మిత్రులిద్దరూ హోటల్లో కూర్చొని భోం చేస్తున్నారు. వాళ్ల భోజనం ముగింపు కొచ్చింది. పక్కన కిటికీలోంచి చూస్తే బయట బోలేవార్డు కిక్కిరిసిన జనంతో కనిపిస్తున్నది. వేసవికాలం సాయంత్రాలు ప్యారిస్ నగరాన్ని సుతారంగా జోకొడుతూ వీచే పిల్లగాలులు స్పర్శ వారి వొంటిని తాకుతూ ఆహ్లాదపరుస్తున్నది. ఆ గాలితో పాటు, మనమేదో కొత్త ప్రదేశానికి ఎగిరిపోతున్న అనుభూతి కలిగిస్తున్నది. నీకు తెలియకుండా నిన్ను మిణుగురు కాంతుల్లో, వెన్నెల ప్రవాహాల స్వప్నాల్లో విహరింపజేస్తున్నది.
ఇద్దరు మిత్రుల్లో ఒకరైన హెన్రీ సైమన్ దీర్ఘంగా నిట్టూర్చుతూ విచారంగా అన్నాడు: "ఏమిటో పియరీ! రోజురోజుకూ నేను త్వరగా ముసలాడినై పోతున్నాను. అట్లా అవుతున్నందుకు నాకు విచారంగా ఉన్నది. గతంలోనైతే ఇలాంటి అందమైన సాయం సమయాల్లో నాలోకి కొత్త జీవం వొచ్చినట్టు ఉండేది. ఇప్పుడా అనుభూతిని కోల్పోయినందుకు చింతించడం తప్ప ఏమీ చేయలేను. ఎందుకంటే జీవితం చిన్నది కదా!"
సైమనకు బహుశా నలభై అయిదేళ్లు ఉంటాయి. కానీ అంతకన్నా ఎక్కువ వయసున్నవాడిలా కనిపిస్తాడు. అతని జుట్టు చాలావరకు రాలిపోయి బట్టతల వొచ్చేసింది. అలాగే ఒక పద్ధతి లేకుండా పెరిగిపోయిన కొవ్వుతో స్థూలకాయం కూడా ఏర్పడుతోంది. పక్కనే వున్న రెండోవ్యక్తి పియరీ కార్నియర్ వయసులో మరింత పెద్దవాడు. కానీ సైమన్ కంటే సన్నగా, చురుగ్గా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. "చూడు సోదరా! నేను నీకంటే చాలా పెద్దవాణ్ని. పైగా వృద్ధున్ని కూడా. కానీ నా వయసు ఎప్పుడు కరిగిపోయిందో, ముసలి తనం నన్నెప్పుడు కావలించుకున్నదో కనీస మాత్రమైనా గ్రహింపు లేదు. ఎందుకంటే
నేనెప్పుడూ చీకూచింతా లేకుండా హుషారుగా,
ఆరోగ్యంగా ఉంటాను" పియరీ కార్నియర్
చెపుతూ పోయాడు.
"బ్రదర్.. ప్రతి రోజూ అదేపనిగా అద్దంలోకి తొంగిచూసుకునే వాడికి వయసు ఎట్లా మీదపడుతున్నది. మనిషి మీద కాలం ఏవిధంగా ప్రభావం చూపుతున్నదనే విషయంలో సరైన అవగాహన ఉండదు. నిజానికి కాల ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల దాని గమనం స్పష్టమైన ఉనికి లేకుండా, మనమీది నుంచి నడిచి వెళ్లిపోతుంది. మార్పులు మనకు అందవు. ఈ ఒక్క కారణంతోనే రెండు మూడేళ్ళ ఉద్విగ్నత, ఉద్వేగాల అనంతరం కూడా మనం
ఆవేదనతోనూ, విషాదంతోనూ మరణించం.... కాలగమనంలో తీసుకునే మార్పులు, చేసే సర్దుబాట్లు మనకు సరిగా అర్థం కావు. అట్లా కాకుండా, ఒక ఆరునెలల తర్వాత హఠాత్తుగా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావనుకో, వావ్.. షాక్తో నువ్వు నివ్వెరపోతావు. అదే ఆడవాళ్ళ విషయానికొస్తే పరిస్థితి వేరు. వాళ్ళ స్థితి మనకంటే మరింత దయనీయం. తలుచు కుంటే వాళ్లమీద సానుభూతి కలుగుతుంది. జీవితం పొడవునా వాళ్ల ఆనందమంతా, అధికారమంతా అందంతోనే ముడిపడి ఉంటుంది. కానీ ఆ అందం మూడునాళ్ళ ముచ్చట. మహా అయితే ఒక పదేళ్లలో మసకబారుతుంది. ఇందాకే చెప్పాను, నా విషయంలో వయసు పైబడినట్టు నాకే తెలియలేదు. నాకిప్పుడు యాభైయేళ్ళు దాటాయి. అయినా నన్ను నేను యువకునిగానే భావిస్తాను. ఏ విచారం లేకుండా, ఎప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా వుంటాను. నా వృద్ధాప్యం గురించి ఒకరు గుర్తుచేసేవరకూ నాకు తెలిసి రాలేదు. వయసు పైబడిన అవగాహన నాకోపక్క ఆమోదంగానూ, ఇంకోపక్క కాస్తంత ఆందోళన కలిగించేలానూ ఉంటుంది. ఈ మనోస్థితి నాకు తెలియ కుండానే నన్నో ఆరునెలలు కలవరపెట్టింది. అదిగో అప్పట్నుంచే నేను క్రమేపీ నన్ను కొంత ఉపసంహరించుకుంటూ వొచ్చాను.
అందరు పురుషుల మాదిరిగానే నేనూ పలుమార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఒక్కసారి మాత్రమే ప్రత్యేకించి నిజమైన గాఢమైన ప్రేమలో మునిగితేలాను. కాల ప్రభావమేమిటో, పరిణామాలేమిటో, వాస్తవమేమిటో ప్రేమ ద్వారానే తెలుసుకోగలిగాను. చెప్పమంటావా నా ప్రేమ కథేమిటో" మాట్లాడటం ఆపి ప్రశ్నించాడు.
“చెప్పు మిత్రమా! ప్లీజ్ వివరంగా చెప్పు. దయచేసి. ఆగకు" సైమన్
ఆసక్తిగా అన్నాడు.
"ఆమెను, అంటే నా ప్రియు రాలిని పన్నెండు సంవత్సరాల క్రితం అనుకుంటా, రెండో యుద్ధం ముగిసిన తరవాత కాలంలో ఎట్రాటెట్ వద్ద సముద్రతీరంలో కలుసుకోవడం జరిగింది. ఉదయం పూట 'అందరూ సముద్రస్నానాలు చేసే సమయంలో ఆ బీచ్ కంటే సుందరమైన ప్రదేశం ఈ లోకంలో మరేదీ ఉండదు. ఆకాశాన్ని తాకినట్టు వుండే పర్వతాల నడుమ చిన్నగా గుర్రపుడెక్క ఆకారంలో వుండే తీరం సముద్రంలోకి అడుగేస్తున్న రాక్షసుని పాదంలా ఉంటుంది. ఎత్తయిన బండరాళ్ళతో కూడిన ఇసుకతిన్నెల వరుసల్లో మహిళలు గుంపులు గుంపులుగా గుమిగూడుతారు. తాము ధరించిన రంగురంగుల అందమైన గౌన్లతో వాళ్లు ఆ ప్రదేశాన్ని మరింత సుందరమైన ఉద్యానవనంలా మార్చేస్తారు. సూర్యుడు తీరప్రాంతంలోని వివిధ వర్ణాల పారాసోల్స్ పైనా, నీలం ఆకుపచ్చ రంగు సముద్ర అలలపైనా కాంతులీనుతూ ప్రతిబింబిస్తాడు.
ఆ సమయంలో అట్లా నీటి అలల అంచున కూర్చొని సముద్ర స్నానఘట్టాన్ని తనివితీరా చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఒంటికి నిండుగా స్నానపు వస్త్రాలు చుట్టుకొని మహిళలు గుంపులుగా కిందికి దిగొస్తారు. నురగలు గక్కే సాగర తరంగాల అంచులకు చేరుకోగానే వాళ్ళంతా తాము కట్టుకున్న దుస్తులు విప్పి దూరంగా విసిరేస్తారు. చిన్న చిన్న అంగలతో పరుగులు తీస్తూ నీటిలోకి ఉరుకుతారు. కెరటాల నడుమ మునుగుతూ తేలుతూ, ఆ చల్లని నీటిలో ఆనందకరమైన అనుభూతిని అనుభవిస్తారు.
సుదీర్ఘంగా సాగే స్నానఘట్టంలో కొందరేమో అలసిపోయినట్టు మధ్యలో ఆగిపోతూ వుంటారు. వాళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే చీలమండ నుంచి గొంతు వరకూ మునిగి వుండి స్నానఘట్టంలో చివరిదాకా నిలబడతారు. చర్మ సౌందర్యానికీ, ఆరోగ్యానికీ సముద్ర స్నానం శక్తివంతమైన సహాయకారి అయినా, నీటిలోంచి బయటికొచ్చినప్పుడు కొంతమంది లోపాలు బయటపడిపోతూ వుంటాయి.
నేనా యువతిని మొదటిసారి సముద్ర స్నానం చేస్తుండగా చూసి మైమరచిపోయాను. ఆమె చాలాసేపు స్నానం చేస్తూ చివరిదాకా ఉన్నది. చూసిన మొదటి చూపులోనే మనల్ని అయస్కాంతంలా ఆకర్షించే ముఖాలు కొన్ని ఉంటాయి. అవి మనల్ని తక్షణం ఆకట్టుకుని ఆహ్లాదపరుస్తాయి. అలాంటి ఒకరిని చూసినప్పుడు, నువు ప్రేమించేందుకు పుట్టిన స్త్రీని ఇంతకాలానికి కనుగొన్న గొప్ప భావన కలుగుతుంది.
అదిగో.. సరిగ్గా నాకు అటువంటి అనుభూతే కలిగింది. ఒకానొక సమయంలో నేనామెకు పరిచయం చేయబడ్డాను. ఆమెతో పరిచయమైన తర్వాత నామనసు గాలిలో తేలిపోయింది. అదే సమయంలో గతంలో ఏనాడూ లేని విధంగా కల్లోలమైంది. ఆమె కోసం నా హృదయం అదేపనిగా ఆరాటపడింది. ఒక అందమైన యువతి నా మనసులో అలజడి సృష్టించి ఆధిపత్యం చలాయించడం వల్ల నాకు సంతోషమూ, ఒకవిధమైన భయమూ ఏకకాలంలో కలిగాయి. నిజానికి ఇదో మానసిక హింస. అలాగే మనోల్లాసం కూడా. ఆమె చూపులు, నవ్వులు, గాలిలో అలలు అలలుగా ఎగిరే
జుట్టు, ఆమె నవ్వినప్పుడు ముఖం మీద పరుచుకునే చిన్న గీతలు, శరీర కదలికలు అన్నీ నాకు నాకు అవ్యక్తమైన ఆనందాన్ని కలిగించాయి. నన్నెంతగానో ఆకర్షించాయి.
అలాగే కలవరపరిచాయి. ఆమె నన్నూ, నా ఆత్మనూ పూర్తిగా ఆక్రమించుకుంది. తన మనోజ్ఞమైన హావభావాలతో, గౌరవ ప్రదమైన ప్రవర్తనతో, కట్టు బొట్టు మాటల పొందికతో నన్ను లోబర్చుకొని తనలో బంధించుకున్నది. ఆమె ఏదైనా వస్తువును చేతిలో పట్టుకున్న ప్పుడూ, చేతులకున్న గాజులు తీసి సోఫా మీదికో, మంచం మీదికో విసిరేసినప్పుడూ.. ఆమె ప్రతిచర్యా నాకు కళాత్మకంగా తోచేది. ఆమె ప్రత్యేకించి ఎంపిక చేసుకున్న గౌన్లు అపురూపమైన కళాఖండాలను లపించేవి. ఆమె తలపై ధరించే టోపీలు కూడా భిన్నంగా, ఎవరికీ లేని విధంగా వుండేవి.
అయితే, ఆమెకు పెళ్లయిపోయింది. అసలైన విషాదం అదే. ఆమె భర్త వారానికి ఒకసారి మాత్రమే ఇంటికొచ్చేవాడు. శనివారం వొచ్చి సోమవారం వెళ్లిపోయేవాడు. నాకతని గురించి మరే వివరాలు తెలియవు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చూపలేదు. అట్లాగని అతనిపై నాకెలాంటి అసూయ లేదు. ఎందుకో తెలియదు, ఇప్పటివరకు జీవితంలో నా దృష్టిని ఆకర్షించేందుకు ఆ మనిషి కంటే తక్కువ ప్రాధాన్యం గల్గిన వేరే ప్రాణి ఉన్నట్టు జ్ఞాపకం లేదు. ఏమైనా అతన్ని నేను పట్టించుకోలేదు.
కానీ ఆమెను ఎంతగా ప్రేమించాను.. ఎంత అందంగా ఉండేది.. ఆమె యవ్వనం, చక్క దనం, స్వచ్ఛత, అంతకు ముందు నేనెప్పుడూ స్త్రీలు అంత సుకుమారంగా, మనోహరంగా, విలక్షణంగా ఉండగలరనని, బలమైన ముద్ర వేయగలరని ఊహించలేదు. ఆమె చెంపల వంపుల్లో, పెదాల కదలికల్లో, గులాబీ రంగు చెవుల్లో, ముక్కు అని పిలువబడే అవయవం తాలూకు ఆకారంలో తొంగిచూసే సమ్మోహన అందాన్ని ఎప్పుడూ చూసివుండలేదు. అంత గొప్పగా ఊహించలేదు, ప్రశంసించలేదు.
ఇది మూడు నెలలపాటు కొనసాగింది. తర్వాత నేను మనసు నిండా విచారాన్ని నింపుకొని అమెరికా వెళ్లిపోయాను. కానీ ఎంతదూరం వెళ్ళినా ఆమె అందమైన రూపం, జ్ఞాపకాలు నా వెంబడే వొచ్చి నాలోనే సుస్థిరంగా వుండిపోయాయి. అంతదూరాన వున్నా ఆమెకు ఎంతో సన్నిహితంగా, ఆమెతో కలిసివున్నట్టుగానే అనిపించింది.
సంవత్సరాలు గడిచాయి. ఆమెను మరిచి పోలేదు. ఆమె మనోహర చిత్రం అంతకు ముందెప్పుడూ లేని విధంగా నాకళ్ల ఎదుట, నా హృదయంలో పదిలమైంది. ఆమె మీద నా ప్రేమలో ఎంతో నిజాయితీ, సున్నితమైన నిశ్శబ్ద ఆరాధన. నా బతుకు పొందిన అత్యంత ప్రియమైన జ్ఞాపకం.
ఒక మనిషి జీవితకాలంలో పన్నెండు సంవత్సరాలంటే ఎక్కువ కాకపోవచ్చు. అలాగే అవి మన బతుకు నుంచి జారిపోయినట్లు కూడా అనిపించకపోవచ్చు. నెలలు, సంవత్సరాలు ఒకటి తర్వాత ఒకటి మెల్లగా.. ఒక్కోసారి తొందరగా.. మరోసారి చాలా నెమ్మదిగా.. త్వరత్వరగా గడిచినట్టు అనిపిస్తుంది. ప్రతి ఏడూ సుదీర్ఘంగా సాగు తున్నట్టు అనిపిస్తూనే వేగిరంగా వెళ్ళిపోతుంది. వార్షిక సంఖ్యలు మన జీవితంలోకి మెరుపులా మెరుస్తూ.. చెరిగిపోతూ కొన్ని వాటి తాలూకు చాలా తక్కువ జాడలను మన వెనుక వదిలివేస్తాయి.
చిట్టచివరికి పూర్తిగా కరిగి అదృశ్యమవు తాయి. వెనుదిరిగి గడచిన సంవత్సరాల్లోకి తొంగిచూడాలనుకున్నప్పుడు నీకేమీ కనిపించదు. అదేవిధంగా ఒకరికి తనకు తెలియకుండానే వృద్ధాప్యం ఎట్లా మీదపడిందో అర్థం కాదు.
నా విషయంలో అదే జరిగిందని అనిపిస్తూ వుంటుంది. కేవలం కొద్ది నెలల కాలవ్యవధి, నాటి ఎట్రాటెట్ తీరంలోని ఇసుకతిన్నెల మీద ఆ మనోహర సీజన్ నుంచి నన్ను వేరుచేసి దూరంగా నెట్టివేసినట్టు నాకనిపించింది.
గత వసంతంలో ఒకసారి మైసన్స్-లాఫిటే నీ వద్ద కొందరు స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం కోసం వెళ్లాను. కాసేపట్లో రైలు కదలబోతుందనగా బాగా లావుగా వున్న ఒక స్త్రీ నలుగురు పిల్లలతో ఎక్కింది. ఆమెది స్థూలకాయం. పొట్టిగా గుండ్రంగా తల్లికోడిలా వున్న ఆమెను చూశాను. హడావిడిగా వచ్చినందుకు అలసిపోయి భారంగా దమ్ము తీస్తున్నది. ఎగబోస్తూ తడబడుతున్న ఏనుగులా నడవడానికి పాపం చాలా ఆయాస పడింది. మెల్లగా వచ్చి నా పక్కనే కూర్చున్నది.
రైలు బయలుదేరగానే ఆమె పిల్లలు కబుర్లలో పడిపోయారు. నేను చేతిలో వున్న పేపరు విప్పి చదవడంలో మునిగిపోయాను. మేము ఎస్నిర్స్ దాటి వొచ్చేశాం. అప్పుడు నాపక్కన కూర్చుని ఉన్న లావుపాటి స్త్రీ హఠాత్తుగా నా వైపు తిరిగి "క్షమించండి. మీరు పియరీ గార్నియర్ కదూ" అంది.
"అవును.. నా పేరు మీకెలా తెలుసు?" నేను కొంచెం ఆశ్చర్యపోతూ జవాబు చెప్పగానే ఆమె పెద్దగా నవ్వసాగింది. అట్లా ఎందుకు నవ్వు తుందో అర్థం కాలేదు. అమాయకమైన ఆమె నవ్వు నన్ను ఆహ్లాదపరిచింది. అయితే ఆమె నవ్వులో ఏమూలో విచారం తొంగిచూసినట్టు కూడా అనిపించింది. కాసేపటి కామె నవ్వు ఆపి “మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు" అన్నది.
నేను సంశయిస్తూ ఆమెను మరింత పరీక్షగా చూశాను. ముఖం ఎక్కడో చిరపరిచితం అనిపించింది. కానీ ఎప్పుడు, ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. "నిజమే! గుర్తు రావడంలేదుగానీ, ఖచ్చితంగా చెప్పగలను మీరెప్పుడో నాకు తెలిసినవారే. పేరు కూడా జ్ఞాపకం రావడం లేదు. "
నా మాటలకు ఆమె కొద్దిగా సిగ్గుపడింది. "గుర్తు తెచ్చుకోండి, మేడం జూలీ లెఫేవే."
ఆ పేరు విని షాక్ తిన్నాను. నా జీవితంలో నేనెప్పుడూ అంతలా ఆశ్చర్యపోలేదు. క్షణాల వ్యవధిలో నాలో ఏళ్ల తరబడి గూడుకట్టుకొని వున్న ఆశలపై హఠాత్తుగా నీళ్ళు గుమ్మరించి నట్టూ, ఏదో అంతా ముగిసిపోయినట్టూ అనిపించింది. కళ్ళముందు పరుచుకున్న తెర తొలగినట్టయింది. ఒక భయంకరమైన వాస్తవానికి ఆవిష్కరణ జరిగినట్టు ఫీలయ్యాను.
'అంటే.. ఈమె ఆమేనా? భారీగా, స్థూలకాయంతో వికారంగా వున్న ఈమె జూలీ లెఫేవ్రేనా?' గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్న వాడిలా ఉక్కిరిబిక్కిరయ్యాను.
నేనామెను చివరిసారి చూసినప్పటి నుండి గడచిన కాలంలో ఆమె నలుగురు పిల్లలకు తల్లి అయింది. పిల్లలు కూడా చిన్నవాళ్ళేమీ కారు. తల్లిలాగే వాళ్ళు కూడా నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేశారు. నలుగురూ ఆమె సంతానమే. ఆమెలో ఒక భాగమే. అందరూ బుద్ధి జ్ఞానం తెలిసినవాళ్లే. జీవితంలో అప్పటికే తమకంటూ ఒక స్థానం పొందినవాళ్లే.
కానీ ఆమె.. ఇకపై ఆమెను సౌందర్యరాశి అనలేను. ఒకప్పటి అందాల ఛాయలు ఇప్పుడామెలో నామమాత్రం కూడాలేవు. అయితే యేళ్ళు గడిచినా ఆమె సౌందర్యం తాలూకు జ్ఞాపకాలు ఇంకా నాలో పదిలంగానే వున్నాయి. ఏదో నిన్నమొన్న చూసినట్టుగానే అనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి.. ఇప్పుడు పూర్తిగా రూపం మారి, భిన్నమైన మనిషిలా
ప్రత్యక్షమైంది. ఇదెలా సాధ్యం? నాలో దుఃఖం పదునుదేరి గుచ్చుతూ మనసును గాయపర్చింది. ఏమిటిది.. ఆమెలో అంతటి మార్పునకు కారణం ప్రకృతి తనపై తాను చేసుకున్న తిరుగుబాటా? కాలం తీర్చుకున్న విద్వేషమా? ఏదైనా, కాల పరిణామ చర్యకు నిరసనగా నాలో ఒక అసమంజసమైన ఆగ్రహం తన్నుకొచ్చింది.
ఆమె వైపు ఆందోళనగా చూశాను. తెలియని ఆరాటంలో నా కళ్ళలో నీళ్ళు సుడులు. తిరిగాయి. చొరవగా ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆమెలో అదృశ్యమైన సౌందర్యం కోసం కళ్ళలో వెతికాను. కనుమరుగైన యవ్వనం కోసం నా మనసులో రోదించాను. 'ఇంతకూ ఎవరీమె? ఈ అనాకారి.. స్థూలకాయం.. కొత్త రూపురేఖలు గల్గిన మహిళా ఎవరో నిజంగానే నాకు తెలియదు..'
నేనెవరో తెలిసి, ఆమెని నేను గుర్తించినందుకు ఆనందంలో ఆమె తీవ్ర భావోద్వేగాలకు లోనైంది. ఉత్సాహంగా కూడా కనిపించింది. నాముఖంలోకి సూటిగా చూడకుండా కొంచెం తడబడుతూ అన్నది.
"నేను చాలా మారిపోయాను కదూ? అందుకు నువ్వు నిరాశ చెందినట్టు కనిపిస్తున్నది. నానుంచి నువ్వేం ఆశించావో దానికి భిన్నంగా వుంది కదా నా రూపం? తప్పదు, ప్రతిదానికి ఒక సమయం వుంటుంది. చూశావుగా.. నేను నలుగురు పిల్లల తల్లినయ్యాను. అంతేకాదు, మంచి తల్లిగా కూడా కొనసాగుతున్నాను. కాలం ముందుకు పోతూనే వుంటుంది పియరీ! కాలంతో పాటే మిగతా అన్నీ మర్చిపోవాలి. జ్ఞాపకాలన్నిటికీ వీడ్కోలు చెప్పాలి. ఇప్పుడిక మిగిలింది ఏమీ లేదు. అంతా ముగిసినట్టే. ఇన్నేళ్ల తర్వాత మనమిట్లా కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నువ్వు నన్ను గుర్తుపడతావని నేనసలు అనుకోలేదు. నన్నెప్పుడో మరిచిపోయి ఉంటావనుకున్నాను. అన్నట్టు ఒక వాస్తవ విషయం చెప్పాలి. నువ్వు కూడా ఎంతో మారావు. బాగా పెద్దవాడివై పోయావు. అందుకే నిన్ను నువ్వేనని నిర్ధారించుకునేందుకు సమయం పట్టింది. నీ జుట్టు పూర్తిగా తెల్లబడింది. మనం కలిసి పన్నెండు సంవత్సరాలు గడిచాయి. కొంచెం ఆలోచించు.. పన్నెండేళ్ళంటే తక్కువేమీ కాదు.. ఆనాటికే మా పెద్దమ్మాయి వయసు తొమ్మిదేళ్లు."
నేను తలతిప్పి పెద్దమ్మాయి వైపు చూశాను. మనిషి చక్కగా వున్నది. ఆమెలో తల్లి గత కాలపు సౌందర్య ఛాయలు తొంగిచూస్తూ కనిపించాయి.
నేను ప్రయాణం చేస్తున్న రైలుమాదిరే నా జీవితం కూడా వేగంగా పరుగులు తీస్తున్నట్టు తోచింది. ముందుగా నా గమ్యస్థానమైన మైసోన్స్ లాఫిట్టే వచ్చేసింది. సీట్లో నుంచి లేచాను. నాతోపాటు ఆమె కూడా లేచింది. చటుక్కున నా పాత స్నేహితురాలు (ప్రియురాలు) చేయి నోటికి ఆనించుకొని ప్రేమగా ముద్దుపెట్టుకున్నాను.
ఊహించని రీతిలో ఆమె చేతులు నా నడుముకు గట్టిగా చుట్టి ఎదపై తలవాల్చింది. అలా కొన్ని క్షణాలు గడిచాయి. మాటలకు అందని అనుభూతితో చిన్నగా ఆమె చేతులను విడిపించుకున్నాను. ఆమెతో ఇంకేమీ మాట్లాడలేకపోయాను. పన్నెండేళ్ళ తర్వాత కలిసిన నా ప్రేయసితో మాట్లాడేందుకు సాధారణ విషయాలు తప్ప ఏమీ మిగలనందుకు విచారం కలిగింది.
ఆ రాత్రి ఇంట్లో ఒంటరిగా చాలాసేపు అద్దం ముందు నిలబడి నన్ను నేను పరీక్షగా చూసు కున్నాను. వాస్తవంలో ఇప్పుడు నేనేమిటని పరిశీలించుకున్నాను. గతాన్ని గుర్తు చేసు కున్నాను. మనోనేత్రం ముందు నా గోధుమ రంగు బలమైన ఆకారం, పెద్దపెద్ద మీసాలు, గుబురుగా నల్లని వొత్తయిన జుట్టు, ముఖంలో ప్రతిఫలించే యౌవన వ్యక్తీకరణలు కదలాడినయి.
అవును, ఆమె చెప్పింది నిజమే. నేనిప్పుడు. ముసలివాణ్ణి. అందుకే ప్రియతమా.. ఇక వీడ్కోలు."
ప్రచురణ:ఆంధ్రజ్యోతి
మూల రచయిత: గైడి మొపాసా
అనువాదం: అయోధ్యారెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి