ఆర్జన

"నాన్నేడిరా" ఉదయపు నడక ముగించుకుని వచ్చి మనవడిని అడిగాడు

శాంతిరాజు,

"ఆఫీసు పోయాడుగా" ముద్దుగా చెప్పాడు నాలుగేళ్ల మనవడు. "ఈవేళ శనివారం సెలవు కదరా!"

“ఏదో పనుండి బయటకెళ్లారు మామయ్యా" కోడలు సర్ది చెప్పింది. కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగస్తులే. ఐదురోజుల పనిదినాల తరవాత వారాంతంలోని రెండురోజులూ సరదాగా కుటుంబం మొత్తం బయటకెళ్లడం అలవాటు. అందుకే అడిగాడు శాంతి. సాయంత్రమెప్పుడో తిరిగొచ్చిన కొడుకు కాసేపు టీవీ చూసి పడుకున్నాడు. మరునాడు మళ్లీ తను లేచేసరికే వెళ్లిపోయినవాడు రాత్రి ఎప్పటికో వచ్చాడు. తండ్రిని పలకరించి పిల్లాడితో కాసేపు ఆడుకొని పడుకున్నాడు.

కొత్తవారం మొదలయ్యింది. కోడలు ఉదయాన్నే లేచి వంట మొదలుపెట్టింది. ముసలాయన లేచి వ్యాహ్యాళికి బయలుదేరాడు. ఎప్పుడూ తాను తిరిగొచ్చేవరకూ ఇంకా పడుకునే ఉండేవాడు కొడుకు సంజీవ్. ఆ రోజు అప్పటికే లేచి వార్తా పత్రికను తెగ చదివేస్తున్నాడు. తానోగంట తిరిగొచ్చేసరికి టీవీ ముందు పెన్నూ, పుస్తకం పట్టుకుని తయారయ్యాడు. ఏదైనా ముఖ్యమైన విషయం రాసుకోవాలేమో అనుకున్నాడు కానీ ఎప్పుడూ లేనిది కొడుకు షేర్ మార్కెట్ వార్తలు చూస్తున్నాడు. అసలు ఇంట్లో ఉదయం పూట టీవీ మోగదు.... ఎప్పుడన్నా ఏదైనా ముఖ్యమైన వార్తలు చూడాల్సి వస్తే తప్పా. అలాంటిది- పెద్దవాళ్లిద్దరూ తాము తయారవుతూ పిల్లాడిని రెడీ చేసే హడావిడి ఎక్కువగా ఉండే సోమవారపు ఉదయం- టీవీ దాదాపు

మూడు గంటలు నిరాటంకంగా మోగింది. సంజీవ్ పుస్తకంలో ఏదేదో తెగ రాసుకుంటున్నాడు.

ఆపైవారమూ ఈ తంతు ఇలాగే కొన సాగింది. మొదట్లో కొడుకుతోపాటూ ముందు గదిలోనే కూర్చున్న శాంతి తర్వాత్తర్వాత తన గదిలో మంచం మీద దొర్లడం మొదలెట్టాడు. సంజీవ్ మాత్రం షేర్ మార్కెట్లో పూర్తిగా మునిగిపోయాడు. లేచిన దగ్గరనుంచీ పడుకునే వరకూ ఎంతసేపూ పెట్టుబడీ, రాబడీ గురించిన ఆలోచనలతోనే ఉండేవాడు. తదనుగుణంగానే అతని ప్రవర్తన ఉండనారంభించింది. కొంతసేపు అమితానందంగా మరి కాసేపటికి ఎంతో దిగులుగా రోజు రోజుకీ మరింత సంక్లిష్టంగా తయారయ్యాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి మెల్లగా పుత్రుడిని కదిపాడు... "కొత్తగా ఈ

పిచ్చేమిట్రా?" "హూ...!" నిర్లక్ష్యంగా నిట్టూర్చి తలవంచు కుని తన పని తాను చేసుకోసాగాడు కొడుకు.

"అది కాదురా, డబ్బులతో జాగ్రత్త అని చెప్తున్నా. ఉన్న కాసినీ ఏదో బ్యాంకులో దాచుకోక ఇలా షేర్లలో పెట్టుబడి పెట్టడం మనలాంటి సామాన్య ఉద్యోగస్తులకు మంచిది కాదురా. మా ఆఫీసులో పనిచేసే సుందరం నీకు తెలుసుకదా, ఇలాగే ఉన్న డబ్బంతా మార్కెట్లో పెట్టి

నష్టాలొచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు. అతని భార్య డిగ్రీ చదువుకుందని నేనే ఉద్యోగంలో పెట్టిస్తే ఆ అమ్మాయి ఉన్నంతలో చక్కగా సంసారాన్ని నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుని వృద్ధిలోకి తీసుకొచ్చింది. మరి మన బంధువు దుర్గారావు, షేరు మార్కెట్లో లక్షలు గడించాడు. ఎన్నో సార్లు నన్నూ దిగమన్నాడు కానీ నేను అతని మాయలో పడలేదు. లాభాలొచ్చినప్పుడు కార్లలో తిరిగి దర్జా వెలగపెట్టినోడు ఒక్కసారిగా దెబ్బతిన్నాడంతే... సంపాదించినవన్నీ పోగొట్టుకుని, చివరికి తాతలూ తండ్రులూ గడించి ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని కూడా అమ్ముకొని ఇప్పుడెక్కడో అనామకంగా బతుకు సాగిస్తున్నాడు. మనకెందుకొచ్చిందిరా ఇవన్నీ? చక్కగా ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పిల్లాడిని చదివించుకుంటూ, మిగిలింది నెలకింతని ఏ బ్యాంకులోనో, పోస్టాఫీసులోనో పొదుపు చేస్తే నీ రూపాయి ఎక్కడికీ పోకుండా భరోసా ఉంటుంది" చెప్పాలనుకున్నది చెప్పేశాడు తండ్రి. ఇక తప్పదన్నట్లు తలెత్తి, సోఫాలో వెనక్కి వాలి మొదలుపెట్టాడు కొడుకు. "నాన్నా మన మధ్యతరగతి ఆలోచనలు బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో పొదుపు చేయడంతోనే ఆగిపోతాయి. ఒక్కసారి మనమందరం జమ చేసిన డబ్బుని ఆ బ్యాంకులు ఏం చేస్తాయో ఆలోచించి చూడు, నీకో గొప్ప రహస్యం తెలుస్తుంది" తనయుడు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు శాంతిరాజు.

"మనం దాచిన సొమ్మునంతటినీ ఆ బ్యాంకులు కొందరు వ్యాపారులకు రుణంగా ఇస్తాయి. వాళ్లు ఆ డబ్బుతో వ్యాపారం చేసి వడ్డీతో కలిపి మళ్లీ బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు. దానిలో కొంత భాగం మనకు బ్యాంకు ధర్మ వడ్డీగా ఇస్తుంది. ఇక్కడే కిటుకుంది నాన్నా. మనమే నేరుగా ఆ వ్యాపారికి పెట్టుబడి పెడితే, అతను చెల్లించే వడ్డీ మొత్తం అంతా మనకే వస్తుందిగా, ఆ మార్గమే ఈ షేరు మార్కెట్ నాన్నా. మనకు నచ్చిన, ఎదుగుదల కల వ్యాపార రంగంలోని నైపుణ్యం ఉన్న సంస్థను ఎన్నుకొని కొన్ని వాటాలు కొంటే మనమూ ఆ సంస్థతోపాటు ఎదుగుతాము. రాబడి కూడా బాగుంటుంది. నష్ట భయమనేది అన్నింటా ఉంటుంది. ఒక్క షేరు మార్కెట్లోనే కాదు. అన్నిసార్లూ, అన్ని రంగాలూ అభివృద్ధి పథాన ఉండవు కదా. అది మనసులో పెట్టుకొని మన పెట్టుబడుల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సమీక్షించుకుంటూ, సరిచూసుకుంటూ, సవరించుకుంటూ మార్కెట్ పట్ల శ్రద్ధ చూపిస్తే- మన రూపాయి నువ్వు ఊహించనంత రాబడినిస్తుంది నాన్నా" ఉద్వేగంగా చెప్పుకుపోయాడు కొడుకు.

“చెప్పినంత తేలిక కాదురా, ఈ వ్యవహారం" అడ్డుకట్ట వేశాడు పెద్దాయన. "నువ్వనుకున్నంత కష్టం కూడా కాదు నాన్నా" వెనువెంటనే బదులిచ్చాడు కొడుకు. "ఎక్కడో ఇద్దరు, ముగ్గురు నష్టపోయి మొత్తం మార్కెట్ని బద్నాం చేస్తారు. రూపాయికి పది రూపాయలు సంపాదించినవాడు మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటాడు. ఎక్కువ ప్రచారం చేస్తే వేరే వాళ్లెక్కడ ఈ ఫీల్డులోకొచ్చి సంపాదించుకుంటారోనని వాడి భయం. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా, నీతోపాటు రిటైరయిన మీ అకౌంటెంటు కామేశ్వర్రావు తన ప్రావిడెంటు ఫండు డబ్బులు షేరు మార్కెట్లో పెట్టి, సంవత్సరంలో రెండింతలు చేశాడు. మొన్న శనాదివారాలు నేనెళ్లిన సదస్సుకు తానూ, తన మనవడిని తీసుకొచ్చాడు. ఇప్పటికన్నా నాకు ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు మెచ్చుకున్నాడు. పదవీ విరమణ చేసినా ఇంట్లో కూర్చుని ఎంతో సంపాదిస్తున్నాడు. రోజులో కాసేపు ఈ షేరు మార్కెట్ గురించి తెలుసుకోమని నీకూ చెప్పమన్నాడు... కానీ నువ్వేమో..." ఎదిగిన కొడుక్కి ఏ సమాధానం చెప్పలేకపోయాడు ఏళ్లొచ్చిన తండ్రి.

ఆర్జన

“నేనీరోజు పని చేస్తున్న కంపెనీ ముప్ఫై ఏళ్ల క్రితం మార్కెట్లోకి మొదటిసారి పెట్టుబడులకోసం వచ్చినప్పుడు వాటా పది రూపాయలు నాన్నా. నువ్వు ఓ పదివేలు పెట్టుంటే ఈరోజు ఆ రొక్కం విలువెంతయ్యేదో ఊహించగలవా, కోట్లు నాన్నా... కోట్లు. పదివేలు నీకు అప్పుడు పెద్ద విషయం అయ్యుండదని నాకు తెలుసు. కేవలం అవగాహనా రాహిత్యం వల్ల ఈ విషయం నువ్వు గుర్తెరగవు. గానుగెద్దులా సంవత్సరాల తరబడి కష్టపడటం, వచ్చినదాంతో తృప్తి పడటమే తప్పా మనం సంపాదించిన రూపాయి కూడా మనకోసం తిరిగి పనిచేసి ఇంకా ఇంకా రూపాయిలనార్జించే ఈ మార్కెట్ వెసులుబాటు గురించి మాత్రం నువ్వు ఎప్పటికీ పట్టించుకోవు. అసలు నీకా ఆలోచనే రాదు. అదేమంటే వాడెవడో అలా నష్టపోయాడు, ఇంకెవడో ఇలా నాశనమయ్యాడని వితండ వాదనలు చేస్తావు. వార్తా పత్రికలు వాణిజ్య వార్తల కోసం ప్రత్యేక పేజీలు పెడుతున్నా, ఛానళ్లు 24 గంటలూ ప్రత్యక్షంగా ప్రసారాలు నడుపుతున్నా, మనం సినిమా పాటలూ, జోకులూ చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటాం. మొన్నటి షేర్ మార్కెట్ సదస్సుకెళ్తే నాకివన్నీ తెలిశాయి. మనం సంపాదించిన డబ్బును సరైన విధంగా మదుపు చేస్తే, మనం నిద్రించే సమయంలో కూడా ఆసొమ్ము మనకోసం పనిచేస్తూ ఎదుగుతూ ఉంటుందని ఉదాహరణలతో సహా అక్కడ వివరించారు నాన్నా. అప్పుడే తెలిసింది మనమెంత చీకటిలో బతికేస్తున్నామో. ఇంత కాలం మన డబ్బు వేరెవరి చేతిలోనే పెట్టి వాళ్లు కోట్లు గడిస్తుంటే అది వాళ్ల అదృష్టమనీ, వాళ్లు విదిల్చే నాణాలే మనకు ప్రాప్తమనీ వేదాంతం చెప్పుకుంటూ బతికాం. ఇంక అలా కాదు నాన్నా. నేనూ మార్కెట్ని అధ్యయనం చేస్తాను. సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టి ఎక్కువ తిరుగు రాబడి వసూలు చేస్తాను" దృఢంగా చెప్పి మళ్లీ మార్కెట్ వార్తల్లో మునిగిపోయాడు సంజీవ్.

ఓ రోజు ఆఫీసునుంచి తిరిగొచ్చిన సంజీవ్ ఆనాటి మార్కెట్ విశేషాలు టీవీలో చూస్తున్నాడు. టీ తెచ్చిన భార్య, పక్కన కూర్చుని, "మీరేమో రేయింబవళ్లూ తెగ కష్టపడి సంపాదిస్తున్నారు. మీ నాన్నగారేమో ముందూ వెనుకా చూడకుండా తెగ దానాలు చేసేస్తున్నారు" అంది. "ఏమైంది?"

“ఇందాక ఎదురింటి 'ఫర్జానా' వచ్చింది. ఈ రోజు ఇంటర్ ఫలితాలు వచ్చాయి"

“ఓ, వాళ్లబ్బాయి తాహిర్ పాసయ్యాడా? నాన్న వాడిని మెచ్చి పైసలేమన్నా చేతిలో పెట్టాడా?"

“చెప్పేది వింటారా? నేను ఆఫీసునుంచి వచ్చి తలుపు తీశాక, ఫర్జానా తన కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది. వాడు పాసవ్వలేదట, అందుకని మనకి సారీ చెప్పించడానికి తీసుకొచ్చింది. మామయ్య అప్పటికే పార్కుకు వెళ్లిపోయారు. అందుకే నాకు అసలు విషయం తెలిసింది"

గొప్ప రహస్యాన్ని కనిపెట్టిన దానిలాగా ఉపోద్ఘాతం ఇచ్చింది భార్య. "అసలు విషయం ఏంటీ?" అనుమానంగా అడిగాడు సంజీవ్. "అదే చెప్పానుగా మనకి సారీ చెప్పించడానికి కొడుకుని తీసుకొచ్చిందనీ" "వాడు పాసవ్వకపోతే మనకి సారీ చెప్పించడం దేనికీ? నాకర్థం కాలేదు" “రెండేళ్ల క్రితం ఎదురు ఫ్లాట్ అహ్మద్ అర్ధాంతరంగా ప్రమాదంలో పోయినప్పుడు, ఆయన చేసిన అప్పులు తీర్చి, ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఫర్జానా ఫ్లాట్ అమ్మేస్తుందని అనుకున్నారు కదా అందరూ. కానీ ఆమె అలా చెయ్యకుండా ఇల్లు నిలబెట్టుకుని పిల్లల్ని ఎలా చదివిస్తోందో తెలుసా? మీ నాన్నగారు పెద్దవాడి ఇంటర్మీడియట్ చదువుకి రెండేళ్లకీ కలిపి రెసిడెన్షియల్ కాలేజీలో ఒకేసారి ఫీజు కట్టారంట. ఇంకా చిన్నవాడి స్కూల్ ఫీజు కూడా నెల నెలా ఆయనే కడుతున్నారంట. ఇంత సహాయం చేస్తే పెద్దవాడు లెక్కల్లో తప్పాడని ఆయన గారికి క్షమాపణలు చెప్పించాలని తీసుకొచ్చింది. ఆయన లేకపోయేసరికి మనకి తెలిసే ఈ సాయం చేస్తున్నారనుకొని నాకు చెప్పి బాధ పడింది." "ఏంటీ... మా నాన్న డబ్బులు ఇలా... ఛా... నిజమేనా...?" "అరే ఆమే నాతో చెప్పిందంటూంటేనూ" దంపతులిద్దరూ

గుంపుచ్చింపులు పడుతుండగానే శాంతిరాజు ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు.

ఏమీ ఎరగనట్టు కోడలు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. "మీ కోసం ఎదురింటి ఫర్జానా వచ్చింది" సూటిగా విషయానికొచ్చేశాడు. కొడుకు.

"అవునా, ఏమైనా పనేమో వెళ్లి కనుక్కొస్తా" లేవబోయాడు ముసలాయన.

"ఎందుకొచ్చిన పనులు నాన్నా మీకు. మన చుట్టాలుకాదు, మన మతంకాదు, మన ఊరుకాదు- ఏదో కష్టాల్లో ఉన్నారంటే పదో పరకో ఇవ్వాలిగానీ కాలేజీ ఫీజు కట్టి మరీ చదివిస్తారా? చిన్నవాడికి కూడా నెలనెలా స్కూల్ ఫీజు మీరే కడుతున్నారట కదా. మనకవసరమా ఈ దుబారా? మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యాయా?" ఆవేశంగా అడిగాడు కొడుకు.

“మీరిలా అనుకుంటారనే చెప్పలేదురా. రెండేళ్లకీ కలిపి ఫీజు ఒకేసారి కడితే పాతిక వేలు తగ్గించారు. తండ్రి లేడంటే ఇంకో పాతిక వేలు తగ్గించారు. పై ఏడాదికి నేను లేకపోతే మళ్లీ ఎవరిని అడుగుతారని నేనే రెండేళ్లకీ కలిపి ఒకేసారి కట్టేశాను. అలా నేను కట్టింది లక్షా యాభై వేలు. ఇక చిన్నవాడి ఫీజంటావా, మన అపార్టుమెంటులోని వృద్ధులందరం నెలనెలా మా పెన్షన్ డబ్బులలో తలా కొంత వేసుకుంటున్నాం ఈ మంచి పనికోసం" సంబరంగా చెప్పాడు ముసలాయన. "అసలెందుకు నాన్నా? మీకెందుకూ? మనకి అప్పులు లేవా? ఈ అపార్టుమెంటు కోసం తీసుకున్న లోను ఇంకా పదిహేనేళ్లకిగానీ తీరదని తెలుసుకదా మీకు. బుజ్జిగాడి స్కూల్ బస్సుకే నెలకి పదివేలు కట్టాలి నాన్నా. మీ సంపాదన గురించి అడగడం లేదంటే, మీరు బాధ్యతగా ఉంటారనే నమ్మకంతోనేగానీ ఇలా ఇష్టానుసారం వేరెవరికో ధారపోస్తారనుకోలేదు. పోనీ మీ సహాయానికి సరైన ప్రతిఫలం వచ్చిందా అంటే అదీ లేదు. ఆ పెద్దోడు తాహిర్ ఇంటర్ పరీక్ష తప్పాడంట. మీ ఉదారత వృథా అయిపోయిందిగా?" తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు సంజీవ్. కాసేపు మౌనంగా కూర్చుని, తరువాత నోరు విప్పాడు శాంతి. “రిటైరయినప్పుడు నాకొచ్చిన డబ్బంతా నీకూ మీ అక్కకే పంచిచ్చాను కదరా? మన ఊళ్లోని ఇంటినీ, పంట పొలాల్నీ కూడా అక్కడెందుకని అమ్మేసి డబ్బులు వాటాలేసుకుని మరీ ఇద్దరూ తీసేసుకున్నారు కదా? ఇంకేముందిరా నా దగ్గర పాడు చెయ్యడానికి? ఏదో పాత అలవాటు మానుకోలేక పెన్షన్ డబ్బులో కొంత పోస్టాఫీస్లో నెలవారీ చిన్న మొత్తాలుగా పొదుపు చేస్తే జమ అయిన మొత్తంలో నుంచి తీసి ఆ పిల్లాడి చదువుకి ఇచ్చాను. మన బుజ్జిగాడి పేరున కూడా కొంత కడుతున్నారా, వాడు ఎదిగేసరికి అక్కర కొస్తుంది. ఏదో చేతనైనంత సాయం చెయ్యాలనే తపనతోనేగానీ మనకెక్కువయి కాదూ, మనకున్న అప్పులు తెలియకా కాదు. ఒరేయ్ నాన్నా అసలు నీకో నిజం చెప్పనా...? నేను కూడా నీలాగే పెట్టుబడి పెట్టానురా. నువ్వు ఓ సంస్థను నమ్మి డబ్బు పెడుతున్నావు, నేను మనిషిని నమ్మి మానవత్వాన్ని మదుపు చేశాను. నీకు తిరిగి రూపాయి రాబడి వస్తుంది. నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది.

అప్పుడెప్పుడో నేను స్తోమత ఉండి కూడా ఏదో కంపెనీ వాటాలు కొనలేదన్నావు. కానీ నా చెల్లెలి పెళ్లి, తమ్ముడి చదువూ, బామ్మర్ది ఉద్యోగం, నా పిల్లల సరదాలూ, కుటుంబ విహారయాత్రల మీద నేను ఖర్చు పెట్టాను. నాకది సంతోషం, నా వాళ్లకోసం వ్యయం చెయ్యడం ఆనందం. అవసరాలు మానుకొని, రేపటికోసమని దాచుకొని, అదెప్పటికి ఎన్నింతలవుతుందో అని ఎదురు చూడడం నాకు చాతకాదు. ప్రతి పనీ మన కోసమే కాదురా, కొన్ని మనచుట్టూ ఉన్నవాళ్ల కోసం కూడా చెయ్యాలి.

'ఎదురింటి అహ్మద్ వాళ్లది మన ఊరు కాదు, మన మతం కాదు' అన్నావు. కానీ వాళ్లెప్పుడూ నన్నలా వేరు చేసి చూడలేదురా. కోడలూ నువ్వూ ఉదయం వెళ్లి సాయంత్రం వస్తారు. ఈలోపు నేనొక్కడినే ఇంట్లో. ఎంతసేపని పత్రికలూ, టీవీలతో గడుపుతాను. అందుకే తలుపు తెరిస్తే నోరారా పలకరించి, మాట్లాడేవాళ్లురా. మీరెళ్లిన తరువాత నుంచీ వాళ్లింటి తలుపు నాకోసం తీసే పెడతారు. వాళ్లింటికి అతిథులొస్తే వాళ్లతోపాటూ నాకూ ఓ కప్పు టీ ఇప్పించేవాడు ఆ అబ్బాయి. ఓసారెప్పుడో నాకు మాంసాహారం ఇష్టమని చెప్పానని వాళ్లింట్లో వండిన ప్రతిసారీ కూర ఇచ్చేది నాకు ఆ ఇల్లాలు. గుర్తు పెట్టుకొని గుప్పెడు బియ్యం ఎక్కవేసేదో ఏమోగానీ బిర్యానీ వండినప్పుడల్లా నాకూ హాట్ బాక్స్లో పెట్టిచ్చేది. అడిగితే కోడలు చేసిపెట్టదనికాదు, నువ్వు పెద్దపెద్ద హోటళ్లనుంచి తీసుకురాలేవని కాదు- ఒక దగ్గర ఉండేటప్పుడు మనిషికి మనిషి అలా చేదోడు వాదోడుగా ఉండాలిరా.

బుజ్జిగాడు డే కేర్ నుంచి నాలుగింటికి వస్తాడు కదా, ఓ రోజు ఆ టైముకు నిద్రపోయా, బస్సు డ్రైవర్ ఫోన్ చేసి గేటు దగ్గర దించేశానని చెప్పాడు. హడావుడిగా వెళ్లబోయి కాలుజారి పడ్డాను. ఎందుకో ఆ రోజు అహ్మద్ ఇంట్లోనే ఉన్నాడు. అతను నన్ను లేవదీసి ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి నడుం పట్టి, అమృతాంజనం రాశాడు. ఆ అమ్మాయి పరుగున కిందికెళ్లి బుజ్జిగాడిని తీసుకొచ్చింది. అప్పటినుండీ ప్రతిరోజూ 'చాచా, బుజ్జి వచ్చే టైం అయ్యింది. వెళ్లగలరా నే తీసుకురానా' అనడుగుతుంది. వాళ్లివన్నీ నేను డబ్బులిస్తానని చెయ్యలేదురా. వాళ్లకి చేతనయింది ఆ దంపతులు అప్పుడు చేశారు. నాకు కుదిరిన విధంగా నేను తరవాత తిరిగి ఇచ్చాను. అంతే! అయినా మన అవసరాలకి సరిపోగా ఇతరులకి సాయ పడగలిగేంత సంపద కలిగి ఉండటం కన్నా అదృష్టం ఇంకేం ఉంటుంది. మన దగ్గరుంది తోటి వారితో పంచుకుంటే దేవుడు మనకింకా ఇస్తాడు. అందుకే నేనెప్పుడూ పోగేసుకొని పొంగి పోవాలనుకోలేదు. నీకూ అది నేర్పలేదు. ఎంతసేపూ సొమ్ములు సంపాదించుకోవడమే కాదురా. కాసింత సంతోషాన్ని కూడా సముపార్జించుకోవాలి. ప్రతి పనీ ప్రతిఫలం కోసం, ప్రతీ రూపాయీ రాబడికోసమే కాదురా... కొంత మనకోసం, మనవాళ్ల అవసరాలు తీర్చడం కోసం, మిగిలింది ఇతరుల కోసం కూడా వెచ్చించాలి. ఏమో ఎప్పుడేరూపంలో మనకా సాయం తిరిగి అందుతుందో, మనవారికి అండవుతుందో ఎవరు చూడొచ్చారు? మదుపు చెయ్యనవసరం లేదని చెప్పడంలేదురా నేను. మనిషి సంఘజీవి అంటారు కదా, అంతా షేర్లలోనే కాకుండా కొంత సాటి మనిషికి కూడా షేర్ చెయ్యమంటున్నానంతే." పెద్దాయన చెప్పేది అడ్డు చెప్పక శ్రద్ధగా వింటున్నాడు కొడుకు.

"చివరిగా ఒక్కమాటరా. మొన్నెప్పుడో నువ్వే చెప్పావు. షేర్లు పడ్డప్పుడే పెట్టుబడి పెట్టాలనీ, ఎందుకంటే రాబడి అధికంగా ఉంటుందనీ." అటు తల ఆడించాడు సంజీవ్. "నేనూ అంతే. ఆ పిలాడు. తప్పాడు. మళ్లీ వాడిమీద ఖర్చు చేసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఈ 30

రోజులూ ట్యూషన్ పెట్టిస్తాను. ఏమో ఈ వైఫల్యం కూడా వాడి

మంచికేనేమో, బొటాబొటీగా గట్టెక్కకుండా, ఈసారి మంచి మార్కులతో

పాసయితే రేపు వాడికొచ్చే మార్కుల శాతం ఆధారంగా ఏదైనా మంచి

డిగ్రీ కాలేజీలో సీటొస్తుందేమో. తర్వాతెప్పుడో వాడికి ట్యూషన్ ఫీజుకూడా

నేనే కట్టానని తెలుసుకుని మీరిద్దరూ హైరానా పడకూడదని ముందే

చెప్తున్నా" స్థిరంగా చెప్పి తన గదిలోకెళ్లిపోయాడు శాంతిరాజు.

ఆర్జన

VALTE

ఆలోచనలో పడ్డాడు సంజీవ్. దేవుని దయవల్ల తమకు ఎటువంటి లోటూ లేదు. తండ్రి చెప్పినట్టు అయినవాళ్లందరిలోనూ తమ కుటుంబానికి మంచి పేరే ఉంది. ఒకరికి సాయపడడమే తప్పా ఎవరి ముందూ చెయ్యి చాచాల్సిన అవసరం రాలేదెప్పుడూ. నిజమే, ఇతరులకి మేలు చేస్తూ ఉంటే దేవుడు తమకూ ఇస్తూ ఉన్నాడు. ఖర్చులు తగ్గించుకొని రేపటికి పొదుపు చెయ్యడం, మిగులుని మదుపు చెయ్యడం అవసరమే. అలాగే కళ్లముందు కష్టాలు పడుతున్న వాళ్లకి కూడా చేతనైనంత సాయం చెయ్యడమూ అవసరమే. అప్పుడే కదా మనిషిగా మనమూ ఎదిగేది. సొమ్ము సంగతేమోగానీ సంతృప్తి కలుగుతుంది. పెట్టుబడిగా పెట్టిన రూపాయి గమనాన్ని ప్రతీ క్షణం సమీక్షించుకొనే పరిస్థితి నుంచీ శాశ్వత ఫలితాన్నిచ్చే మంచితనపు మదుపు బాట మార్గాన్ని చూపిన తండ్రి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించాడు. దాంతో మనసెంతో తేలికయ్యింది సంజీవ్కి.

తర్వాతిరోజు ప్రాతఃకాలాన, అలవాటుగా లేచాడు శాంతిరాజు. అప్పటికే ముందు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. తయారయ్యి, తలుపు తీసుకుని ఎటూ చూడకుండా తన గదిలోంచి బయటకొచ్చి ఉదయపు | నడకకై చెప్పులేసుకుంటుంటే అక్కడ జరుగుతున్న సంభాషణ మరింత స్పష్టంగా వినపడింది.

"చూడు తాహిర్ బేటా, లెక్కలు అన్నింటి లోకి తేలికైన సబ్జెక్టు. మిగతా వాటిలో సరైన జవాబు పూర్తిగా రాయాలికానీ లెక్కల్లో ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే క్రమంలోని ప్రతీ స్టెప్పుకూ మార్కులు పడతాయి... చివరికి సరైన సమాధానం రాకున్నా కూడా. నే చెప్పేది విను. ఈ గైడులో గత పదేళ్ల ప్రశ్నా పత్రాలున్నాయి. అందులో మొదటి చాప్టరులోని లెక్కలన్నీ ఈరోజు చెయ్యి. నీకు ఏవైనా తెలియకపోతే సాయంత్రం నేనొచ్చాక చెబుతాను. అప్పుడు నీకు లెక్క ఎలా చెయ్యాలనేది గుర్తుండిపోతుంది.

రేపు రెండో చాప్టర్ లెక్కలు సాధన చెయ్యి. ఇలా పదిరోజుల్లో నీకు ముఖ్యమైన లెక్కలన్నీ ఎలా చెయ్యాలో తెలుస్తుంది. సప్లిమెంటరీలో మంచి మార్కులతో పాసవ్వొచ్చు" చాలా ఓపిగ్గా చెప్తున్నాడు సంజీవ్. ఇంతలో వంటింట్లోనుంచి కోడలు అంటోంది, "మీ ఇంట్లో తమ్ముడికి సెలవులు కదా అల్లరి చేస్తాడేమో, అమ్మ కాలక్షేపం కోసం టీవీ పెట్టుకుంటుందేమో, మా ఇంట్లో ఎవరూ ఉండరు. బుజ్జిగాడు వాళ్ల అమ్మమ్మ ఇంటికెళ్లాడు. తాతగారు ఆయన గదిలో ఉంటారు. నీకెటువంటి అలికిడీ ఉండదు. ఇక్కడే కూర్చొని కావలసినంతసేపు హాయిగా చదువుకోవచ్చు."

మళ్లీ సంజీవ్ చెబుతున్నాడు, "అసలు ప్రతి ఓటమీ రాబోయే ఘన విజయానికి నాందివంటిది తెలుసా..." తన మానవతా సేద్యాన్ని కొడుకు కొనసాగిస్తాడనే నమ్మకంతో సంతృప్తిగా నవ్వు కుంటూ ముందుకు సాగాడు శాంతిరాజు.


ప్రచురణ : ఈనాడు

కామెంట్‌లు