పమిడిపాడులో రమణయ్యది చిన్ని చిల్లరకొట్టు వ్యాపారం. బేరానికి వచ్చిన వాళ్లతో విసుక్కోకుండా నవ్వుతూ మాట్లాడ తాడు. ఊళ్లో ఎన్ని కొట్లున్నా, ఒక్క రమణయ్య కొట్టుకే జనం ఎక్కువగా వస్తారు. కొడుకు రాజేంద్ర తండ్రికి చేదోడుగా వ్యాపారంలోకి దిగాడు. అతడికి తండ్రి తీరు నచ్చలేదు. 'నాన్నా! మిగతా కొట్లవాళ్లు ఒక వస్తువు పదిరూపాయలకు అమ్మితే... నువ్వు తొమ్మిది
రూపాయలకే ఇస్తావు. ఇలాగైతే మనకు లాభాలు ఏం ఉంటాయి? మన కొట్టుకు జనం బాగా వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సంపాదించుకోవాలి' అన్నాడు ఓ రోజు. 'అలా అయితే మన కొట్టుకు ఎవరూ రారు బాబూ!' అన్నాడు. రమణయ్య. 'ఎందుకు రారు! నువ్వు సరకులు కల్తీ చేయవు. ధరా పెంచవు. నిజాయతీ అని కూర్చుంటే మనమేం సంపాదిస్తాం?' అన్నాడు రాజేంద్ర. అయినా కొడుకు మాటల్ని పట్టించుకోలేదు రమణయ్య. కొన్ని రోజుల తర్వాత... 'నేనూ... అమ్మా తీర్థయాత్రలకు వెళ్లొస్తాం. వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకో' అని చెప్పి వెళ్లాడు రమణయ్య. అయిదు నెలల తర్వాత యాత్ర పూర్తి చేసుకుని రమణయ్య వాళ్లు వచ్చారు. కొట్లో కొడుకు ఒక్కడే దిగాలుగా కూర్చున్నాడు. కొట్టు దగర జనమే లేరు. కొట్లో చాలా కల్తీ సరకులు కనిపించాయి. పట్టికలో ధరలూ ఎక్కువే ఉన్నాయి. 'చూశావు కదా రాజేంద్రా! మన కొట్టుకు వచ్చేవాళ్లు కూడా ముఖం చాటేసుకుని మరో కొట్టుకు వెళ్తున్నారు. అందుకే నిజాయతీ ముఖ్యం. ప్రాణం పోయినా అది తప్పకూడదు. మన లాభం మనం తీసు కుంటున్నప్పుడు, మోసం చేయాల్సిన అవసరం ఏంటి?' అన్నాడు రమణయ్య. కొడుకు రాజేంద్ర తలవంచుకున్నాడు. 'నువ్వు కొద్ది రోజులు కొట్టు వైపు రావొద్దు' అని కొడుక్కు చెప్పాడు. రమణయ్య కొట్లో గల్లాపెట్టె ముందు కూర్చున్నాడు. నెలరోజుల్లోనే వ్యాపారం పుంజుకుంది. తప్పు తెలుసుకున్న రాజేంద్ర ఇక ఎప్పటికీ తండ్రిలాగా నీతి, నిజాయతీ లతో వ్యాపారం చేయాలని
నిర్ణయించు కున్నాడు.
ప్రచురణ:-ఈనాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి