పిల్లి కూన

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి బైట వాములదొడ్లో ఒకపిల్లి ఉండేది దానికో బుల్లి పిల్లికూన పుట్టింది పాపం ! పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనేలేదు.

పిల్లి కూన కి ఆకలి వేసింది. పాలు కావాలి. కాని, ఎలా అడగాలో తెలియ లేదు దానికి

పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లి కూన వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొక కుక్క పిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా:

పిల్లి కూనా పిల్లి కూనా

గళ్ల గళ్ల పిల్లికూనా

కళ్ల నీళ్ల ఎందుకమ్తా ?

ఏడుస్తూనే అంది పిల్లికూన

కుక్కపిల్లా : కుక్కపిల్లా ఒక్క సంగతి చెప్పగలవా?

ఆకలేస్తే పాలకోసం అమ్మనేమని అడుగుతావ్ ?

కుక్కపిల్ల అంది

భౌభౌమని అరుస్తాను పసందైన కుక్కభాష పాలు

నీకుకావాలా భౌభౌమని అరిచిచూడు.

పిల్లికూన అంది :

"భౌభౌమని అరవలేను బాగులేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు."

అని పిల్లి కూన అక్కణ్ణుంచి వెళ్లి పోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే, అంభా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాషా నచ్చలేదు.
కాకిపిల్ల కనబడింది, కాకా అని ఆరవమంది.

కప్పిపిల్ల కనబడింది. బెకబెకమని పిలవమంది. మేకపిల్ల కనబడింది మేమే అని అడగమంది

పిల్లి కూన ఏడుస్తూ వెళ్లి పోయింది ఈ భాషలేవీ నాకు వద్దనుకుంది.

ఆఖరికి ఒక పెద్దపిల్లి కనబడింది ఏడుస్తున్న పిల్లికూనని బుజ్జగించి, 'పిల్లికూనా, పిల్లికూనా ఎందుకమ్మా ఏడుస్తావ్ అని అడిగింది
ఆకలేస్తే పాలకోసం అమ్మ నేమని అడుగుతావ్'

అని అడిగింది పిల్లికూన
మ్యావ్ మ్యావ్ అని బోధించింది. పెద్దపల్లి,

పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మ్యావు మ్యావు మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లింది. ఆ యింట్లో శారద అనే అమ్మాయి ఉంది. “మ్యావు మ్యావు" అంది, తల్లి లేని పిల్లికూన శారద దానిభాష తెలుసుకుంది.

“ఓహో ఆకలేస్తోందా పిల్లి కూనా, పాలు తెస్తాను తాగు"అని శారద ఒక పల్లెంనిండా పాలుపోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది తరవాత పిల్లి కూనా, శారదా చాలా సేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూనకూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది

ఇక కథ కంచికీ, మనం ఇంటికీ.

కామెంట్‌లు