88 ఏళ్ల కిందట...పడమటి సముద్రం పడగెత్తింది.
రోజంతా అశాంతిగా ఉన్న సాగర హృదయం ఆ యువకుణ్ణి చూడగానే ఉత్సాహంతో ఉరకలేసింది.అస్తమయ సూర్యుణ్ణి తనలో దాచుకుంటూ హఠాత్తుగా ఎరుపెక్కింది. అనవరతం ఆటుపోట్లతో అట్టుడికే కెరటాలు, అరుణారుణ హస్తాలు చాచి యువకుణ్ణి ఓడలోకి రా రమ్మంటున్నాయి. ప్రయాణికుల క్యూలో ఉన్నాడతను.
“ఒంటరిగా వచ్చానని బాధపడుతున్నావా? వీడ్కోలు చెప్పడానికి వెంట ఎవరూ లేరని వెలితిగా ఉందా?" కెరటాలు అడిగాయి. “నా అనేవాళ్లు జీవించి లేకపోవచ్చు... కానీ జీవకళ తొణికిసలాడే పవిత్ర ధాత్రి నా వెంట ఉంది. అసంఖ్యాక జనహృదయ ఘోష నాకు వీడ్కోలు చెబుతోంది... ఇప్పుడు చెప్పు... నేను అనాథనా?... ఒంటరివాణ్ణ??"
కెరటాన్ని సూటిగా ప్రశ్నించాడు యువకుడు. "కాదు కాదు కాదు..." సముద్ర గర్భంలో కలిసిపోతూ కెరటం ఘోషించింది.
*
“లుక్ హియర్...” యూనిఫాంలో ఉన్న బ్రిటిష్ ఉద్యోగి గొంతు కొంచెం కరుగ్గా ధ్వనించింది. అటువైపు తిరక్కుండానే, కేవలం తలను పక్కకి తిప్పి, భుజాలమీంచి చూశాడు యువకుడు.
“ఉధామ్సింగ్ మీరేనా?” అడిగాడు కస్టమ్స్ ఆఫీసులో పనిచేస్తున్న ఆ బ్రిటిష్ వ్యక్తి. "మీ ఇంగ్లాండు ప్రయాణానికి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఓడలోని దిగువ తరగతిలోకి మీరు వెళ్లవచ్చు" ప్రయాణానికి సంబంధించిన అనుమతి పత్రాల్ని ఉధామ్సింగ్కు అందజేసిన ఆంగ్లేయుడు... చకా చకా వెళ్లిపోయాడు.
అనుమతి పత్రాల్ని ఓసారి పరిశీలించాడు ఉధామ్. అందులో ప్రత్యేకంగా ఉన్న కాలమ్ లోని వాక్యాన్ని చదువుకున్నాడు. ఇంగ్లాండుకు ఏ పనిమీద వెళ్తున్నదీ అందులో రాసి ఉంది. "ఇంజినీరింగ్ చదవడానికి..." అన్న వాక్యాన్ని అధికారులు- ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి, పచ్చ సిరాతో సంతకం చేశారు.
ఓడలోకి ప్రవేశిస్తూ కోటు జేబు చూసుకున్నాడు ఉధామ్.
1933- డైరీ పదిలంగా ఉంది. దానిలోని రెండో పేజీలో పెద్ద అక్షరాలతో ఎవరిదో పేరు... అక్కడ చూపుడు వేలును కఠినంగా ఉంచి, చురుగ్గా పిడికిలి బిగించాడు.
డైరీ పేజీల్లోంచి చిన్న పొట్లాన్ని తీసి గుండె దగ్గర ఉంచుకుని, గట్టిగా ఊపిరి
తీశాడు.
ఆ పొట్లంలోని మట్టి- ప్రతీకారం కోసం పరితపిస్తోంది. హింసనణచే ధ్వంసరచన కోసం క్షణక్షణం ఎగసిపడుతోంది. పడమటి జలాల్లో పొగ ఓడ, ఐరోపా తీరాల వైపు నిదానంగా కదిలింది.
"ఈ ఓడలో లోయర్ క్లాస్ ప్రయాణం కన్నా సముద్రాన్ని ఈదడం సులభమనిపిస్తోంది" ఓ ప్రయాణికుడు అన్నాడు.
“దేనికైనా పెట్టిపుట్టాలి... ఏ లండన్లోనో ఐర్లండ్లోనో తెల్లతోలుతో పుట్టి ఉంటే, మనకీ ఆ హయ్యర్ క్లాస్ దక్కేది అన్నాడు ఇంకో ప్రయాణికుడు. చెక్కతో చేసిన కేబిన్ ఇరుగ్గా ఉంది. అందులో ఓరోజు గడపడమే ప్రయాణికులకు కష్టమనిపిస్తోంది. అలాంటి రోజులు ముప్ఫై గడిస్తే గానీ లండన్కు చేరుకోలేమని నిట్టూరుస్తూనే నెట్టుకొస్తున్నారంతా. కేబిన్లో ఓ మూల కూర్చున్నాడు ఉధామ్ సింగ్.
బొత్తిగా సౌకర్యాలు లేని పడవలో ఇబ్బందిగా అనిపిస్తున్నా, అవేమీ పట్టించు కోవటం లేదు. ఇంతకు మించిన కష్టాల కడలిలో తన జీవితనౌక పయనించింది. ఉన్నావా... తిన్నావా... అని అడిగేవాళ్లు లేక, అనాథ బాలల హాస్టల్లో పస్తులు పడిన రోజులెన్నో ఉన్నాయి. అమ్మానాన్నల గోరువెచ్చని మమతానురాగాల మధ్య బయట బాలల ప్రపంచం సందడి చేస్తోంటే, అమృత్సర్లోని హాస్టల్ గోడల మధ్య అన్నిటికీ దూరంగా సాగింది అతని బాల్యం...
షిప్లోని చెక్క కేబిన్లో కూర్చోడం విసుగనిపించి, డెక్మీదకి వచ్చాడు. డెక్ పైన ప్రయాణికులు పదిమంది వరకూ ఉన్నారు. వాళ్లంతా తనలాగే ఇరుకును భరించలేక ఇక్కడికి వచ్చినవాళ్లే! గొట్టంలోంచి పైకి వస్తున్న పొగని చూపిస్తూ, ఆవిరిశక్తితో ఓడ ఎలా నడుస్తుందో పదేళ్ల అబ్బాయికి అతని తండ్రి వివరిస్తున్నాడు. ఆ అబ్బాయి కళ్లలో ఆసక్తి ఉధామ్కు ముచ్చటగొలిపింది. చిన్నప్పుడు తమ పల్లెనుంచి తండ్రితో పాటియాలాకో అమృత్సర్కో వెళ్లినప్పుడు, పట్టణంలో వింతల్ని కళ్లప్పగించి తాను కూడా అలాగే చూసేవాడు. స్వర్ణదేవాలయంలో వైశాఖీ పండుగనాడు అందరితో పాటు బారులు తీరి, 'లంగర్ భోజనాలు చేసినప్పుడూ, బజార్లో రంగురంగుల పట్కాల్ని అమ్మే దుకాణాల్ని చూసినప్పుడూ, తన కళ్లు అలాగే మెరిసేవి. వేడి పరోటాల దొంతరని క్షణాల్లో ఊదేస్తున్నప్పుడో, పెద్ద గ్లాసు నిండా లస్సీని గటగటా ఖాళీ చేస్తున్నప్పుడో- పాడుకళ్లు తన బిడ్డపై సోకకుండా అమ్మ తన చున్నీని అడ్డంగా ఉంచితే, ఎందుకో అర్థం కాని తన పసిమనసు, కళ్లలో ఆశ్చర్యాన్ని ప్రకటించడం ఉధామ్కు గుర్తుకు వచ్చింది.
బతుకంతా కమ్మగా సాగిపోతే జీవితంలో సంఘర్షణే ఉండదు. అమ్మానాన్నల ఆప్యాయతను పూర్తిగా ఆస్వాదించక మునుపే, ఉధామ్ బాల్యం పైన విధి తన పడగను విసిరింది. తండ్రి తెహల్సింగ్, తల్లి హరనామ్ కౌర్- ఒకరి తర్వాత ఒకరు ఉధామ్ను ఒంటరివాణ్ణి చేసి, తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. దగ్గరకు చేరదీసి, ఆదరించే పెద్ద మనసులు కరవైపోయాయి. తన తండ్రి, కాయ కష్టంమీద బతికిన వ్యక్తి. పేదరికమే వారసత్వంగా మిగిలిన పసివాణ్ణి అక్కున చేర్చుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అందుకే ఊళ్లో పెద్దలు ఉధామ్ను అమృత్సర్ తీసుకువెళ్లారు. అక్కడ అనాథాశ్రమంలో చేర్చారు.
జీవితంలో వెలితి ఎలా ఉంటుందో అక్కడే తెలిసింది. ఒంటరితనం ఎంత భయంకరమైందో అనుభవంలోకి వచ్చింది. ఆ సమయంలో చదువే అతనికి తోడనిపించింది. బాగా చదవాలనీ, పైకి రావాలని అనుకున్నాడు. తిన్నా తినక పోయినా బడికి వెళ్లడం మాత్రం మానలేదు. పుస్తకాల చెలిమిని విడిచిపెట్టలేదు.... డెక్మీద నిలబడి, ఓడ పనితీరు గురించి తండ్రి నుంచి తెలుసుకుంటున్న ఇంకా ఏవేవో
ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. విసుక్కోకుండా అతని
తండ్రి సమాధానాలు చెబుతున్నాడు. ఇంతలో కుర్రాడి దృష్టి అప్పర్ క్లాస్ రూఫ్మీద రెపరెపలాడుతున్న యూనియన్ జాక్ మీద పడింది. నీరెండలో ఆ జెండాను పరిశీలనగా చూసిన కుర్రాడిలో ఏదో సందేహం తొలిచింది. తమ ఊళ్లో రోజూ ఎందరో ఊరేగుతుంటారు. చేతుల్లో జెండాలు పట్టుకుని 'భారత్మాతాకీ జై... వందేమాతరం...' అంటూ నినాదాలు చేస్తుంటారు. చెట్ల కొమ్మల మీదా, ఎత్తయిన మేడల మీదా అవే జెండాలు కనిపిస్తుంటాయి... కానీ పడవమీద జెండా మాత్రం మరోలా ఉంది. అందులో మూడు రంగులు గానీ, చరఖా గుర్తుగానీ లేనేలేవు. అందుకే పసివాడిలో సందేహం, అతణ్ణి నిలకడగా ఉండనీయలేదు.
"మన ఊళ్లో ఎగిరే జెండా.... ఓడమీద జెండా ఒకేలా లేవేం నాన్నా?" అనడిగాడు. అబ్బాయి ప్రశ్న అతని తండ్రిని ఇరుకున పడేసిందని ఉథాంసిగ్ గ్రహింంచాడు. అయినా అతనేం చెబుతాడో విందామని అటువైపు రెండడుగులేశాడు.
"ష్ మెల్లగా మాట్లాడు...” అంటూ ఆ తండ్రి అటూ ఇటూ చూసి, "ఇక్కడ మన ఊళ్లో జెండాల గురించి మాట్లాడకూడదు. ఈ ఓడ బ్రిటిష్ వాళ్లది. దీనిమీద వాళ్ల జెండాయే ఎగురుతుంది" అని చెప్పి పసివాడి ఉత్సుకతను బలవంతంగా అణచివేశాడు.
'ఇలాంటి వ్యక్తులు ఉండడంవల్లనే ఇంగ్లీషువాడి జెండా ఇలా ఎగురుతోంది' అనుకున్నాడు ఉధామ్. పిరికితనంతో సమస్యని దాటవేసే పలాయనవాదమంటే అతనికి ఎక్కడలేని కోపం. అణచివేతకు గురవుతున్నా 'అయ్యా' అని బతిమాలుకునే మనుషులంటే అసహ్యం! అతని దృష్టిలో మనుషులంటే కిచ్లూ లాగా ఉండాలి... సత్యపాల్లా ఉండాలి...
వాళ్లు ఎలాంటి వ్యక్తులు? మడమతిప్పని పౌరుషం నరనరానా జీర్ణించుకున్న నిజమైన నేతలు. తూటాల్లాంటి మాటలతో జనాన్ని ఉర్రూతలూగించే ఉపన్యాస శరవిన్యాసం...
తుపాకులకు ఎదురొడ్డి తుదివరకూ పోరాడే అసమాన వజ్రసంకల్పం... హిందూ ముస్లిముల మైత్రికీ, స్వాతంత్య్ర సిద్ధికీ వేదికగా నిలిచిన ఆ దేశభక్తుల నిరుపమాన సాహసాలూ... ఉధామ్సింగ్కు స్ఫూర్తినిచ్చాయి. కిచ్లూ, సత్యపాల్ జంట- అమృత్సర్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే అణువిస్ఫోటాల్ని పుట్టించింది. దొరతనాన్ని గద్దించి, ఆగడాల్ని ప్రశ్నించి ఊరందరినీ ఒక తాటిమీద నడిపించింది... స్వాతంత్య్రం కోసం ప్రాణాలైనా పణం పెట్టడానికి పంజాబీల చేత సింహగర్జన చేయించింది. బంద్, హర్తాళ్, నిరసన దీక్ష, సామూహిక ఉపవాసాలు... ఎవరి నోట విన్నా వందేమాతరం నినాదాలు...
పవిత్ర పుణ్యక్షేత్రంగా వన్నెకెక్కిన నగరం రణన్నినాదాలతో, అలుపెరుగని రణక్షేత్రంగా మారిపోయింది. అమృత్సర్ అదుపు తప్పిపోతోందని గవర్నర్ మైఖేల్ ఓడ్వయర్ గ్రహించాడు. అక్కడ పుట్టిన అంటువ్యాధి, మొత్తం పంజాబ్నే రుజాగ్రస్తం చెయ్యకుండా చికిత్స చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
పంజాబ్లో స్వాతంత్య్ర వాంఛ శ్రుతిమించు తోందనీ, ఉపేక్షిస్తే ఉప్పెనలా మారిపోతుందనీ, అదుపు తప్పకమునుపే పట్టు బిగించాలనీ పై అధికారులకు వర్తమానాలు పంపాడు. పైనుంచి బలగాలు దిగాయి.
బ్రిటిష్ సైనికుల గుర్రపు డెక్కల హోరుతో పంజాబ్లోని పల్లెలూ పట్టణాలూ ప్రతిధ్వనించాయి.
అమృత్సర్ను ఓ శిథిల చిత్రంలా మార్చివేయాలన్న ఆలోచన గవర్నర్ మైఖేల్ ఓడ్వయర్ది అయితే, విధ్వంసాన్ని విచ్చుకత్తులతో చిత్రించిన
దుస్సాహసం జనరల్ డయ్యర్ధి! వాడి పేరు చెబితే పసివాళ్లు నిద్రలో సైతం జడుసుకునేవాళ్లు. నిషేధాజ్ఞలు విధించని చోటు లేదు... భారతీయుల్ని అవమానించని పూట లేదు...
నలుగురు కలిసి నడిస్తే తప్పు...
నాలుగు గోడల మధ్యే నలిగిపోవాలి...
నోరు మెదిపితే శిక్షలు అనుభవించాలి...
నడిబజారులో కొరడా కొసలు గాల్లో గిరికీలు తిరిగి, అమాయకుల చర్మాలపై వీరవిహారం చేశాయి. దానికి పరాకాష్ట వైశాఖి పర్వదినంనాడు జరిగింది. 1919 ఏప్రిల్ పదమూడో తేదీన... జలియన్వాలాబాగ్లో... మానవత్వం మంటకలిసింది. అమానుషత్వం హద్దులు మీరింది. అమాయకత్వం రక్తసిక్త మృత్తికలో ఆనవాళ్లు కోల్పోయింది... ఉధామ్సింగ్ ప్యాంటు జేబులోంచి 1933- డైరీని పైకి తీశాడు... పేజీల మధ్య నున్న చిన్న పొట్లాన్ని పిడికిట్లో ఉంచుకున్నాడు....
ఏప్రిల్ పదమూడు...
వైశాఖీ పర్వదినం... సిక్కుల సంవత్సరాది...
పందొమ్మిదివందల పందొమ్మిది...
ఊరి మధ్య ఉందా విశాల ప్రాంతం. చుట్టూ గోడ, అందమైన పూల
మొక్కలు... అమృత్సర్లో జనం దాన్ని జలియన్వాలాబాగ్ అంటారు.
ఆ సువిశాల ఆవరణలోకి ప్రవేశించడానికి ఒక్కటే ద్వారం ఉంది. వైశాఖి
సందర్భంగా వేడుకలు జరిగినప్పుడు అమృత్సర్లోని ఆ ప్రాంతం ఉత్సవ
వాతావరణంతో కళకళలాడుతుంది. అంగళ్లు వెలుస్తాయి. చుట్టుపక్కల
గ్రామాల నుంచి వచ్చేవాళ్ల కోసం అంతులేని ఆకర్షణలు అందులో
బారులు తీరుతాయి.
వైశాఖీ పర్వదినం వస్తోందంటే, జలియన్వాలాబాగ్లో ఎక్కడలేని ఉత్సాహమూ పుట్టుకొస్తుంది. దానిమీద నిప్పులు పొయ్యాలనీ, క్షతగాత్రుల చేత మోకాళ్ల మీద నడిపించాలనీ జనరల్ డయ్యర్ యూనియన్జాక్ సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు... ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా జలియన్వాలాబాగ్లో పశుప్రదర్శనను
నిర్వహించాలని పంజాబీలు అనుకున్నారు. నగరంలో నిషేధాజ్ఞలున్నాయనీ, సంబరాల్ని సైతం సైన్యం నిరోధిస్తుందనీ గ్రామీణులకు తెలీదు. పాలకుల హెచ్చరికల్ని ఖాతరు చెయ్యకపోవడమే తప్ప ఉత్సవాల్ని వాయిదా వెయ్యడం పంజాబీల రక్తంలోనే లేదు. అందుకే ఆ రక్తమంటే గవర్నర్ మైఖేల్ ఓడ్వయర్కు మంట. అందుకే నరాల్లోంచీ దాన్ని బయటకు రప్పించాలని- జనరల్ డయ్యర్ ఆత్రుత!
జనం వస్తున్నారు...
ఇరుకైన గేటును దాటుకుని, విశాలమైన జలియన్వాలాబాగ్లోకి అడుగుపెడుతున్నారు.
మేళాలో జనాన్ని చూసిన కొందరు యువకుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పల్లెల నుంచి తరలివస్తున్న పంజాబీల్లో పర్వదినోత్సాహంతోపాటు స్వాతంత్య్ర సమరోత్సాహాన్ని కూడా పరవళ్లు తొక్కించాలనిపించింది.. వెంటనే ఎత్తయిన ప్రాంతంమీద నిలబడి జనాన్ని ఆకర్షించడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. "అందరూ గుండెలమీద చేతులు వేసుకుని చెప్పండి... మనం బానిసలమా?" అంటూ ఎలుగెత్తి అరిచాడు. "కాదు... కాదు..." అతని చుట్టూ ఉన్న బృందం దీటుగా చెప్పింది.
అంగళ్లలో ఉన్నజనం ఏదో జరుగుతోందని అటువైపు పరుగు తీశారు. నేతల మాటలు వినాలని ఆసక్తితో గుమిగూడారు. ఉపన్యాసం సాగిపోతోంది. అందరూ తలలూపుతున్నారు.
దీనికోసమే ఎదురుచూస్తున్నాడు జనరల్ డయ్యర్... ఈ అవకాశం కోసమే ఫిరంగి శకటాల్ని మెల్లగా మోహరిస్తున్నాడు. సశస్త్ర సైనికులు బారులు తీరారు. సేనాని అనుమతి కోసం సిద్ధంగా ఉన్నారు. "గేటు మూయండి" జనరల్ డయ్యర్ అరిచాడు. నాలుగువైపుల నుంచీ ఎత్తయిన గోడలు సన్నగా చీలిన చోట ఇరుకైన ప్రవేశ ద్వారం మూసుకుంది.
"ఫైర్..." జనరల్ డయ్యర్ అనలేదు... అరిచాడు... ఆ అరుపులోని ఆజ్ఞ అదుపు తప్పిన శతఘ్నిలా ధ్వనించింది. వెంటనే తూటాల వర్షం కురిసింది.
మేళాలో తమాషా కోసం టపాసులు పేల్చడం అలవాటే. ఆ రోజు కూడా అదో వినోద కార్యక్రమమని అనుకున్నారే తప్ప వెన్నంటిన మృత్యువును పసికట్టలేకపోయారు. గాల్లోని తూటాలు ఒంట్లో కండరాల్ని చీల్చి, నరాల్ని తెంచే వరకూ జలియన్వాలాబాగ్ మేళాలో జడలువిప్పిన రాక్షస గుంపును జనం గుర్తించలేకపోయారు.
హాహాకారాలు చేశారు... తప్పించుకోవాలని గేటువైపు పరుగులు తీశారు. తోపులాట మొదలైంది... తొక్కిడి హెచ్చింది. ఫిరంగుల మోత ఊరి పొలిమేరలు దాటుతోంది. అమాయకుల ఊచకోత హద్దులు మీరుతోంది. స్త్రీ, బాల, వృద్ధులన్న తేడా లేదు... నెత్తుటి యేరులో అందరూ
కొట్టుకుపోతున్నారు. ఫిరంగుల పొట్టలో గుళ్లు ఖాళీ అయ్యేవరకూ జనం గుండెల్లో తూట్లు పడుతూనే ఉన్నాయి...
అలల్లోకి తొంగిచూస్తున్నాడు ఉధామ్. ఓడ అడుగు భాగాన్ని అవి బలంగా కుదిపేస్తున్నాయి. బడబానలాన్ని దాచుకున్న సముద్రం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? తన మానసిక స్థితీ అలాగే ఉంది. పద్నాలుగేళ్ల కిందట వైశాఖీ పర్వదినంనాడు జలియన్వాలాబాగ్ను శ్మశాన సదృశంగా మార్చిన ఇద్దరు కిరాతకుల్నీ
సుషుప్తావస్థలో కూడా అతను మరచిపోలేడు... గవర్నర్ మైఖేల్ ఓడ్వయర్... జనరల్ డయ్యర్...
ఒకడు కాగితంమీద కల్లోలాన్ని రచించాడు. మరొకడు వ్యూహానికి ఊపిరి పోశాడు. ఇద్దరూ కలిసి అమాయకుల ప్రాణాల్ని తీశారు.
ఓడలో కెప్టెన్ కేబిన్ నుంచి గంట వినిపించింది. "చీకటి పడుతోంది... డెకి ఎవర ఉండటానికి వీల్లేదు... కేబిన్లోకి వెళ్లండి" కెప్టెన్కు సహాయకుడిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి చెప్పాడు. అలల్లోకి తొంగిచూస్తున్న ఉధామ్ వర్తమానంలోకి వచ్చాడు. ఓడ ప్రయాణంలో అన్ని రోజులూ ఇలాగే గడిచాయి. నెత్తుటి వానలో బరువెక్కిన జలియన్వాలాబాగ్ మట్టి, అతనిలో ప్రతీకారేచ్ఛని ప్రజ్వరిల్లచేస్తోంది...
లండన్...
ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్...
పట్టుదల ఉన్న ఆ పంజాబీ యువకుడికి ఇంజినీరింగ్ డిగ్రీ చేతికందడం
పెద్ద విశేషమనిపించలేదు. డిగ్రీతోపాటు ఉధామ్సింగ్ సంపాదించాలనుకున్నది మరొకటి ఉంది. దానికోసం ప్రయత్నించాడు. అది కూడా దొరికింది. అయితే అనుకున్నది సాధించడం కోసం ఏడేళ్లు
పట్టింది.
"సర్ మైఖేల్ ఓడ్వయర్... సన్నీ బేంక్... థరిస్థాన్... సౌత్ డెవన్... ఆ అడ్రస్ దొరికిన రోజు ఉధామ్సింగ్ పులి జాడను పసికట్టిన వేటగాడిలా సర్వసన్నద్ధు డయ్యాడు. ఎగసిపడుతున్న ఆవేశానికి ఊరట లభించే క్షణాల కోసం నిరీక్షించాడు. బుస కొడుతున్న ప్రతీకారం అతనిలో పదునెక్కింది...
మార్చి 13, 1940...
జలియన్వాలాబాగ్లోని మృత్యువు వయసు అప్పటికి ఇరవయొక్క సంవత్సరాల నాలుగు నెలలు.
ఆరోజు మధ్యాహ్నం, సన్నీ బ్యాంక్లోని తన ఇంటి పోర్టికోలో నిలబడ్డాడు
మైఖేల్ ఓడ్వయర్.
ఆరోజు అతనో సమావేశానికి వెళ్తున్నాడు.
రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ, ఈస్టి అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆ సమావేశంలో... ఆఫ్ఘనిస్థాన్ సమస్య ప్రధాన చర్చనీయాంశం.
లార్డ్ జెట్లాండ్ అధ్యక్షతన జరగనున్న చర్చావేదికలో మైఖేల్ ఓడ్వయర్ ఆఫ్ఘన్ సమస్యను చర్చించాలని కాకన్ హాల్కు వెళ్తున్నాడు.
ఎగసిన అల
లండన్లోని కాకిన్ హాల్... సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రసంగాలు ముగిశాయి. ఓట్ ఆఫ్ థాంక్స్ మొదలైంది.
"ఎక్స్క్యుజ్మి..." అంతవరకూ ఆఖరు వరుసలో కూర్చున్న ఉధామ్సింగ్, తోవలో అడ్డంగా నిలబడిన ఇద్దరు పెద్ద మనుషుల్ని నెట్టుకుంటూ నాలుగో వరుస వరకూ వచ్చాడు. ఎడమ చేత్తో గోడను ఆనుకుని, కుడిచేతిని కోటు జేబులో ఉంచాడు. బుట్టలో నిద్రిస్తున్న పామును ఉసికొల్పే ఆటగాడు, దాని పడగను మునివేళ్లతో తాకినట్లు, కోటు జేబులో చల్లగా తగిలిన వస్తువును సరిచూసుకున్నాడు. ఓట్ ఆఫ్ థాంక్స్లో ఆఖరి వాక్యం...
నాలుగో వరుస దగ్గర నిలబడిన ఉధామ్సింగ్ రెండడుగుల్లో మొదటి వరుసకు చేరుకున్నాడు. అక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేస్తే, నాలుగు అడుగుల ఎత్తులో ఉంది వేదిక.
గుండెనిండా ఊపిరి తీసుకుని ఒకే ఊపులో లంఘించాడు ఉధామ్సింగ్.
రెండో క్షణంలోనే వేదిక మీదకు చేరుకున్నాడు. కోటు జేబులో బుసకొడుతున్న . 445 అమెరికన్ మేడ్ రివాల్వర్ అతని పిడికిట్లో అమరింది.
ట్రిగ్గర్ మీద చూపుడు వేలు ఒత్తిడిని పెంచడంతో అది ఆరుసార్లు పేలింది. కాకిన్ హాల్ అదిరిపోయేలా... జలియన్వాలాబాగ్ దారుణ హత్యాపథకాన్ని ప్రసవించిన మైఖైల్ ఓడ్వయర్ తల పగిలిపోయేలా... అమెరికన్ మేడ్ రివాల్వర్, ఉధామ్సింగ్ ఉక్రోషాన్ని నిప్పు రవ్వల్లో కురిపించింది. నరమేధం సృష్టించిన తెల్లవాడికి నరనరానా రగిలిన యువకుడి పగ ఎంత పదునైనదో నిరూపించింది.
అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అటూ ఇటూ పారిపోతున్నారు. ఆ గుంపులో చొరబడి, రెండు చేతులతోనూ మానవ ప్రవాహాన్ని ఈదుకుంటూ గేటు వరకూ వచ్చాడు ఉధామ్సింగ్. "హియర్ ఈజ్ ది కల్ట్... కేచ్ హిమ్" ఎవరో అరిచారు.
ఒక్కణ్ణి పట్టుకోడానికి పదిమంది ఏకమయ్యారు. రెండు చేతుల్నీ
నలుగురు పట్టుకున్నారు. మరో ఇద్దరు నడుము చుట్టూ చేతులు బిగించారు. మిగిలిన నలుగురూ కాళ్లు పట్టుకుని లాగి, కిందకు కూలదోశారు.
ఓల్డ్ బెయిరీ సెంట్రల్ క్రిమినల్ కోర్టు
"ఉధామ్సింగ్ అంటే నువ్వేనా?" అడిగాడు జడ్జి. "అని మీ రికార్డులో ఉంది. కానీ నన్ను రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని మిత్రులు పిలుస్తారు..."
"అడిగిందానికే సమాధానం చెప్పాలి!" జడ్జి విసుక్కున్నాడు.
"మీరెన్ని అడిగినా నా సమాధానం ఒక్కటే! నా తల్లిని ఎముకల పోగుగా మిగిల్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుత్తునియలు చెయ్యాలి. సాటి మనిషిని క్రూరంగా వేటాడిన పైశాచిక ప్రవృత్తిని హతమార్చాలి... జలియన్వాలాబాగ్ మట్టికి నేను మాట ఇచ్చాను. పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికే ఇంత దూరం వచ్చాను. అనుకున్నది సాధించాను... అంతే."
జూన్ పన్నెండు, 1940... లండన్...
ఓల్డ్ బెయిలీ సెంట్రల్ జైల్... సూర్యుడికన్నా ముందుగా ఉరితాడు కిందకు దిగింది.
నల్లని మాస్క్ను తన ముఖానికి తొడిగే ముందు, పట్కాలోంచి చిన్న పొట్లాన్ని బయటకు తీశాడు ఉధామ్... మడత విప్పి, అందులోకి చూశాడు. ఇరవయ్యొక్క సంవత్సరాల వెనుక ఆర్తనాదాలతో ప్రకంపించిన జలియన్వాలాబాగ్ ఇసుక రేణువులు ఆ పొట్లంలోంచి అతని పిడికిట్లోకి రాలాయి. అవి మునుపటిలా ప్రతీకారంతో ఎగిసిపడటం లేదు. ప్రశాంతంగా అతని అరచేతిని హత్తుకుని ముద్దాడాయి.
"నువ్వు ఒంటరివాడివి కావు సోదరా... భారతీయాన్ని కలబోసిన అసంఖ్యాక రేణువులం నీ వెంటే ఉన్నాం... నీ అమరగాధను తరతరాలూ వినిపిస్తాం...
ఒక్కో రేణువూ వీడ్కోలు చెబుతోంది...
ఉరితాడు బిగువులో దిగంతాలు తాకుతూ... ప్రతిధ్వనించింది... ఒక నినాదం... వందేమాతరం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి