నందనుడు చేపలు పడుతూ.. జీవనం సాగించేవాడు ఓ రోజు వలలో చేపలతో పాటు ఓ రాగి పాత్ర దొరికింది బాగుందని ఇంటికి తీసుకెళ్లాడు. మర్నాడు వేటకు వెళుతూ మిగిలిన అన్నాన్ని ఆ రాగి పాత్రలో వేసి ఉట్టి మీద పెట్టాడు. రాత్రి అన్నం తిందామని రాగిపాత్రను ఉట్టిమీద నుంచి కిందకు దించాడు అందులో ఉన్న కాస్త అన్నాన్ని కంచంలో వేసుకుని తిన్నాడు తీరా చూస్తే రాగిపాత్రలో అన్నం అలాగే కనిపించింది. ఏదో పరధ్యానంలో మొత్తం అన్నం వేసుకోలేదేమో అనుకొని... ఈ సారి మొత్తం తీసి వేసుకున్నాడు. ఆ రాగిపాత్రలో మళ్లీ అన్నం కనిపించింది. చిన్నప్పుడు తన తాత చెప్పిన 'అక్షయ పాత్ర' ఇదే అని అర్థమైంది. అప్పుడే వాళ్ల తాత చెప్పిన మరో విషయం గుర్తుకు వచ్చింది. ఈ అక్షయ పాత్ర' వల్ల ఎంత లాభమో.... అంత నష్టమూ ఉంటుందనీ.... సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా పరోపకారం కోసం ఉపయోగించాలని అన్నాడు. ఇందులో కేవలం ఆహార పదార్థాలే వేసి పేదల ఆకలి తీర్చాలని చెప్పాడు. 'ఆ... మా తాతకు చాదస్తం ఎక్కువ' అని అను కున్నాడు నందనుడు, తన దగ్గర ఉన్న కాస్త బంగారాన్ని అక్షయ పాత్రలో వేసి. కాసేపటికి తీశాడు. కొత్త బంగారం పుట్టుకొచ్చింది. ఇలా చాలా సార్లు చేశాడు. ఓ బస్తా బంగారం వచ్చాకా, బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్లి తన దగ్గర బస్తా బంగారం ఉందని చెప్పి, ఎంతకు కొంటావని అడిగాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న దొంగలు విన్నారు. రాత్రి కాగానే నందనుడి ఇంటి మీద దాడి చేశారు. ఎదురు తిరిగిన అతడిని కత్తితో పొడిచి ఆ బంగారాన్ని తీసుకెళ్లారు. 'నా దగ్గర అక్షయపాత్ర ఉంది ఎన్ని బస్తాల బంగారమైనా మళ్లీ తీసుకోగలను. కానీ సమయానికి నాకు ఆ విషయం గుర్తుకు రాక బంగారం కోసం ఆ దొంగలను అడ్డుకున్నాను. ఇప్పుడిలా వాళ్ల చేతిలో చనిపోతున్నా, తాత చెప్పిన మాటల్లో ఎంతో నిజముంది' అనుకుంటూ ప్రాణాలు విడిచాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి