక్కడ ఒక్కళ్లనే ఉండనిస్తారు. నాన్న ఉంటున్నారు, మనం వెళ్లాం ఇంటికి" ప్రశాంతితో అంది శృతి. "నేను మా అమ్మావాళ్ల ఇంటికి వెళ్తాను. రేపు మార్నింగ్ వస్తాను. ఈలోపు మా కజిన్తో మాట్లాడతాను" మాలతిని మళ్లీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి.
“ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో, ఏమంటున్నారు? అమ్మ కండిషన్ ఎలా ఉందట?" మర్నాడు పొద్దున్న హాస్పిటల్లోకి వస్తున్న పశాంతిని చూడగానే ఆతంగా అడిగింది కృతి.
"నైట్ మాట్లాడాను. జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి దిగజారలేదు, అంతవరకూ అదృష్టమే. ఏదో ఒక రికవరీ సైన్ మొదలయితే రిస్క్ తప్పినట్టే అన్నాడు" చెబుతూ బ్యాగులో నుంచి ఒక పొట్లం బయటకి తీసింది ప్రశాంతి. "ఏమిటది ఆంటీ?"
"ఆకు సంపెంగ పూలు, మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా. బెడ్ పక్కన పెడదామని తెచ్చాను. వాసన ఏమన్నా తెలుస్తుందేమో." "అమ్మకి ఈ పువ్వులు ఇష్టమా, మాకు తెలీదే. మీకేమన్నా తెలుసా నాన్నా" అడిగింది శృతి. అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్
ఈలోపు మాలతి దగ్గరకి వెళ్లి బెడ్ పక్కన బౌల్లో సంపెంగపూలు పెట్టి తన చెవి పక్కన ఐపాడ్ పెట్టింది... "నీ ఫేవరెట్ కిశోర్కుమార్ పాటలన్నీ ప్లే లిస్ట్లో పెట్టుకొచ్చాను మాలతీ. వినడానికే తీరిక లేదన్నావు కదా, ఇప్పుడు విను అన్నీ" అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది.
"ప్రశాంతి గారూ ఏం చేస్తున్నారు. హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు" ఆదుర్దాగా అంటున్న ప్రవీణ్ని చూసి "లేదండీ, మా కజిన్ చెప్పాడు తనకి ఏవేవి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ
తనకి వినిపిస్తూ ఉండమని. హాస్పిటల్ వాళ్లు కూడా పర్మిషన్ ఇచ్చారు. పర్లేదు" అంది ప్రశాంతి.
"ఇవన్నీ అమ్మకి ఇష్టమని మీకెలా తెలుసాంటీ" మళ్లీ అడిగింది కృతి.
"ఎందుకు తెలీదురా. మేమిద్దరం ఐదేళ్లు కలిసి చదువుకున్నాం. అప్పటి తన ఇష్టాలు ఇవి. మరి ఇప్పుడు తనకేం ఇష్టమో మీరు చెప్పండి. అవి కూడా ట్రై చేద్దాం" మాలతి భర్తనీ పిల్లలనీ చూస్తూ అడిగింది ప్రశాంతి.
'అవునూ, అమ్మకి ఏం ఇష్టం...' మొహాలు చూసు కున్నారు పిల్లలు ముగ్గురూ. 'మాలతికి ఏం ఇష్టం' ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్.
“అమ్మ స్పెసిఫిక్గా తనకేం ఇష్టమో ఎప్పుడూ చెప్పలేదు ఆంటీ" రెండు నిమిషాల మౌనం తరువాత నెమ్మదిగా అంది శృతి. "నీకు యెల్లో కలర్ ఇష్టం కదా" సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది శృతి. "అవును ఆంటీ, మీకెలా తెలుసు"
"అదొక్కటే కాదు, మీ ముగ్గురికీ, మీ నాన్నగారికీ, మీ బామ్మకీ,
తాతగారికీ... అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు. మీకు నచ్చే రంగులూ, మెచ్చే రుచులూ, మీ అభిరుచులూ అన్నీ తెలుసు. ఎలా తెలుసూ అంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారీ తన మాటల్లో ఇవే ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరూ చెప్పకుండానే తెలుసుకుని అవన్నీ మీకు
అమర్చిపెడుతుంది. మరి తనని మీరెవరూ ఎప్పుడూ అడగలేదా
తనకి ఏం ఇష్టమో" సూటిగా అడిగిన ప్రశాంతి ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు. చిన్నబోయిన వాళ్ల మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది.
వాళ్లు ఇంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడానేమో
అనిపించింది.
అనుకోకండి. నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే. ప్లీజ్ "సారీ, ఏమీ డోంట్ మైండ్" అంటూ శృతి భుజం మీద చెయ్యి వేసి చెప్పింది.
"మీరు సారీ చెప్పడం ఏమిటండీ. మీరన్నది నిజమే. పెళ్లైన ఇన్నేళ్లల్లో తనకి ఏది ఇష్టమో తనెప్పుడూ చెప్పలేదు. తెలుసుకోవాలని మేమూ ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా. ఆ ఆలోచనే ఎందుకు రాలేదో నాకే అర్థం కావట్లేదు. మీరొక్క ఐదేళ్లు కలిసి చదువుకున్నందుకే అన్నీ గుర్తు పెట్టుకున్నారు. పాతికేళ్ల నుంచీ కలిసి ఉన్నా తనకి ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నా అంటే నాకే సిగ్గుగా ఉంది" ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు. “ప్లీజ్, ఈ టైమ్లో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవడం గురించే, ఈ డిస్కషన్ ఇప్పుడొద్దు" ప్రశాంతికి చాలా ఇబ్బందిగా ఉంది.
"అవునాంటీ, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి. అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు. ఇంట్లోనే ఉన్నా మాకెవరికీ తనకి బాలేదని తెలీదు. తనేం చెప్పలేదు. వేరే ఊళ్లో ఉన్న మీకెందుకు డౌట్ వచ్చింది... అమ్మ మీకేమన్నా చెప్పిందా... మాకెవరికీ చెప్పకుండా మీకెందుకు చెప్పింది?" డైరెక్టుగా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి. ఏం చెప్పాలో తెలీలేదు.
"పర్లేదు చెప్పండి ఆంటీ, మీకెందుకు అలా అనిపించింది... అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో... అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రైజ్ అయింది... అది కూడా తనకి ఇంతవరకూ లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది... ఏమైందో మాకు కూడా తెలియాలి కదా..." చరణ్ కూడా అడిగాడు.
"తనకి ముందు నుంచీ బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు. డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచీ ఉంది. కాకపోతే తనెప్పుడూ హెల్త్ చెకప్ చేయించు కోలేదు కాబట్టి బయటపడలేదు అంతే. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువ అయినట్టుంది" ప్రశాంతి చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు.
"అమ్మకి స్ట్రెస్సా... అంత స్ట్రెస్ తనకేం ఉంటుంది ఆంటీ? మాకు ఏ ఇబ్బందులూ లేవు. నాన్న బిజినెస్ బాగుంది. నాకు జాబ్ వచ్చేసింది. పెళ్లి అయిపోయింది. కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయింది క్యాంపస్ సెలక్షన్లో. ఇంకా తమ్ముడి చదువు ఒక్కటే మిగిలింది. అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదామనుకుంటున్నాడు. ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవడం ఒక్కటే అమ్మ చేసేది. ఇక తనకెందుకు ఉంటుంది స్ట్రెస్" ఆశ్చర్యంగా అడిగింది శృతి.
"అందరినీ చూసుకోవడంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి. నేను తనకి త్రీ ఇయర్స్ నుంచీ చెబుతున్నాను... 'మార్నింగ్ వాక్కి వెళ్లు. కనీసం ఒక గంట నీతో నువ్వు గడుపు' అని. తనకి ఈరోజు దాకా కుదరలేదు. మీ అందరివీ తలా ఒక టైమింగ్స్. మీ అందరికీ ఎవరికి
కావాల్సినవి వాళ్లకి టైం ప్రకారం అందించాలి. మీ బామ్మకీ తాతయ్యకీ వాళ్ల టైమ్కి వాళ్లకి అన్నీ అందివ్వాలి. మీ అందరివీ తలా ఒక రుచులు, మీరు తినేవి మీ బామ్మావాళ్లు తినరు. వాళ్లకు విడిగా, మీకు విడిగా, మీ నాన్నకు విడిగా వండి, మీకెవ్వరికీ లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి. ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది. మళ్లీ ఎర్లీ మార్నింగ్ ఐదుగంటలకల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి. మీ బామ్మగారికి పూజకి అన్నీ అమర్చిపెట్టాలి. వీటన్నిటిలో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూపించుకోవడం మానేసింది." అందరూ కామ్గా వింటున్నారు.
“మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను. అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు. చూస్తుంటే చాలా అలసటగా కనిపించింది. అప్పుడే అడిగాను... ఒంట్లో బాలేదా అని. ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచం నలతగా ఉందని టెన్షన్, తరువాత చరణ్కి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చుందట. 'నిద్ర సరిగా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉంది' అని చెప్పింది. కానీ నాకు తనని చూస్తుంటే ఎందుకో అస్సలు బాలేదని అనిపించింది. 'ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లు' అని చెప్పాను. సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది" అక్కడితో ఆపింది ప్రశాంతి. "కానీ నైట్ మీరు కాల్చేసి 'మీ అమ్మకి బాలేనట్టుంది, అర్జెంటుగా వెళ్లి చూడు' అని ఎందుకు చెప్పారు ఆంటీ? మళ్లీ కాల్ చేసి తను చెప్పిందా, మీకెందుకు అంత అర్జెంటు అనిపించింది? ప్లీజ్ చెప్పండి ఆంటీ" శృతి వేడుకోలుగా అడిగింది.
"నేను మళ్లీ నైట్ కాల్ చేశాను. అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది. ఏవేవో మాట్లాడింది. అందుకే కంగారు పడ్డాను." “ఏం మాట్లాడింది ఆంటీ? ప్లీజ్ చెప్పండి. మా తప్పు ఏం ఉందో మేము తెలుసుకోవాలిగా" కృతి మళ్లీ అడిగింది. వాళ్లు అంతలా అడుగుతుంటే జరిగిందంతా చెప్పక తప్పలేదు ప్రశాంతికి.
“మాలతీ వెళ్లావా హాస్పిటల్కి " మాలతి ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే అడిగింది ప్రశాంతి. "లేదు."
“ఎందుకు వెళ్లలేదు... ప్రవీణ్ణారు ఇంకా రాలేదా?" “వచ్చారు, మా అత్తగారికి బాలేదని హాస్పిటల్కి వెళ్లారు మళ్లీ " “ఆవిడకి ఏమైంది సడన్గా...".
"ఈరోజు నాకెందుకో వేళగాని వేళ నిద్ర పట్టేసింది. వాళ్లకి టైమ్కి పళ్లూ, కాఫీ, మందులూ ఇవ్వడం మర్చిపోయాను. అందుకని ఆవిడకి కడుపులో అసిడిటీగా ఉన్నట్టుంది. ఈయన రాగానే చెప్పింది. అందుకని వెంటనే ఎందుకన్నా మంచిది అని ఇద్దరినీ తీసుకెళ్లారు" పొడిపొడిగా అంది మాలతి.
"ఓహ్, అంతేగా. మరి నువ్వు కూడా వెళ్లాల్సింది వాళ్లతో పాటూ నీ చెకప్ కూడా అయ్యేదిగా." "నాకవన్నీ అవసరమంటావా... నేను ఉంటేనేం పోతేనేం... ఎవరికి
తేడా పడుతుంది" ఒక్కసారిగా బరస్ట్ అయింది మాలతి.
"మాలతీ, ఏం మాటలవి... ఏమైంది నీకు... ఎందుకంత అప్సెట్
అవుతున్నావు... నీకేదో బాలేదని అనిపిస్తోంది నాకు, ప్లీజ్
తమాయించుకో" ఆదుర్దాగా అంది ప్రశాంతి.
"లేదు ప్రశాంతీ, నేను ఇంతవరకూ ఎవరితో చెప్పలేదు. కానీ నాకనిపిస్తుంటుంది... నా గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోరు. ఇన్నేళ్లుగా టైమ్కి అన్నీ అందిస్తున్నాను, ఒక్క రోజు ఇవ్వలేదు అంటే - ఎందుకు అని ఆలోచించాలిగా. అన్నీ టేబుల్ మీదే ఉంటాయి,
వాళ్లకి తెలుసు, అయినా తీసుకోకపోగా నామీద కంప్లైంట్ చేస్తారు. పోనీ నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకు అని. వాళ్లని సరిగ్గా చూసుకోలేదని పెద్దపెద్దగా అరిచేసి వాళ్లని హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్లారు. అప్పటికీ నేను అడిగాను 'నేను కూడా వస్తాను అని'. నేను చెప్పేది వినకుండా 'నువ్వు పడుకో నేను
చేసుకోగలను నా పేరెంట్స్కి' అని వెళ్లిపోయారు" గొంతు రుద్ధమైంది మాలతికి.
“మాలతీ, ఏదో చిరాకులో అని ఉండొచ్చు, అవన్నీ పట్టించుకోకు.
నువ్వెందుకో చాలా ఆవేశపడుతున్నావు కొంచం కూల్ అవ్వు ప్లీజ్." "ఇది ఈరోజు మాత్రమే కాదు ప్రశాంతి, ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. నీకు తెలుసు నేనెంత తాపత్రయపడతానో నా కుటుంబం కోసం. మూడు రోజుల నుంచీ నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. ఇవాళంతా భోజనం కూడా చెయ్యలేదు. కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు. నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలసటగా ఉందన్నావు. మరి వీళ్లెవరికీ ఎందుకు తెలీలేదు. నేను వీళ్లందరి మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్లు డల్గా ఉన్నారో బానే ఉన్నారో కనిపెట్టగలుగుతాను. మరి వీళ్లెవరూ నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు... నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా. ఇక నేను ఉంటే ఎంత, లేకపోతే ఎంత.”
"నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతీ"
"ఇది ఆవేశం కాదు ప్రశాంతి, ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్న వ్యధ. ఎందుకు నా గురించి వీళ్లెవరూ పట్టించుకోరు. కట్టుకున్న భర్తే కాదు కడుపున పుట్టిన పిల్లలు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా నన్నెందుకు తీసుకుంటారు. వాళ్ల గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్లెందుకు నా గురించి కేర్ తీసుకోరు. నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు." "ఎప్పుడన్నా చెప్పావా మరి, ఇంట్లోవాళ్లకి ఇవన్నీ." "లేదు, చెప్పాలా వాళ్లకి తెలీదా."
"తెలియకపోతే తెలియచెప్పాలి. అంతేకానీ నీలో నువ్వే కుమిలిపోతే ఎలా. ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో, అప్పుడు అవతలివాళ్లు ఇస్తారు. వాళ్లు పట్టించుకోవట్లే అంటున్నావు, నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు. అదింకా పెద్ద తప్పు. వాళ్లందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అని ఒక నమ్మకం. అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్స్ ఇది. ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు. పిల్లల్ని తీసుకుని అయినా సరే ఒకసారి డాక్టర్ని కలిసిరా, ప్లీజ్ నా మాట విను" వేడుకోలుగా అడిగింది ప్రశాంతి.
అనిపించింది ప్రశాంతికి. శృతి నంబర్ తన దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చి వెంటనే తనకి ఫోన్ చేసింది. *
*
"ఇదీ జరిగింది..." ప్రశాంతి చెప్పింది విన్న అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 'అమ్మని మేము ఇంత బాధ పెట్టామా' శృతి తనలో తానే
గొణుక్కుంది. “తను మిడిల్ ఏజ్లో ఉంది ఈ టైమ్లో హార్మోన్ డిస్టర్బన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు. అందులోనూ విపరీతంగా అలిసిపోయి ఉందేమో తనకి ఎందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది. ఇన్నేళ్లుగా అందరి గురించీ ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంది తను. కానీ అదెవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా చెయ్యకపోతే చెయ్యలేదంటారు" ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి.
"తప్పు నాదే. ఆరోజు నేను ఇంటికి వచ్చేసరికి మాలతి పడుకుని ఉంది. మా అమ్మ నేను ఇంటికి రాగానే 'కడుపులో మంట, కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్లు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు' అని గొడవ గొడవ చేసింది. నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మాలతిని వాళ్లకి టైమ్కి మందులు ఎందుకు ఇవ్వలేదని అరిచేశాను. తనేదో చెప్పబోతున్నా వినలేదు. వాళ్లిద్దరినీ హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్లాను. 'నేనూ వస్తాను హాస్పిటల్కి' అని మాలతి అంది కూడా. కానీ తనకి బాలేక వస్తానంటోందని అర్థం చేసుకోక 'నువ్వు హాయిగా నిద్రపో, నేనే చూసుకుంటా మా అమ్మనీ నాన్ననీ' అని అరిచేసి వెళ్లిపోయాను. అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే ఇలా జరిగేది కాదు. నాదే తప్పు" కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రవీణ్.
"ప్లీజ్, మీరు కంట్రోల్ చేసుకోండి. అందుకే నేనేమీ చెప్పొద్దనుకున్నాను. కానీ ఇందాక శృతి అన్నట్టు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను."
అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది... “ఇందాక అడిగా కదా మాలతికి ఏం ఇష్టం అని... నేను చెప్పనా- తనకి మీరందరూ అంటే ఇష్టం. కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకి ఇంకా ఇష్టం. తను మీ అందరినీ ఎలా గారాబం చేస్తుందో, మీకు కావాల్సినవి ఎలా సమకూర్చి పెడుతుందో, మీకే చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం చెప్పక్కర్లేదు. కానీ అప్పుడప్పుడూ తనకి కూడా- తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది. తనకి కూడా గారాబం కావాలనీ, తన గురించి కేర్ తీసుకోవాలనీ, అవేవీ తను అడక్కుండానే మీరంతా తెలుసుకోవాలనీ అనిపిస్తుంది. తనకే కాదు నాకైనా అంతే. కాకపోతే నేను నాకు కావాల్సింది. ఇంట్లోవాళ్లని డైరెక్టుగా అడుగుతాను. మాలతిది చాలా మెత్తటి స్వభావం, తనకు కావాల్సింది తను అడగ లేదు. అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి."
"అమ్మకి ఒక్కసారి తగ్గనివ్వండి, ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు రిపీట్ చెయ్యం" ఉద్వేగంగా చెప్పింది కృతి. "ఎందుకు తగ్గదు. మీ అందరి కోసం కచ్చితంగా లేచి
కూర్చుంటుంది. అదుగో డాక్టర్గారు వస్తున్నట్టున్నారు... రిపోర్ట్స్
చూసి ఏ విషయం చెబుతా అన్నారు." అందరూ లేచి నించున్నారు.
నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తూనే అర్థమైపోయింది ప్రశాంతికి...
హాయిగా ఊపిరి పీల్చుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి