ఒక అడవిలో ఒక కోతి చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి 'ఇది రాత్రీ పగలూ బాగా దొంగతనాలు చేసినట్లుంది. అలిసిపోయి నిద్రపోతోంది. అనుకుంది.
ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువుకూ చెప్పింది.
కాసేపటికి ఎలుగు బంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది' అని దాని మిత్రులకు చెప్పింది.
ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. 'దీనికి ఏదో రోగమొచ్చినట్టుంది అనుకొని స్నేహితులందరికీ చెప్పింది.
మరికాసేపటికి అటుగా వచ్చిన కుందేలు 'ఈ కోతి ఆహారం లేక కళ్లు తిరిగి స్పృహ తప్పింది' అనుకుని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పింది.
ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో 'తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లుంది' అనుకుంది. కొంత సమయం తర్వాత... కోతిని నిద్రలేపడానికి దొంగ నక్క, ఎలుగు, కొంగ, కుందేలు, సింహం.. ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి.
అప్పుడు ఒక ముసలి గద్ద అక్కడ వాలి. ఎందుకు గుంపుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. 'ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు.
కోతి ఎందుకలా ఉందో దాన్నే అడిగి తెలుసుకుందాం!' అంది. జంతువులన్నీ అరిచేసరికి కోతి కళ్లు తెరిచి చూసింది. గద్ద విషయం మంతా దానికి వివరించింది. కోతి కిచ.. కిచ... నవ్వి.. 'కాదు.. కాదు.. నేను పట్నంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట' అంది. గద్ద నవ్వి-- 'చూశారా మిత్రులారా! విషయం తెలుసుకోకుండా... ఎవరికి తోచినవి వారు కోతికి ఆపాదించారు' అంది. అవి తమ తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కోతి మళ్లీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది.
ప్రచురణ:ఈనాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి