వాకిట్లోంచి దబ... దబా నీళ్లు పడుతున్న అలికిడి అవ్వడంతో తెలివొచ్చిన రామారావుగారు లేచి తలగడ పక్కనే ఉన్న సెల్లో టైమ్ చూసి "హుఁ ఇంకా ఆరు కూడా అవ్వలేదు, అప్పుడే ఇవాళ నీళ్లు ఇచ్చేస్తున్నాడా. సెలవురోజు అయినా పాపం ఓ గడియ పడుకోవడానికి వీడికి సుఖం లేకపోయింది" అని విసుక్కుంటూ కీళ్లవాతంతో బిగుసుకుపోయిన కాళ్లూ చేతులను బలవంతంగా సాగదీసుకుని, ఎలాగో మంచం మీద నుంచి లేచి గోడ ఆసరా చేసుకుని నడుస్తూ పక్కగదిలోకి వెళ్లారు.
"ఒరేయ్... బాబూ" అంటూ పిలవబోతూ, ఒళ్లు తెలియకుండా ఆదమరిచి నిద్రపోతున్న కొడుకుని చూసి వెంటనే ఆగిపోయి, అస్సలు చప్పుడు కాకుండా జాగ్రత్తగా గది తలుపుని జారవేసి అలాగే నిక్కుతూ నీలుగుతూ వంట గదిలోని బిందెలను తీసుకుని వాకిట్లోకి వెళ్లి నీళ్లు పట్టే ప్రయత్నం చెయ్యడం మొదలు పెట్టారు. అన్నీ ఎలాగో పట్టేసి, కుళాయిని కట్టి ఇక లోపలికి రాబోతుండగా, కింద తడి వలన అదుపు తప్పి ముందున్న నీళ్ల బిందెను తన్నుకుని పడిపోయారు. అంతే పెద్ద శబ్దంతో బిందె పక్కకు పడిపోవడమే కాకుండా దానిలోని నీళ్లు వంటగదిలోకి కూడా పాకిపోయి అక్కడంతా వరదే అయిపోయింది. ఈ శబ్దానికి ఉలిక్కిపడి ఒక్క పరుగున లేచి వచ్చాడు దివాకర్. వస్తూనే అక్కడ బేలమొహంతో నిస్సహాయంగా నీళ్లలో తడిసి పడిపోయి ఉన్న తండ్రిని చూస్తూనే "అయ్యయ్యో..." అంటూ పరుగున వెళ్లి తండ్రిని లేవదీసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, "మీకెన్ని సార్లు చెప్పాను నాన్నా, అస్సలు మీ గది దాటి రావద్దని. నేను లేచి అన్నీ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి ఏమయ్యిందో, ఈ వయసులో ఏదైనా అయితే ఎంత ప్రమాదం" అంటూ, మూలుగుతున్న తండ్రికి ఓదార్పుగా వెన్ను మీద రాసి తడి బట్టలను మార్చి మంచం మీద పడుకోబెడుతూ "కాస్సేపు ఓర్చుకోండి, నొప్పి మాత్ర వేస్తాను. ఓ గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్లాం" అని ఒక మాత్ర తెచ్చి ఇచ్చాడు దివాకర్.
ఆ మాత్ర వేసుకుని, “డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరమేమీ లేదులే... దీనితో తగ్గిపోతుంది. ఏదో సెలవు రోజు కదా, ఆ నీళ్లు కాస్తా నేను పట్టేస్తే నువ్వు కొంచెంసేపు పడుకుంటావు అనుకున్నాను. ఇలా పనికి పని అవుతుందనుకోలేదురా..." నీరసంగా ఒక్కో మాటా చెబుతున్న తండ్రిని జాలిగా చూసి, ఏమాత్రం శక్తి లేకున్నా, ఎంతో కొంత ఆసరాగా ఉండాలన్న ఆయన నిరంతర ప్రయత్నం తెలిసున్నవాడవడం వలన ఓ నవ్వు నవ్వుకుని తన పనిలో తను పడిపోయాడు దివాకర్. అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత సింకులోని గిన్నెలు తోమి, స్నానం చేసి వచ్చి కాఫీ కలిపి తండ్రికి తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ ఇచ్చి వెళ్లిపోతున్న కొడుకుని చెయ్యి పట్టుకుని ఆపేసి "నా దగ్గర కాస్సేపు కూర్చో నీతో మాట్లాడాలి" అన్నారు రామారావుగారు. తండ్రి ఏమి మాట్లాడతాడో తెలిసిందే అయినా మాట కాదనలేక తను కూడా కాఫీ తెచ్చుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు. దివాకర్.
"అటు ఉద్యోగం, ఇటు ఇంటి పనీ ఒక్కడివీ ఎంతకని చేసుకొస్తావు. మళ్లీ పెళ్లి చేసుకోమని నేను ఎన్నోసార్లు అడగడం, నా భార్య స్థానంలోకి మరొకరిని ససేమిరా అంగీకరించలేనని నువ్వు కచ్చితంగా చెప్పడం చాలాసార్లు మన మధ్య జరిగింది. అలా అనుకుంటూనే ఏడెనిమిదేళ్లుగా గడిపేశాం. ఇక నేను ఆ విషయంలో బలవంతపెట్టను. అయితే ఒక్క సంగతి, నీకూ వయసు పెరుగుతోంది. అటు బయట పనీ, ఇంట్లో పనీ చేసుకుంటూ తిండీ తిప్పలు కూడా సరిగా లేకుండా ఇలా ఊపిరి సలపకుండా ఎన్నాళ్లు ఈ సంసార సాగరాన్ని ఈదగలను అనుకుంటున్నావు. నీకు ఉండీ ఉండీ మధ్యలో జ్వరం వస్తోంది. మనిషివి రోజురోజుకీ పాడయిపోతున్నావు. అవి ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు. అదిగో అటు చూడు నీ పిల్లలు... ఇంకా పాలు తాగే పసిపిల్లలు కాదు, అయినా ఇంట్లో ఇంత జరిగినా వాళ్లకేమీ పట్టకుండా ఎలా మొద్దు నిద్ర పోతున్నారో. నిజానికి ఇందులో వాళ్ల తప్పేమీ లేదు, నువ్వే వాళ్లని అలా పెంచుతున్నావు. వాళ్లు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతావు. సాయంత్రం వాళ్లకన్నా ముందే వచ్చేసి, వాళ్లకి అన్నీ చేసి పెడతావు. వాళ్లకి సమయానికి తిని తాగడం తప్ప వాటి వెనుక నీ కష్టం ఎంత ఉందో గ్రహింపుకి రావటం లేదు. ఇది తప్పని నేను అనటం లేదు, కానీ నీ శక్తి చూసుకోవాలి. పిల్లలకి ప్రేమానురాగాల్ని అందివ్వడం మాత్రమే కాదు, వాళ్లకి వాస్తవ పరిస్థితులను వివరించడం కూడా అవసరం. ఎంతో కొంత వాళ్లకీ పనులు చెప్పు. కాస్త బాధ్యత నేర్పించు. నీకు కాస్త ఆసరాగా ఉంటుంది. వాళ్లకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను, కానీ నువ్వు బాధపడతావేమోనని ఊరుకున్నాను. కానీ నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను" అంటూ చెమ్మగిలిన కళతో ప్రాధేయపడుతున్నట్లు చెపుతున్న తండ్రిని చూసి కాస్సేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత....
“నాన్నా, నిజం చెప్పాలంటే మీ కోడలు చనిపోయిన కొద్దిరోజులు నేను బాధపడ్డాను, కష్టపడ్డాను. చిన్న పిల్లలైన వాళ్లిద్దరినీ చెరో వైపూ వేసుకుని, శూన్యంలా కనిపిస్తున్న భవిష్యత్తుని తలచుకుని ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేననే అనుకున్నాను. కానీ క్రమేపీ నన్ను నేనే ఓదార్చుకున్నాను. నాకు జరిగిన నష్టం కన్నా, అమాయకంగా దిక్కులు చూసే నా పిల్లల కష్టం నాకు ఎక్కువ అనిపించింది. నెమ్మదిగా పరిస్థితులతో రాజీ పడ్డాను, నేను చెయ్యాల్సిన నా కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాను. నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ నాకేమీ అలా అనిపించడం లేదు. పొద్దున్నే లేవాలి, పిల్లలకీ మీకూ ఏమి కావాలో చేసి పెట్టాలి అన్నదొక్కటే ధ్యాస నాకు. అలాగే ఆఫీస్ అయిపోగానే అరుగు మీద నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే మీ మొహం, అలసిపోయి ఇంటికి వచ్చే పిల్లల మొహం కళ్లముందు కదలాడడం తప్ప మరో ఆలోచనా బెంగా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ కష్టం నాకు కష్టమే కాదు, నన్ను నమ్మండి. నిజానికి నేనిలా రోజంతా తీరిక లేని పనుల్లో ఉన్నాను కాబట్టి కాలమిలా తెలియకుండా గడిచిపోతోందేమో. ఇక పిల్లల గురించి అయితే, వాళ్లకి తల్లినో తల్లి ప్రేమానురాగాలనో ఎలాగూ తెచ్చి ఇవ్వలేను. తల్లిలేని లోటు తెలియకుండా, నా శక్తి మేరకు వాళ్లకి సదుపాయాలను చేస్తేనే తండ్రిగా నాకు తృప్తి. ఇక వాళ్లకి బాధ్యతలంటారా, ఇప్పుడు వాళ్లకి నేను ఉండబట్టి, అన్నీ నేను చూసుకుంటాను అన్న నమ్మకం ఉండబట్టీ ప్రశాంతంగా హాయిగా వాళ్ల బాల్యాన్ని వాళ్లు అనుభవిస్తున్నారు. అది వాళ్ల హక్కు కూడా. రేపు పెద్దయ్యాక వాళ్ల నెత్తి మీద బాధ్యతలు పడకుండా ఉంటాయా, ఇంత మనశ్శాంతితో ఉండగలుగుతారా. వాళ్లకి బాధ్యతల బరువులు ఏర్పడనంత వరకే మనకి బాధ్యత. అవి వాళ్లని చుట్టుముట్టాక చూస్తూ ఊరుకోవడం తప్ప మనమేమీ చేయలేము. దానికి మీరే ఉదాహరణ. తండ్రిని కాబట్టి మీ తండ్రి మనసుని అర్థం చేసుకోగలను నాన్నా. కానీ నేనూ తండ్రినే అన్న విష మీరెప్పుడూ గుర్తుంచ ంటే, మీకీ కష్టం ఉండదు" అంటూ చేతిలో చెయ్యివేసి చెప్పుకొచ్చాడు దివాకర్. ఈలోగా వంటగదిలో నుండి ఏదో చప్పుడు వినిపించడంతో అటువైపు పరిగెత్తుకెళ్లాడు. అక్కడ ఎప్పుడు లేచి వచ్చారో కొడుకూ, కూతురూ ఇద్దరూ స్టా దగ్గర నిలబడి ఏవో సర్దుతూ కనపడ్డారు. అది చూసి వెంటనే "అరె... అప్పుడే లేచేశారా, వెళ్లి ఫ్రెష్ అయి రండి, మీ ఇద్దరికీ పాలు కలుపుతాను" అంటూ వాళ్లిద్దరినీ బయటకు పంపే ప్రయత్నం చెయ్యబోయాడు.
"వద్దు నాన్నా... అలాంటి పనులన్నీ ఇకమీదట మేమే చేసుకుంటాం” అంటూ అటు తిరిగి తలవంచుకుని మాట్లాడుతున్న కొడుకుని చూసి ఎందుకో అనుమానం వచ్చి, "ఏంటి కన్నా... ఏమయిందిప్పుడూ" అంటూ తన వైపుకి తిప్పుకున్నాడు.
"సారీ నాన్నా... రేపటి నుండి నేను కూడా పొద్దున్నే లేచి నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు" అంటూ జలజలా రాలుతున్న తన కన్నీటిని తండ్రి కంట పడనివ్వకుండా ఉండడానికి తలను మరింత దించుకుని, గొంతులోని దుఃఖాన్ని సాధ్యమైనంత దాస్తూ మాట్లాడుతున్న కొడుకుని చూసి నిర్ఘాంతపోతూ...
"అరేయ్ పిచ్చోడా... ఏంట్రా ఇది, తాతయ్య అన్న మాటలకి ఫీలవుతున్నావా. పెద్దాయనరా ఆయన, అలాగే మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకూడదు" అంటూ కొడుకుని అక్కున చేర్చుకున్నాడు దివాకర్. అంతవరకూ ఎలాగో నిగ్రహించుకున్న దుఃఖాన్ని కాస్తా తండ్రి దగ్గరికి తీసుకున్న వెంటనే ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టేశాడు వాడు. ఆ వెక్కిళ్ల మధ్యలోనే "నేను తాతయ్య మాటలకి ఫీలవ్వటం లేదు నాన్నా, మీ గురించి నేనింత వరకూ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. మీకు ఏమాత్రం కోపరేటివ్గా కూడా లేనని తెలుసుకునేసరికి బాధనిపిస్తోంది" అంటూ చెపుతున్న కొడుకుని ఇంకా ఆప్యాయంగా దగ్గరికి హత్తుకుని...
"ఓరి పిచ్చి సన్నాసీ... నువ్వెంతా నీ వయసెంతని రా. అయినా మీరు పట్టించుకోకపోవడమేంటీ, నాకు కోపరేటివ్గా ఉండకపోవడమేంటీ. చిన్నప్పటి నుంచీ కూడా నేనేమి చేస్తే అదే చేయించుకుంటున్నారు. ఎలా పెడితే అలాగే తింటున్నారు. ఇంతవరకూ ఎప్పుడూ నన్ను మీరు ఇబ్బంది పెట్టిందే లేదు. లేకపోతే నేనొక్కడినీ ఇంతకాలం చూసుకోగలిగే వాడినా. నా పిల్లలిద్దరూ బంగారు కొండలు. ఇదే విషయం మా ఆఫీస్లో కూడా అందరితో చెప్పుకుంటాను గర్వంగా తెలుసా. ఇక ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలోంచి తీసేసి హాయిగా చదువుకో. ఇంటర్ మీడియట్కి వచ్చావు ఎక్కువ సమయం చదువుకి కేటాయించాలి" అంటూ కొడుకుని ఓదార్చాడు దివాకర్.
“నాన్నా నా చదువు నేను చదువుకుంటాను. మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను. దాంతో పాటే నీకు సాయంగా కూడా ఉంటాను. తాతయ్య చెప్పేదాకా నాకు తెలీనే లేదు నువ్వు ఎంతో కష్టపడుతున్నావన్న సంగతి. నీకు అప్పుడప్పుడూ జ్వరం కూడా వస్తోందట కదా. ఇంతవరకూ మా కేర్ నువ్వు చూశావు కదా, అందుకే ఇప్పటినుంచీ నీ కేర్ నేను చూసుకుంటాను. ఇకమీదట నువ్వు మాతోనే లేవాలి, మాతోనే పడుకోవాలి. మాతో తిని మాలాగా నువ్వూ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇకమీదట ఇంట్లో పని నువ్వు ఒక్కడివే కాదు, అందరం కలిసి చేసుకుందాం" అని చెపుతున్న కొడుకుని "అబ్బే... అదేం. . వద్దురా" అంటూ వారించబోయాడు దివాకర్.
"అబ్బా నాన్నా... అన్నయ్య చెపుతున్నాడు కదా, మీరు వినాల్సిందే తప్పదు. మీ మాట మీ నాన్న విన్నారు. మా మాట మీరు వినాలి" అంటూ ఆరిందాలా దబాయింపుగా చెపుతున్న కూతుర్ని చూసి "అలాగే నాయనమ్మగారూ, ఇక మీరు చెప్పాక తప్పుతుందా" అంటూ నాటకీయంగా అనడంతో అంతా నవ్వుకున్నారు. అలా వాళ్లని చూసి, 'బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి, ఒకరిని చూసి ఒకరు అలవర్చుకుని అల్లుకుపోయే బంధాలు' అని మనసులో అనుకుని ఆనందంతో చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు రామారావుగారు.
ప్రచురణ: ennadu
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి