ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్నా నాకు శ్రీరామచంద్రమూర్తి వారిపేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కాని అంతపొడుగు పెట్టి పిలవటానికి వాళ్లకే ఓపిక లేక పోయింది. అదీకాక నావంటి చిన్ని బుర్రగలవాడికి ఇంత పెద్ద పేరు? అందుచేత నా పేరు కుదించి ‘రాముడు' అన్నారు. ఐతే, ఊళ్లోవాళ్లు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి వేయినామా లుంటే నాకు రెండువేలున్నాయి బండ రాముడు, మొద్దురాముడు, రాచ్చిప్ప రాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, అడ్డతలరాముడు, పిచ్చి రాముడు, వెర్రిరాముడు, మన్నుతిన్న రాముడు, నిద్రమొహంరాముడు, దున్న పోతు రాముడు.... ఇలా ఎన్నో. మీకు కూడా ఏదన్నా మంచిపేరు దొరికితే దానితో నన్ను పిలిచుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కాని నాకు మాత్రం ఈ పేర్లన్నిటిలోకీ బండ రాముడనే పేరు బాగుండేది. ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్లు.
మా అమ్మ నన్ను, “రా.... ము.... ....లూ !" అని చాలా పొడూగ్గా పిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికి నట్టు మరొకసారి పలికేవాడుకాదు.
నా పేరుతో మానాన్న నవరసాలూ ఒప్పించేవాడు.
ఒక దసరా పండగనాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమిఏమో కాని నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా, అది నాచేతిలో తలకిందు గానే ఉండేది. “పుస్తకం సరిగా పట్టు కోరా, పశువా" అని మా నాన్న మొట్టిన మొట్టికాయలూ, తిట్టినతిట్లూ, పెట్టిన తొడపాశాలూ ఇన్నన్ని కావు.
"మొద్దు వెధవ! వెయ్యి పుఠాలు వేసినా వీడికి చదువురాదు. వెనకజన్మ లో వీడు ఏ గాడిదో అయి ఉండాలి." అని చెప్పేశాడుమానాన్న, విసుగుపుట్టి.
అక్షరాభ్యాసం అయిన నాటినుంచీ నేను ఒక్క విద్యమాత్రం బాగానేర్చా. అదేమిటంటే దెబ్బలుతినటం. తోటి వాళ్లంతా నన్నే కొట్టేవాళ్లు; ఇరుగు పొరుగువాళ్లుకూడా, తమపిల్లలకు తగల వలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్లు; పైగా మాయింటికివచ్చి, "మీ రాము డిట్లా చేశాడు, అట్లా చేశాడు" అని ఫిర్యాదు చేసేవాళ్లు. మానాన్న నన్ను చావకోట్టేవాడు; ఇక మా అమ్మకూడా నాలాంటి గాడిదను కని, ఊళ్లోవాళ్ల చేతా మానాన్న చేతా దెబ్బలుపడటానికి వప్ప చెప్పినందుకు, కోపంవచ్చి నన్నేకొట్టేది. దీనికితోడు మానాన్నదగ్గిర నేను ఎనిమిది నెలలపాటు చదువుకున్నాను. అయిదు బళ్లూ నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తినిఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడంవల్ల నావొల్లు బండబారి పోయింది. అందుకనేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం.
చిన్నతనంలో నాకు తెలివిగలపనులు చెయ్యాలని ఉండేది. మంచి పనులూ చెయ్యాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటయినకొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది.
దెబ్బలభయం మూలకంగా ఏపనిచెయ్యాలన్నా భయమే. అదీకాక ఏపనిచేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచిపనులేవో, చెడ్డపనులేవో తెలుసు కోవటం ఎలా ? అందుచేత నాకు మంచీ చెడూ తెలుసుకునేశక్తిపోయింది. నేను సాధువునయాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాము డనేవాళ్లు.
ఇంక నాకు పెద్దచదువులు చెప్పటం మానాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒకబడిలో వేశారు.
నన్ను ఒకటోక్లాసులో చేర్చుకున్నా రు. మా క్లాసులోకల్లా నేనే పొడుగు. వయసులోకూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలినవాళ్ల కెవరికీ తెలియని
విద్య ఒకటి నాకు తెలుసు. అదేమి టంటే, చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్లు, “నోరు మూసుకో, వెధవా ! నోరుమూసుకో !” అనేవాళ్లు.
వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవ రాదనో, మాట్లాడరాదనో నాకు తెలి యదు. నేను మాత్రం నోరు మూసుకో వటం నేర్చుకున్నా.
ఒకరోజు సాయంకాలం, క్లాసులో మా మేష్టారు పిల్లకాయల్ని, “ఏం కధ చెప్పను?" అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో, మాయలేడి కథ చెప్పమని అడుగు", అని రహస్యంగా ఊదాడు. “మేష్టారూ, మాయలేడి కధ చెప్పండి,” అన్నాను. ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు.
మేష్టారికళ్లు చింతనిప్పులల్లే అయాయి. ఆయనపళ్లు పటపటా కొరుకుతూ అంబశక్తికి మల్లే ఒక్కొక్క అడుగే వేసుకుంటూ, చేతిలో బెత్తం ఊపుతూ, “కోతివెధవా, పుండాకోర్, బద్మాష్" అని తిడుతూ నామీదికివచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయనకోపం తీరిందో లేదో తెలియదు. అసలాయన నన్నెందుకు కొట్టిందీ, నేనేం తప్పుచేసిందీకూడా నే నెరగను, వాచిన కళ్లతో, బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్లేటప్పుడు మా క్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు: మేష్టారిపేరు రమణయ్యట; ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారట. అందు కనేనట ఆ పేరంటే ఆయనకు కోపం.
మర్నాడు నాకు బడికిపోటానికి బుద్ధి పుట్టలేదు. కాని మానాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్లాను. మేష్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలాబాగా చూశారు. ఇవాళ మేష్టారికి డ్రాయింగు బొమ్మ వెయ్య బుద్ధయింది. చెక్ పిసు తీసుకుని తేలుబొమ్మ వేస్తూండగా ఆయనకు పొడుం పీల్చ వలిసిన అవసరం వచ్చింది. రొండినుండి పొడుండబ్బీ తీసిచూ స్తే అందులో పొడుములేదు. ఆయన నాకేసిచూసి, నవ్వి, ఎంతో అపేక్షగా, “ఒరే, నాయనా, రాముడూ, ఇలారా”, అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్లు వణుకుతూ ఆయన దర్గిరికి వెళ్లా. “ఒరే, అబ్బాయీ. ఈ పక్క దుకాణానికి వెళ్లి ఒక అర్ధణా నస్యం వేయించుకు రాగలవూ?" అన్నాడు. "వేయించుకు వస్తానండీ. . నాకు దుకాణాలకు వెళ్లటం అలవాటే. మా వీధిలో వాళ్లందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను. ఇవ్వండి,” అన్నాను ఉత్సాహంతో. ఆయనదగ్గిర పొడుము డబ్బీతోపాటు రెండు కాన్లు తీసుకుని బయటికి పరుగెత్తాను.
దుకాణంవాడికి పొడుముడబ్బీ, డబ్బులూ ఇచ్చి, పక్కనే గారడీ జరుగు తుంటే తొంగిచూశా. గారడీవాడు తురు కంలో ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతు న్నాడు. "ఓ అబ్బాయిలూ, మీలో ధైర్యంగలవాడెవడైనా ఇట్లా రండి", రాలేదు. గారడీవాడికళ్లు నా మీద పడ్డాయి. నా మనసు ఊగింది పోవాలని. కాని మేష్టారి పొడుముడబ్బీ, బెత్తమూజ్ఞాపకం వచ్చి, గబగబా దుకాణం దగ్గిరికిపోయి అక్కడ ఉన్న డబ్బీ తీసుకుని బడికి పరుగెత్తా. డబ్బీ మేష్టారి బల్లమీద పెట్టి వచ్చి మళ్లీ నాచోటులో కూర్చున్నా.
మేష్టారు తేలుబొమ్మవేసి బల్ల దగ్గిరికి వచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పుపెట్టె ఉంది. ఇదేమిటని దాన్ని తెరిచిచూసేసరికి అందులో నుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. "రాముడు మేష్టారికి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు”, అని క్లాసులో పిల్లకాయలు అరిచారు, నావీపు చెడింది అనుకున్నా.
"పొడుమేదిరా, రాముడూ ?" అని అయ్యవారడిగాడు. అప్పుడు నాకు తెలిసింది, నేను పొడుముడబ్బీకి మారుగా. ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని.
“ఇప్పుడే వెళ్లి క్షణంలో తెస్తానండీ", అంటూ మళ్లీ దుకాణానికి దౌడుతీశా.
నాస్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలా సేపు ఏడిపించి, నాచేత నీళ్లు తెప్పించి, దుకాణం ఊడ్పించి, ఆఖరుకు డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆవిధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహంవల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచిమొహం చూసి ఉంటా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి