లాక్ డౌన్ తర్వాత వచ్చిన తొలి ఆదివారం అది. బైపాసకు ఆనుకుని ఉన్న పెట్రోల్ బంకు పక్కన పంక్చర్ షాపులో కూర్చుని ఉన్నాడు. రిజ్వాన్. అతనికెందుకో ఇవ్వాళ ఆ 'కారుమనిషి' గుర్తుకొస్తున్నాడు.
అతనెవరో రిజ్వాన్కు తెలియదు. ప్రతి ఆదివారం సాయంత్రం నేరుగా కారులో తన పంక్చర్ షాపును వెతుక్కుంటూ వస్తాడు.. కారును పక్కనే పార్క్ చేసి షాపులో కూర్చుంటాడు. వన్ బై టూ టీ చెప్పి, ఒక సిగరెట్ వెలిగించి పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోతాడు.
మొదట రిజ్వాన్ కొంత గందరగోళపడ్డాడు. తర్వాత అలవాటు పడ్డాడు. రిజ్వాన్ ఒక్కోసారి అతనితో బాగా మాట్లాడుతాడు. తనబాధలన్నీ చెప్పుకుంటాడు. అతను చెప్పిందీ వింటాడు.
అతను ఎక్కువగా ఇంగ్లిషు మాటలు కలిపి మాట్లాడుతాడు. ఇంటర్ దాక చదువుకున్న రిజ్వాన్కు అతని భాషంతా అర్థమవుతుంది. కానీ అది ఆఫీసర్ల భాష అనిపిస్తుంది. ఒకసారి అడిగాడు కూడా 'మీరు ఎంప్లాయా.. సార్?" అని
'అవును' అన్నాడతను.
'ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు?' అని అడుగుదామనుకున్నాడు కానీ అదంతా తనకు అనవసరమనిపించింది. అసలే పెద్దింటోడిలా ఉన్నాడు. ఏ మాటకు ఏం అపార్థం చేసుకుని నెత్తిమీదికొస్తుందో అని కొంత భయపడ్డాడు కూడా.
రోజులు ప్రశాంతంగా గడిచేకొద్ది అతనెప్పుడూ ఇలా గుర్తుకురాలేదు. బహుశా కరోనా వల్ల గిరాకీలేక ఏమీ పాలుపోక పోవడమే ఇందుకు కారణం కావొచ్చు.
అతనొస్తే కలసి వన్ బై టూ టీ తాగి
పిచ్చాపాటి మాట్లాడుకుంటే కొంత హాయిగా ఉంటుందనిపిస్తోంది రిజ్వాన్కి. అందుకే షాపు ముందు నుంచి ఏ కారు వెళ్లినా డ్రైవర్ సీట్లో అతనే ఉన్నాడేమో అని చూస్తున్నాడు. ఎక్కువ సార్లు అతనే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడో కానీ పక్కన డ్రైవర్ ఉండడు. అతనేం పని చేస్తాడో తెలుసుకోవాలని రిజ్వాన్కు ఆశ.
అతనిది క్రెటా, హ్యూందాయ్ కంపెనీ కారు. ఎప్పుడూ ఖరీదైన టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని కనబడతాడు. మధ్య వయసు. రోజు గీకే చదునైన గడ్డం. సిగరెట్ల వల్ల బేస్ గొంతు. మంచి పొడుగు, సన్నం, త్రీపీస్ కళ్లద్దాలు. రంగు కొంత నలుపైనా ఎప్పుడూ ఏసీ గాలితో తాజాగా అనిపించే చర్మం. మనిషి దర్పంగా కనిపిస్తాడు.
కచ్చితంగా అతను ఏదైనా బ్యాంకులో పని చేస్తుంటాడు అనుకున్నాడు. మొదటిరోజు అతనొచ్చినప్పటి దృశ్యం రిజ్వాన్కు బాగా గుర్తే ...
కారు రావడం రావడమే షాపు ముందు ఆగింది. కారు దిగి 'ఏం మిత్రమా.. బావున్నావా?' అన్నాడు.
పలకరించాక జవాబు ఇవ్వకపోతే బాగోదని 'బావున్నాను సార్' అన్నాడు.
'నేనిక్కడ కూర్చోవచ్చా' అన్నాడతను అరుగులా పరిచిన బండను చూపిస్తూ. అది నల్లటి ధూళితో మురికిగా ఉంది.
'అయ్యో.. కూర్చోండి సార్' అని బండ మీదున్న ధూళిని తన చేతిలోని టవల్తో దులపబోయాడు. అతను వారించి, అలాగే ఆ ధూళి మీదే ఏ ఇబ్బంది లేకుండా ఎంతో ఇష్టంతో కూర్చున్నాడు.
రిజ్వాన్కి ఆశ్చర్యమేసింది. కారుకు ఏమైనా పంక్చర్ అయిందా అని దానివైపు చూశాడు. తెల్లగా మెరుస్తున్న కారుకు నాలుగు టైర్లూ బాగానే ఉన్నాయి.
రిజ్వాన్ కారు చుట్టూ తిరగడం చూసి 'పంచరవ్వలేదు. నేనే కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చాను' అన్నాడతను.
రిజ్వాన్ చిన్నగా నవ్వాడు.
అంతకుముందెప్పుడైనా తన దగ్గర పంక్చర్ వేయించుకున్నాడేమో! అది గుర్తు పెట్టుకుని వచ్చాడేమో. ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు. కానీ ఎక్కడో చూసినట్టు మాత్రం అనిపిస్తోంది.
ఒకసారి అటూ ఇటూ కళ్లతోనే వెతికి 'ఇక్కడ టీ దొరుకుతుందా?' అన్నాడతను.
'మీరు ఉండండి. నేను చెబుతాను' అని ముందుకు కదలబోయాడు రిజ్వాన్.
'మిత్రమా... వన్ బై టూ చాలు, ప్లీజ్.. ఎక్కువ తాగలేను.'
రిజ్వాన్ నేరుగా పక్కనే ఉన్న టీ షాపు దగ్గరికెళ్లి ఆర్డర్ ఇచ్చాడు. అతని వెనకే టీ వచ్చేసింది.
చెరొక గ్లాసు అందుకున్నారు. అతను టీ గ్లాసును అరుగు మీదే పక్కన పెట్టుకుని సిగరెట్ వెలిగించాడు.
'అలవాటుందా?' అంటూ ఓపెన్ చేసిన సిగరెట్ ప్యాకెట్ని ముందుకు చాచాడు. రిజ్వాన్ 'అయ్యో..' అని రెండడుగులు
వెనక్కి జరిగాడు. అలవాటు లేదని రిజ్వాన్ ప్రవర్తనతోనే అర్థమైపోయింది.
సిగరెట్ ప్యాన్ని ప్యాంటు జేబులో పెట్టుకుని స్టయిల్గా సిగరెట్ వెలిగించాడు. ఒక చేత్తో టీ మరో చేత్తో సిగరెట్ తాగుతూ, మధ్య మధ్యలో ప్రశ్నలు వేశాడు.
రిజ్వాన్ ఇక్కడే పాత తాడేపల్లిలో ఉంటున్నట్టు చెప్పాడు. ఇద్దరు ఆడపిల్లలు - ఒకరు రెండు, మరొకరు ఐదు. పెద్దవాళ్లయిన తల్లిదండ్రులు కూడా తనతోనే ఉంటున్నారని తనకు ఓ అన్న ఉన్నాడని - కానీ బాధ్యత లేకుండా అక్కడా ఇక్కడా తిరుగుతుంటాడని అన్నకూ తనకీ మాటల్లేవని ఇలా ఎన్నోచెప్పాడు.
వ్యక్తిగత విషయాలు అడగడం అయిపోయాక అతను ఆ ఏరియాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులు గురించి అడిగాడు. రిజ్వాన్ ఏదో తనకు తెలిసింది. చెప్పాడు. ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక నిత్యం పోలీస్ గస్తీ ఉందని, కొత్త కొత్త దుకాణాలు వచ్చాయని, రియల్ ఎస్టేట్ పడిపోయి ఇక్కడోళ్లంతా ఇబ్బందుల్లో ఉన్నారని. ఇలా.. ఏదేదో చెప్పాడు.
అప్పుడే అతనికి ఏదో ఫోన్ వచ్చింది. 'ఓకే.. దెన్ బై..' అంటూ కారెక్కి వెళ్లిపోయాడు. తర్వాత ఇంచుమించు ప్రతి ఆదివారం సాయంత్రం అతను ఒకసారి కనబడుతూనే ఉన్నాడు.
...
ఈ రోజు కూడా రావాలి. వస్తాడు!
రిజ్వాన్ మనసు చదివినట్టు అనుకోకుండా అతని కారొచ్చి ఆగింది. ఈసారి కారులో డ్రైవర్ ఉన్నాడు.
రిజ్వాన్ ముఖం వెలిగిపోయింది.
వెంటనే టీకొట్టువాడిని కేకేసి రెండు వేళ్లు చూపించి తర్వాత అవే వేళ్లు అడ్డంగా ఊపాడు. అది వన్ బై టూ సిగ్నల్ అని. కొట్టుడికి సులభంగా అర్థమై 'సరే' అని తలూపాడు.
అతనొచ్చి ఎప్పటిలాగే ఆ నల్లబండ మీద కూర్చున్నాడు.
"లాక్ డౌన్ వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావుగా. నీకు నా ఫోన్ నెంబరు ఇచ్చి. ఉండాల్సింది. ఏదైనా అవసరమైతే చేసేవాడివి' గొంతులో పశ్చాత్తాపం ధ్వనిస్తుండగా అన్నాడతను.
రిజ్వాన్ ఏమీ మాట్లాడలేదు. ఇంతలో టీ వచ్చేసింది. అతని నోట సిగరెట్టూ వెలిగింది.
టీ కొట్టు అతనికి ఖాతాలో రాసుకోమని చెప్పి రిజ్వాన్ ఇలా తిరిగే సరికి ఎప్పుడొచ్చాడో కారు డ్రైవర్ వచ్చి ఒక తెల్లటి కవర్ని అతని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అతను కాల్చిన సిగరెట్ పడేసి లేచాడు. నేరుగా రిజ్వాన్, దగ్గరికొచ్చి ఆ కవర్ని పై జేబులో పెట్టి 'నేనెళ్లాక చూసుకో' అన్నాడు నవ్వుతూ.
రిజ్వాన్ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే 'మిత్రమా నాకు చిత్తూరు ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇక ఎప్పుడో కలిసేది..' అని చెబుతూ కారెక్కాడు.
జేబులో కవర్ని చేతిలోకి తీసుకుని, కూర్చున్న పీట మీది నుంచి లేచేసరికి కారు. ముందుకు వెళ్ళిపోయింది.
రిజ్వాన్ ఆత్రంగా కవర్ చించి చూశాడు. ఐదు వందల నోట్ల కట్ట. అందులో కనీసం ఓ వంద నోట్లన్నా ఉంటాయని బరువు చూసే అంచనా వేసుకున్నాడు. సిగ్గుగా అనిపించింది. ఎవరో తనను ముష్టివాడి కింద లెక్క గట్టి బిచ్చమేసినట్టు అనిపించింది. తేరగా అంత డబ్బు ఎప్పుడూ రాలేదు తనికి. తను నమ్మిన ధర్మం ప్రకారం కష్టపడ్డ సొమ్ము మాత్రమే తనది. ఇది మాత్రం కాదు. ఆలోచనలో పడ్డాడు. 'ఇంతకీ అతనెవరు?' ఏమీ అర్థంకాక గింజుకున్నాడు. అప్పటిదాకా పక్కనే టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతూ అంతా గమనించిన ఓ పెద్దమనిషి వేగంగా రిజ్వాన్ దగ్గరికొచ్చాడు.
'ఇప్పుడొచ్చినతను నీకు బాగా తెలుసా?' అడిగాడు ఆత్రంగా. చేతిలోని డబ్బు అలాగే కవర్లో దూర్చి, జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాక రిజ్వాన్ నవ్వుతూ చెప్పాడు.
"ఔనండి. అతను చాలా రోజుల నుంచి పరిచయం. చాలా దగ్గర నాకు' అయితే ఏమిటి అన్నట్టు చూస్తూనే చెప్పాడు.
`అతను ఈ ఏరియా మున్సిపల్ కమిషనర్ గంగరాజు కదా. ఐఏఎస్ ఆఫీసర్. ఓ పని మీద అతని దగ్గరికి రోజూ తిరుగుతున్నాను. అవడం లేదు. నువ్వు చేసి పెడితే ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తాను."
రిజ్వాన్ తలపట్టుకున్నాడు. అసలు తన చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తాను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కోబోతున్నాడా?
కంగారుపడి సారీ భయ్యా నాకలాంటివన్నీ తెలీవు. అతను స్నేహితుడు అంతే. ఇలాంటి పనులు నేను చేయలేను..' నవ్వుతూనే తిరస్కరించాడు.
గొంతులో కొంత వినయంతో పాటు కఠినత్వం కూడా ధ్వనించడంతో మరోమాట లేకుండా ఆ పెద్దమనిషి అక్కడి నుంచి జారుకున్నాడు.
రిజ్వాన్కు తలనొప్పిగా ఉంది. అంత పెద్ద ఆఫీసర్ తన దగ్గరికి రావడం ఏంటి? అసలేమై ఉంటుంది? ఆ నల్లబండ మీద కాసేపు కూర్చున్నాడు. తర్వాత అలాగే వెల్లకిలా పడుకున్నాడు. అతనికి చిక్కుముడి మెల్లగా వీడుతోంది.
ఆరు నెలల కిందట జరిగిన సంఘటన లీలగా గుర్తుకొచ్చింది.
ఆరోజు కూడా ఆదివారమే. సాయంత్రం ఐదున్నరవుతోంది. చినుకులు మొదలయ్యాయి. అతను జాగింగ్ కోసం వచ్చినట్టున్నాడు. వెంట ఎవరూ లేరు. ఇప్పుడంత సన్నగా లేడు అప్పుడతను. కొంచెం ఒళ్లు చేసి ఉన్నాడు.. పైగా చాలా సింపుల్గా అమాయకంగా అనిపించాడు కూడా. ఏదైనా మొక్కు ఉందేమో గుండు చేయించుకుని ఉన్నాడు.
కరెక్టుగా రిజ్వాన్ పంక్చర్ షాపు ముందుకు వచ్చి కింద పడిపోయాడు. నిల బెడితే నిలబడలేక పోతున్నాడు. అంత మనిషిని రిజ్వాన్ భుజమ్మీద వేసుకొని ఆ నల్లబండ మీద కూర్చోబెట్టాడు. మంచి నీళ్ల బాటిల్ అందించాడు. అతను రెండు గుక్కలు నీళ్లు తాగి 'కూర్చోలేను' అంటూ అరిచాడు. రిజ్వాన్ బాటిల్ తీసుకుని అతన్ని అలాగే బండమీద వెల్లకిలా పడుకోబెట్టాడు.
'ఏమైంది భయ్యా.. ఎక్కడ నొప్పి..?' అని కాళ్లు నొక్కడం మొదలు పెట్టాడు.
కాలి నరం పట్టేసింది.. నన్నేమి మాట్లాడించొద్దు ప్లీజ్.. కాసేపు పడుకోని" అంటున్నాడతను బండ మీద అటూ ఇటూ పొర్లుతూ.
'ఎవరికైనా ఫోన్ చేయాల్నా...' అన్నాడు. రిజ్వాన్ అతని మాటలు పట్టించుకోకుండా. 'మా మిసెస్కి ఇందాకే ఫోన్ చేశాను.
వచ్చేస్తుంది' అన్నాడతను నమ్మకంగా. కానీ ఎంతసేపటికీ ఆమె రాలేదు. అతను బాధతో విలవిల్లాడుతున్నాడు. రిజ్వాన్ చూడలేకపోయాడు.
'ముందు మీ ఇళ్లు ఎక్కడో చెప్పండి.. అక్కడికి చేరుస్తాను..' అన్నాడు.
అతనేం మాట్లాడలేదు. స్పృహ కోల్పోయాడు. కళ్లు తెరిచేసరికి అతను ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. డాక్టర్ వచ్చి 'ఎంఆర్ఐ చేయించండి, అన్ని వివరాలు తెలుస్తాయి' అని చెబుతున్నాడు.
పక్కనే రిజ్వాన్. అతను నెమ్మదిగా కళ్లు తెరిచి, రిజ్వాన్ చేతులు పట్టుకుని 'థాంక్స్, బ్రదర్ అన్నాడు.
'మీ భార్య అనుకుంటా చాలాసార్లు ఫోన్ చేశారండి. ఆమెకు కరెక్టు లొకేషన్ అర్థం కావడం లేదని చెప్పారు. నేను ఈ ఆస్పత్రి అడ్రస్ చెప్పి మిమ్మల్ని నేరుగా అంబులెన్స్లో ఇక్కడికి తెచ్చాను. ఇందాకే డాక్టర్ ఓ ఇంజెక్షన్ చేస్తే మీరు కోలుకున్నారు' జరిగింది చెప్పాడు. రిజ్వాన్.
ఆమె మాటల్లోనే వచ్చింది. తెల్లగా, పొట్టిగా ఉంది. ముఖంలో కంగారు స్పష్టంగా కనబడుతోంది.
'సార్ తాలూకే కదా' అన్నాడు రిజ్వాన్.
'ఔను' అన్నట్టు తలూపిందామె. బెడ్డు పక్కనే నిలబడి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది.
రిజ్వాన్ చెప్పడం మొదలుపెట్టాడు.
నేనే నండి ఫోన్లో మాట్లాడింది. ఇప్పుడు ఈయనకు బాగానే ఉంది. డాక్టర్ గారు వచ్చి ఎంఆర్ఐ తీయించమన్నారు' అని చీటీ ఆమె చేతిలో పెట్టాడు.
మళ్లీ వెంటనే - 'సార్కు బాగయ్యేంతవరకు మీకేమైనా మనిషి తోడు అవసరమైతే నేను ఇక్కడే పెట్రోల్ బంకు దగ్గర దాబా పక్కనే పంక్చర్ షాపులో ఉంటాను. ఎప్పుడైనా కబురు పెట్టండి పర్వాలేదు. ఏమీ మొహమాట పడొద్దు' అని చెప్పి బాధ్యతగా ఫోన్ నెంబరు ఇచ్చి వచ్చాడు. ఏ పరిచయం లేకపోయినా అతను చూపించిన ప్రేమ, శ్రద్ధ తీసుకున్న బాధ్యత ఆస్పత్రి బెడ్డు మీదున్న గంగరాజును బాగా
ఆకట్టుకుంది. రిజ్వాన్ పట్ల కృతజ్ఞతాభావం అతనిలో గూడుకట్టుకునిపోయింది. అదంతా రిజ్వాన్కు తెలియదు. అదొక్కటే కాదు ఆ తర్వాత ఎంఆర్ఐ రిపోర్టు ఆధారంగా గంగరాజుకు వెన్నుపూస ఆపరేషన్ అర్జంటుగా చేశారని, నెలరోజులు బెడ్డు మీదుండి మరో నెలరోజులు ఫిజియోథెరపీ సహాయంతో మెల్లగా నడిచి కోలుకున్నాడని కూడా తెలియదు.
.. తాను చేసిన ఒక చిన్న సహాయానికి మరీ ఇంత కృతజ్ఞతా.. అది కూడా సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి' రిజ్వాన్ ఇదంతా నమ్మలేకపోతున్నాడు.
ఇప్పుడీ డబ్బు తీసుకుంటే తాను చేసిన సహాయానికి విలువేం ఉంటుంది. ఆ క్షణంలో అతనే కాదు ఎవరు అలా ఇబ్బందుల్లో ఉన్నా సహాయం చేయడం తన ధర్మం. అలా చాలామందికి తన చేతనైన సహాయం చేశాడు. కూడా. ఆ కాసేపు గుర్తుంచుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోతారంతా. ఇదంతా జీవితంలో భాగమని వాళ్లకూ తెలుసు.. తనకూ తెలుసు. కానీ ఈ ఆఫీసర్ ధోరణే వింతగా ఉంది.
ఏమైతేనేమి చిక్కుముడి వీడినందుకు రిజ్వాన్కు మనసు ప్రశాంతంగా ఉంది. అప్పటికే చీకటి పడటంతో నల్లబండ మీద నుంచి లేచి సామాన్లన్నీ సర్ది, షాపు మూసేసుకుని ఇంటికెళ్లాడు.
తెల్లారి పదిన్నర గంటలకు పోస్టాఫీసు రోడ్డులో ఉన్న మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాడు. 'అయ్యగారు.. ఇప్పుడే వచ్చారు. కాసేపు ఉండండి కలిపిస్తాను అన్నాడు. అక్కడున్న అటెండర్.
పెద్ద ఆఫీసు. చుట్టూ హడావిడిగా కంప్యూటర్ల ముందు కూర్చోని ఎవరి పనిలో వాళ్లు ఉన్నారు. ఉద్యోగులు. తనకిలా ఈ ఆఫీసును వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఉంటుందని అతనెప్పుడూ అనుకోలేదు. వాతావరణమంతా కొత్తగా ఉంది..
ఎదురుగా ఒక సోఫా ఉంది. తనలాగే పెద్దసారును కలవడానికి వచ్చిన మరో ఇద్దరు విజిటర్లు అక్కడ కూర్చుని ఉన్నారు. అటెండర్ కూడా తనను అక్కడ కూర్చోమన్నాడు. కాసేపటికి అటెండర్ వచ్చి 'అందరూ తమ పేర్లు ఈ కాగితాల్లో రాసివ్వండి. సారికిస్తాను' అని చెప్పి స్లిప్పులిచ్చి పోయాడు. రిజ్వాన్ స్లిప్పు రాసి అటెండరుకు ఇచ్చాడు. తాను ఊహించినట్టుగానే స్లిప్పు చూసి అందరికన్నా ముందు తననే రమ్మన్నాడట ఆఫీసర్. ఓ పదినిమిషాలు లోపలికి ఎవర్నీ పంపొద్దని కూడా చెప్పాడట. అటెండర్ వచ్చి వినయంగా చెప్పేసరికి సంతోషమైంది కానీ ఎందుకో నుదుట కొద్దిగా చెమట పడుతోంది. బిక్కు బిక్కుమంటూ తలుపు తోసుకుని లోపలికెళ్లాడు.
పెద్ద గది, పెద్ద టేబుల్, రూమంతా శుభ్రంగా, చక్కగా సర్ది ఉంది. వెనకాల గోడకు ముఖ్యమంత్రి ఫోటోతోపాటు అంబేద్కర్ ఫోటో తగిలించి ఉంది. గదంతా సువాసన వెదజల్లు తోంది. ఏసి మరీ వణికించకుండా మెల్లగా ఆడుతోంది. ఆఫీసర్ సీటుకు ముందు ఒకేసారి ఓ ఇరవై మంది కూర్చోవడానికి సిద్ధంగా పర్చిన కుర్చీలు ఉన్నాయి. తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటులో మెరిసిపోతున్నాడు ఆఫీసర్. ఇన్షర్టు చేసుకుని నల్లటి షూస్ వేసుకోవడంతో అతని ఆకారమే మారిపోయి కనిపిస్తోంది.
రిజ్వాన్ అతన్ని చూసి తనకు తెలియకుండానే ముందుకు వంగిపోయాడు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అతని
టేబుల్ ముందుకెళ్లి నిలబడ్డాడు. అతను పెద్దగా నవ్వేశాడు. 'మొత్తానికి నన్ను కనిపెట్టేశావ్ రిజ్వాన్. గట్టోడివే.. కూర్చో'
రిజ్వాన్ కూర్చోవడానికి తటపటాయించాడు. అతను సీట్లోంచి లేచొచ్చి వంగి ఉన్న రిజ్వాన్ని నిటారుగా చేశాడు. వినయంగా కట్టు కునివున్న రెండు చేతులను విడిపించి బలవంతంగా సీటు మీద కూర్చోబెట్టాడు.
రిజ్వాన్ అసౌకర్యంగానే కూర్చున్నాడు. 'ఎందుకు రిజ్వాన్. ఏం తప్పు చేశావని నువ్వు అలా వంగిపోయి చేతులు కట్టుకుని ఉన్నావ్. ఎవరి ముందు అలా చేతులు కట్టుకోకు.'
రిజ్వాన్ ఇబ్బందిగానే తన జేబులోంచి డబ్బు కవర్ తీసి టేబుల్ మీద పెట్టాడు. కన్నీళ్లు పొంగుతుండగా 'ఏదో ఆరోజు సమయానికి నేనున్నాను కాబట్టి మిమ్మల్ని ఆస్పత్రిలో చేర్చాను. ఆ మాత్రం దానికి మీరు గుర్తుపెట్టుకుని ప్రతి వారం నా దగ్గరికి రావడంతోపాటు చాలా. ధైర్యాన్నిచ్చారు. దాంతో నేను ఏదైనా మీకు సమస్యలకు సహాయం చేసి ఉంటే చెల్లిపోయింది సారూ. ఈ డబ్బు హరామ్. నేను ముట్టుకోలేను' అన్నాడు.
ఇప్పుడీ కవర్ నువ్వు తీసుకుంటే నాకు ఎంతో కొంత Burden of Gratitude అంటారు కదా అది తగ్గుతుంది. లేదంటే ఇంత పెట్టుకుని నీ సహాయానికి ప్రతిగా ఏం చేయలేకపోయానే అనిపిస్తుంది. ఇంకో మాట చెప్పనా రిజ్వాన్. నీకెంత చేసినా తక్కువే. ఎందుకంటే చుట్టూ డబ్బు తప్ప ఆప్యాయతల్లేని ప్రపంచంలో బతుకుతున్నాను. నన్ను నాలా ప్రేమించేవాళ్లంటే నాకు ఇష్టం.
నేను వారమంతా రకరకాల మీటింగుల్లో తలమునకలై పిచ్చెక్కి పోయి ఉంటాను. వారాంతంలో నీ దగ్గరికొచ్చి ఆ నల్లబండ మీద కాసేపు కూర్చుంటే నా మనసు తేలిక పడు తుంది. తెలియని ఓ నమ్మకం కలుగుతుంది. ఇంకా ఈ భూమ్మీద మానవతా విలువలు బతికే ఉన్నాయని భరోసా కలుగుతుంది.
ఈ ఇచ్చిపుచ్చుకోవడమే తెలిసిన వ్యాపార ప్రపంచంలో మానవత్వం ఒక మిథ్య అనేది నిన్ను చూడకముందు నాకున్న నమ్మకం. అందుకే నువ్వు చేసిన సహాయానికి వెంటనే ఏమీ చేయబుద్ధి కాలేదు. చేస్తే అది వ్యాపారమవుతుందని భయం. మరేం చేయాలి? ఏం చేయాలో తెలియక ప్రతి వారం కృతజ్ఞతా భావంతో నీ పంచర్ షాపు చుట్టూ తిరుగుతున్నాను. నీకు జీవితాంతం రుణపడి ఉండటమే నేను నీకిచ్చే పెద్ద గ్రాట్యిట్యూడ్.'
ది గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ గంగరాజు గొంతు గద్గదమవడంతో రిజ్వాన్ సీట్లోంచి లేచి నిలబడ్డాడు. తాహత్తు మర్చిపోయి అతన్ని కౌగలించుకున్నాడు. అతను కూడా అంతే నిరాడంబరంగా స్వీకరించాడు.
అరనిమిషం సాంత్వన తర్వాత గంగరాజు ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే అతని విడిపించుకుని 'అవును భాయ్. నువ్వొచ్చి ఇంత సేపైనా నీకోసం ఏమి ఆర్డర్ చేయలేదు. చెప్పు. ఇప్పుడు నువ్వు నా అతిథివి. వేడిగా తీసుకుంటావా.. చల్లగా తీసుకుంటావా?'
చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుని 'నాకేమి వద్దు సార్. ఈ ఆదివారం సాయంత్రం మళ్లీ మీరు నా షాపు దగ్గరికి వస్తే అప్పుడు తాగుతాను వన్ బై టూ టీ. అప్పటిదాక ఏమీ ముట్టుకోను' రిజ్వాన్ నవ్వాడు.
'తప్పకుండా వస్తాను రిజ్వాన్. నీకింకో విషయం తెలుసా. నా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. ఇందాకే మెసేజ్ వచ్చింది. ఇంకా కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను. తప్పకుండా వచ్చి నువ్వు చెప్పినట్టుగానే వన్ బై టూ టీ - ఏదీ అదే ఆ నల్లబండ మీదే కూర్చుని తాగుతాను' అన్నాడు.
మనసులో ఆ నల్లబండే మెదులుతుండగా 'వెళ్లొస్తాను సార్' అని చెప్పి చిరునవ్వుతో గదిలోంచి బయటపడ్డాడు రిజ్వాన్
ప్రచురణ: ఆంద్రజోతి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి