ఎద్దు చెప్పిన బుద్ధి

   అయినాపురానికి చెందిన ఐలయ్యకు గానుగ ఉండేది నూనె ఆడించగా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించే వాడు. ఐలయ్య కొడుకు వరాలుకు చాలా బద్దకం. తన కొడుకు ఎలా బాగు పడతాడని బెంగగా ఉండేది.

ఒక రోజు ఐలయ్యకు కోపం వచ్చి.. 'ఈ ఎద్దూ.. నువ్వూ ఒక్కటేరా.' అని కోపగించు కున్నాడు.
ఆ మాటలు విన్న ఎద్దుకు చాలా బాధనిపించింది. ఈ ముసలి వయసులోనూ.. చాలీచాలని తిండితింటూ... గానుగ చుటూ తిరిగి.. తిరిగి నూనె తీయడానికి సాయం చేస్తుంటే.. సోమరిగా తిరిగే తన కొడుకుతో నన్ను పోలుస్తాడా!' అని అలిగి మూలన కూర్చుండిపోయింది.

ఎంత కదిలించినా కదల్లేదు. పశు వైద్యుణ్ని పిలిపించాడు. అతను పరీక్షించి ఏ జబ్బూ లేదని తేల్చాడు. ఇంతలో వరాలు తండ్రి దగ్గరకు వచ్చి సినిమాకు వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగాడు.

అసలే కోపంతో రగిలిపోతున్న ఐలయ్య 'దీనికి ఏం రోగం వచ్చిందో మూలన కూర్చుంది. ఇది తిరిగితేనే మనకు తిండి. అదేమీ పట్టకుండా సినిమాకు డబ్బులు అడుగుతున్నావు నువ్వు.

నీలాంటి పనికిమాలిన వాడిని ఈ నోరులేని పశువుతో పోల్చి తిట్టాను చూడు... అది నాదే తప్పు. నువ్వు పశువుతో కూడా పోల్చదగ్గవాడివి కాదు' అంటూ అక్కడే ఉన్న కర్రతో వరాలును రెండు దెబ్బలు వేశాడు.

ఆశ్చర్యం.. ఎద్దు లేచి గానుగ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. 'చూశావా, నీతో పోల్చినందుకు కోపం వచ్చి అది కదలకుండా కూర్చున్నట్లుంది... ఎంత సిగ్గుచేటు' అన్నాడు. అంతే ఆ సంఘటన వరాలులో పెద్ద మార్పు తెచ్చింది.

'నాతో పోల్చు కోవడానికి పశువుకు కూడా ఇష్టం లేదన్నమాట. నాకంటే ఆ ఎద్దు ఎంతో మేలు' అని బాధపడ్డాడు. మరునాటి నుంచి గానుగ దగ్గర పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా తయారయ్యాడు. తన కొడుకులో వచ్చిన ఈ మార్పునకు ఐలయ్య ఎంతో సంతోషించాడు

కామెంట్‌లు