ఔరా!

Credits : ఈనాడు
వలివేటి నాగచంద్రావతి


అగ్నికీలలు నాలుకలు సాచి ఆకాశాన్నే దహించి వేయాలన్నట్టు పైపైకి ఎగిసి పడుతున్నాయి. అరుపులూ ఆర్తనాదాలూ వాటికి మించి మిన్నంటుతున్నాయి.

కళ్లు అరమూసి హెడ్ఫోన్ సాయంతో ఐపాడ్లో ఘంటసాలగారి భగవద్గీత శ్లోకాలని పరవశంగా ఆస్వాదిస్తోన్న సుభద్రమ్మ చెవికి అపస్వరాలతో పెళపెళ శబ్దాలూ ఆరున్నొక్క రాగాలూ సన్నసన్నగా వినిపించి హెడ్ఫోన్ పక్కకి పెట్టి బాల్కనీలోకి వచ్చింది.

కమ్యూనిటీకి ఆనుకుని ఉన్న రోడ్డుకి అవతలపక్క వరసగా వేసున్న గుడిసెలు తగలబడుతున్నాయి. ఆ ఇళ్లల్లో వాళ్లు అరుస్తూ పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్లల్లోంచి గిన్నెలూ మంచాలైనా బయటకు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు.

పాపం వాళ్లు పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం వచ్చిన పామర జనం. ఈ చుట్టుపక్కల కొత్తగా కడుతోన్న అపార్ట్మెంట్లలో కూలిపని చేసుకుంటూ తాత్కాలికంగా ఏర్పరచుకున్న నివాసాలవి.

గంటలో మొత్తం ఆరగించేసి బుగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు. ఆ బూడిదలో ఇంకా ఏమయినా మిగిలాయేమోనని వెతుక్కుంటున్న వాళ్లని చూస్తూ జాలిగా నిట్టూర్చి, లోపలికి రాబోయిందల్లా వాళ్లు మరోసారి ఘల్లుమనడం వినిపించి ఆగింది సుభద్రమ్మ. నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లోనుంచి బయటకు మోసుకొస్తున్నారు కొందరు. ఆ శవం తాలూకూ ఇద్దరు పిల్లలు వెంట నడుస్తూ 'అమ్మా అమ్మా' అని హృదయవిదారకంగా ఏడుస్తున్నారు.

మనసు వికలమవగా 'అయ్యో పాపం' అనుకుంటూ లోపలికి నడిచింది సుభద్రమ్మ.

*

ఆ మర్నాడు ఆదివారం. ఆ కమ్యూనిటీ ప్రెసిడెంటుగారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్లకీ ఓ మెసేజ్ వచ్చింది. 'సాయంత్రం ఆరున్నర గంటలకి మీటింగ్ హాల్లో అందరూ సమావేశమవ్వాలీ' అని.

అలాగే కలిశారందరూ. వీళ్లకంటే ముందే వచ్చి ఓ పక్కగా నిలబడి ఉన్నారు- నిన్నటి రోజున ఇళ్లూ వాకిళ్లూ పోగొట్టుకున్న బడుగు జీవులు.

“వీళ్లంతా మన ఇళ్లకోసం రాళ్లెత్తిన వాళ్లు. మనకళ్లముందే నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర సమయంలో వీళ్లమీద దయ చూపించటం, చెయ్యందించటం మన బాధ్యత. నా సూచనను ఆమోదించి శక్తిమేరకు మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను" ప్రెసిడెంటుగారు విజ్ఞప్తి చేశారు.

ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్. వీటిల్లో ఉన్నవాళ్లందరూ చాలావరకూ పెద్ద ఉద్యోగస్తులూ, బిజినెస్ చేసేవాళ్లు. అందుచేత దాతృత్వం కొంత భారీగానే జమయింది.

కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యమూ, పప్పూ, ఉప్పూ అందిస్తున్నారు. ఇంకొందరు బట్టలు ఇస్తామనీ, తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంటకోసం ఇవ్వగలమనీ వాగ్దానాలు చేశారు. త్వరలోనే వాళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంటుగారు హామీ ఇచ్చారు.

అంతా బాగానే ఉంది. కానీ ఒక్క సమస్య మిగిలిపోయింది. మరి

మరణించిన ఆమె ఇద్దరి పిల్లల గతేమిటి?

ఆ కుర్రవాడికి పన్నెండేళ్లూ, ఆ ఆడపిల్లకి పదేళ్లూ ఉంటాయి. ఆ పిల్లల తల్లి సక్కుబాయి, సంపాదించే భర్తని పోగొట్టుకుని, పిల్లలిద్దర్నీ తీసుకుని పొరుగువారితో కలిసి ఇక్కడికొచ్చింది. ఇక్కడ కడుతోన్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసీ, ఇటుకలు మోసీ అలా వచ్చే ఆదాయం చాలక కొందరిళ్లలో అంట్లు తోమి బట్టలుతికీ పిల్లల్ని పోషించుకుంటోంది.

నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతోన్న

స్థలంలో ఉంది. సంగతి తెలిసి పరిగెత్తుకు వచ్చేటప్పటికే మంటలు

ఉధృత దశలో ఉన్నాయి. అయినా సరే ప్రాణమొప్పక అందరూ

ఒద్దంటున్నా, 'ట్రంకు పెట్టెలో ఈవారం వచ్చిన కూలి డబ్బు ఉంది.

పిల్లదాని పట్టీలూ ముక్కుపుడకా ఉన్నాయి. అదొక్కటే

లాక్కొచ్చేస్తాను' అంటూ తగలబడుతున్న గుడిసెలోకి పరిగెత్తి తిరిగి

రాలేక లోపలే దహనమయిపోయింది.

తల్లిని పోగొట్టుకుని బిక్కమొహాలతో దిగాలుగా నుంచున్న ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది.

వాళ్లని ఎవరికి అప్పగించాలి? సక్కుబాయితో కలిసివచ్చిన వాళ్లకి కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు. దగ్గర బంధువులెవరో పిల్లలతో పాటూ వాళ్లూ ఎరుగరు. పోనీ అంటే ఆ పిల్లలని పెంచే స్తోమత వాళ్లకూ లేదు. వాళ్ల బ్రతుకులూ అంతంత మాత్రమే.

“మరి ఏం చేద్దామంటారు? ఏ అనాథాశ్రమంలోనో చేర్పించేద్దామంటారా?" జవాబు వెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంటుగారు.

"పిల్లలు పచ్చగా కనుముక్కు తీరుతో చక్కగా ఉన్నారు. ఆ అనాథశరణాలయంలో ఎలా చూస్తారో ఏమిటో, పైగా వయసొస్తున్న ఆడపిల్ల. అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం. చూస్తూ చూస్తూ..." సుభద్రమ్మ పక్కకుర్చీలో కూర్చున్న త్రివేణమ్మ మెల్లగా అంది జాలిగా.

ప్రెసిడెంటుగారివి పాము చెవులు. "అవును మీరన్నది నిజం. నేనూ అదే ఆలోచిస్తున్నాను. మీరు వేరేగా అనుకోనంటే ఒక్కమాట. మీలో ఎవరూ మీ పిల్లలతో పాటూ ఇంకొక బిడ్డని పోషించలేనంత దిగువస్థాయి ఆర్థికస్థితిలో ఉన్నారని నేననుకోను. కావలసిందల్లా పెద్దమనసు. మీలో ఏ ఒక్కరు దయచూపినా ఈ పిల్లలు అదృష్టవంతులవుతారు." ప్రెసిడెంటుగారి చూపులో అభ్యర్ధన...

దిగ్గున లేచింది సుభద్రమ్మ. నా పిల్లలు పెద్దవాళ్లయి ఎక్కడెక్కడో

ఉన్నారు. ఒంటరిదాన్ని. బంధువుల పిల్లల నెవరినయినా

చేరదీయాలని ఎన్నాళ్లనుంచో ప్రయత్నం చేస్తున్నాను. చుట్టాలలోనే

కావాలని ఏముంది? ఈ పాప నాకు నచ్చింది. తనని నేను దత్తత

తీసుకుంటాను" అంది మబ్బుల్లో చందమామలా చింపిరి జుట్టూ

మాసిన బట్టల్లో ఉన్న పెద్దకళ్లూ, పచ్చని ఛాయతో ఉన్న ఆ పిల్లవంక

ముచ్చటగా చూస్తూ...

ప్రశంసగా చూశారు సుభద్రమ్మ వంక ప్రెసిడెంటుగారు. కరతాళధ్వనులు చేశారందరూ.

“దత్తతలాంటి పెద్దమాటలు వద్దుగానీ, ఆ కుర్రవాడు తనకాళ్లమీద నిలబడేదాక నేను మా ఇంట్లో ఉంచుకుని పోషించగలను.” సుభద్రమ్మ చూపిన స్ఫూర్తితో, భార్య రేవతి ప్రోత్సాహంతో, ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతోన్న భవానీ శంకరంగారు ముందుకొచ్చి అన్నారు. హాల్లో తిరిగి చప్పట్లు మార్మోగాయి.

*

ఆరోజే మీరాని తన ఇంటికి తెచ్చేసుకుంది సుభద్రమ్మ. మర్నాడు రెడీమేడ్ షాపులో అరడజను గౌనులు తీసుకుంది. బ్యూటీ పార్లర్లో జుట్టుని చక్కగా 'బాల్డ్' చేయించింది. మెడలో సన్నటి గొలుసు వేసింది. దగ్గరగా ఉన్న ఒక ప్రయివేటు స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెప్పించింది.

మట్టి దిబ్బమీద కాసింత ఎరువు వెదజల్లి పూలమొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినట్టు, గుర్తు పట్టలేనంతగా మారిన మీరాను అద్భుతమన్నట్టు చూస్తున్నారందరూ.

"అచ్చం తల్లీకూతుళ్లలాగే సోఫాలో పక్కపక్కనే కూర్చుని టీవీ చూస్తారమ్మా. ఏసీ గదిలో ఆ అమ్మ మంచం పక్కనే మీరాకీ ఇంకో మంచం వేయించారు కూడా." వాచ్మెన్ భార్య గౌరి సర్వెంట్ మెయిడ్గా తను పనిచేసే అందరి ఇళ్లలోనూ ఈ వార్తలు కళ్లు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది.

ఆ కమ్యూనిటీలో నలుగురు ఆడవాళ్లు కలిసినా నలుగురు మగవాళ్లు కలిసినా అదే చర్చనీయాంశమయింది. ఒక అనాధపై అంతటి ఆదరాభిమానాలు కురిపిస్తున్న సుభద్రమ్మను మెచ్చుకుంటున్నారు. అంతటితో ఊరుకోక, రేవతీ భవానీశంకరం గార్లతో పోల్చిచూస్తూ పెదవి విరుస్తున్నారు.

ఎందుకంటే వాళ్లు ఆ పిల్లవాడు జగదీష్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్రూమ్లో వసతి ఇచ్చారు. వీడి వయసువాడే ఉన్నాడు వాళ్లకో పిల్లవాడు. అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని జగదీష్కి ఇచ్చారు వేసుకోమని. టైం ప్రకారం వంటమనిషి టిఫినూ భోజనమూ ప్లేటులో పెట్టి ఇస్తే ఒక సైడున ఉన్న వరండాలో కూర్చుని తింటున్నాడు.

ఈ బేరీజు వేయటాలూ, విమర్శలు గుప్పించటాలూ ఆనోటా ఆనోటా ప్రయాణించి భవానీశంకరం గారి దాకా వచ్చాయి. ఆయన నిష్కర్షగా చెప్పాడు... “నేను ముందే చెప్పాను, దత్తత తీసుకునేటంత హృదయ వైశాల్యం నాకులేదని. ఆ పిల్లవాడు తన పొట్ట తాను నింపుకోగలిగేంతవరకూ నేనతని బాగోగులు చూసుకుంటాను అంతే. ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్లు నిరభ్యంతరంగా వాణ్ణి తీసుకువెళ్లొచ్చును" అని.

గప్చుప్... ఆ తర్వాత కిక్కురు మనలేదెవ్వరూ.

మూణెల్లు గడిచాయి. స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. జగదీష్ దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ క్లాసులో జాయినయ్యాడు. ఇక మీరాకి సుభద్రమ్మగారు అప్లయి చేసిన కాన్వెంట్లో సీట్ వచ్చింది కానీ దగ్గర్లో కాదు. చాలా దూరంలో ఆ స్కూలుకి సంబంధించిన ఇంకో బ్రాంచిలో.

పడిపోయారు సుభద్రమ్మగారు. మెయిన్రోడ్డుకి పెడగా ఉన్న ఈ కమ్యూనిటీకి స్కూల్ బస్ రాదట.

'మరేం చెయ్యటం?' యోచన చేసీ చేసీ ఓ నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ.

ఆ వారం మండలిలో అందర్నీ కలుసుకుని చెప్పారు. సుభద్రమ్మ. "ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది. మీ అందరి స్నేహానికీ దూరమవ్వటం కూడా నాకిష్టంగా లేదు. కానీ మీరాకి స్కూలు చాలా దూరమయిపోతుంది. చూస్తూ చూస్తూ ఏ ఆటోవాడినో నమ్మి రోజూ ఆడపిల్లని అంతదూరం ఎలా పంపను? అందుకే ఇల్లు మారదామనుకుంటున్నాను. స్కూలుకి దగ్గరగా అయితే మద్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చెయ్యగలదు మీరా" సుభద్రమ్మగారు విచారంగా చెబుతోంటే అందరికీ కూడా బాధనిపించింది.

ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడయితే దగ్గరకు తీసిన ఓ పేదరాలి బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారటానికి కూడా వెనకాడని ఆమె ఔదార్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ల మనసుల్లో.

వెళ్లేముందు జగదీష్ని పిలిచి చిన్న మొబైలు అతని చేతిలో పెట్టారు సుభద్రమ్మ. . "నా నంబరు దీన్లో ఫీడ్ చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లెలితో ఫోన్లో మాట్లాడొచ్చు. నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు. ఎలా రావాలో రూట్ చెప్తాను" అన్నారు. తలూపుతూ నమస్కారం చేశాడు జగదీష్.

ఆవిడ చెప్పినట్టే ఏ నంబరు సిటీ బస్సెక్కాలో తెలుసుకుని నెలకోసారి చెల్లెల్ని చూసి వచ్చేవాడు జగదీష్. మూడో నెల్లో చూసొద్దామని వెళ్లినప్పుడు సుభద్రమ్మగారు లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఏ మార్కెట్కో వెళ్లుంటారని కాసేపు ఎదురుచూసి వచ్చేశాడు. మళ్లీ వారం తిరిగి వెళ్లాడు. ఉహుఁ తాళం అలాగే వేసి ఉంది. పక్కింటి వాళ్లని వాకబు చేశాడు. “ఏమోనయ్యా, కొత్తగా వచ్చారు కదా అంతగా పరిచయం లేదు. వాళ్ల అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని పనిమనిషితో చెబుతుంటే విన్నట్టు గుర్తు" అన్నారు పట్టీపట్టనట్టు. ఇది సిటీ. పొరుగువారి సంగతి పట్టించుకునే తీరుబాటూ ఆసక్తి ఎవరికీ ఉండదు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుభద్రమ్మగారు ఎత్తటం లేదు. దిగాలు పడిపోయాడు జగదీష్. రోజూ మెతుకు మిగల్చని వాడల్లా ఆరోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయటం చూసి, “ఇదేమిట్రా?” అంది ఆశ్చర్యంగా భవానీశంకరంగారి భార్య రేవతి. బావురుమన్నాడు వాడు. ఆ రోదన విని ఆదరా బాదరా భవానీశంకరంగారు కూడా వచ్చారక్కడికి.

లాలించి నట్టడిగి సంగతేమిటో తెలుసుకున్నారు. "ఓస్ పిచ్చివాడా, దానికెందుకు ఏడుపు? సుభద్రమ్మగారి కూతురికి ఏం అవసరమొచ్చిందో అర్జంటుగా వెళ్లాల్సి వచ్చి వెళ్లి ఉంటారు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అక్కడ పరిస్థితి ఏమిటో? నీకు ఫోన్చేసే వెసులుబాటు చిక్కిందో లేదో. ఏదో కారణంలేందే సుభద్రమ్మగారలా నిర్లక్ష్యం చేసే మనిషి కాదు. చూస్తుండు ఇవాళో రేపో 'సారీ నాయనా...' అంటూ ఫోన్ చేస్తారు చూడు” అని ధైర్యం చెప్పారు.

రేపు కాదూ మాపూ కాదు, వారం రోజులయినా ఫోన్కాల్ రాలేదు. భవానీశంకరం గారు జగదీష్ని వెంట బెట్టుకుని సుభద్రమ్మ గారు మీరాని చేర్పించినట్టు చెప్పిన స్కూలుకి వెళ్లారు. ఆ స్కూలు ప్రిన్సిపాల్ చెప్పిన సమాచారం విని నిర్ఘాంతపోయారు. నెలక్రితమే సుభద్రమ్మగారు వచ్చి టీసీ తీసుకువెళ్లారట.
జగదీష్ మొహంలో రక్తం చుక్కలేదు. ఊరుకుంటే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడని అతని భుజం మీద చెయ్యేశారు భవానీశంకరంగారు... "కంగారు పడకు, ఏం చెయ్యాలో ఆలోచిద్దాంలే" అన్నారు అనునయంగా.

నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయటమెలాగా అని ఆలోచిస్తూనే ఉన్నారు భవానీశంకరంగారు. నీళ్లు పోయటం ఆపేసిన మొక్కలా వడిలిపోతున్న జగదీష్ మొహం చూసినపుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్లు ఇంటిల్లిపాదీ.

*

సుభద్రమ్మ గారి నుంచి ఫోన్ వచ్చింది జగదీష్కి. అది ఫోన్ కాల్ కాదు- వీనులకు సోకిన వీణానాదం.

“సారీ జగదీష్. మా అమ్మాయి సుధకి యాక్సిడెంట్ అయిందంటే అర్జంటుగా ముంబయి వచ్చేశాం. అది గాయాల నుంచి కోలుకుని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచ లేదంటే నమ్ము. ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త- మా అమ్మాయి ప్రెగ్నెంట్. నేనిక ఇప్పట్లో అక్కడికొచ్చే అవకాశం లేదు. సరే, నువ్వు కదా. అందరూ కులాసాగానే ఉన్నారుగా. మరి ఉంటాను..."

మాటలాపిన క్షణంలోనే "మీరు ఇక్కడికొచ్చారని ప్రిన్సిపాల్గారు చెప్పారమ్మా" అన్నాడు ఆత్రంగా జగదీష్. "ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు" అని బాహాటంగా నిష్టూరం వేయలేక.

“మరే, వచ్చాను. ఒక్కపూటలో అక్కడ పనులన్నీ ముగించుకుని వెళ్లిపోయాను. అప్పుడే మీరా స్కూలు నుంచి టీసీ తీసుకు వచ్చేశాను. నా మూలాన దాని భవిష్యత్ పాడవకూడదు కదా. ప్రస్తుతం ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు మా అల్లుడు. నువ్వు మీరా గురించి ఏమీ బెంగపడకు. దానిభారం నాది. ఈసారి మీరాచేతే మాట్లాడిస్తాను సరేనా" అంది లైన్ కట్చేస్తూ... 
చెప్పినట్టుగానే నెల తరవాత మీరాతో మాట్లాడించింది సుభద్రమ్మ. “నేను బాగానే ఉన్నానన్నా. ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్వేం కంగారు పడకు” ముక్తసరిగా చెప్పి పెట్టేసింది మీరా. చెల్లెలి ముభావానికి మనసు చివుక్కుమంటున్నా, ‘గొప్ప ఇంటికి దత్తత వెళ్లిందిగా ఆమాత్రం అహం ఉండదా' అనుకుని సమాధానపడిపోయాడు జగదీష్.

అప్పట్నుంచీ నాలుగయిదు నెలలకోసారి తప్పనిసరిగా తద్దినమన్నట్లు ఫోన్ చేసి మేము క్షేమం. మీరూ క్షేమమే కదా అని యోగక్షేమాలు చెబుతోంది సుభద్రమ్మగారు. అప్పుడే మీరా కూడా మొక్కు తీర్చుకుంటున్నట్టు రెండు మూడు మాటలు అప్పగిస్తోంది. ఆ ఏడాదే ఎయిత్ స్టాండర్డ్లోకి ప్రవేశించిన జగదీష్, 'దాని ప్రపంచం వేరయిపోతోంది' అనుకునేవాడు.

ఇంకో కుదుపు, సుభద్రమ్మగారి నుంచి... 'మేము కెనడా వెళ్లిపోతున్నాం. మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది" అని...

“మరి మీరా?" కలవరపడుతూ అడిగాడు జగదీష్.

నవ్వింది సుభద్రమ్మ. "వదిలేస్తాననుకున్నావా? నేనెక్కడుంటే అక్కడే మీరా. తనని తీసుకువెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లూ చేశారు మా అల్లుడు" అన్నారు.

తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టువు వెళుతున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆ కారణంగా చెల్లెలు తననుంచి అంతకంతకూ దూరమయిపోతున్నందుకు జగదీష్ చాలా కలతపడ్డాడు.

'మీరా విదేశాలకు వెళ్లేముందు ఒక్కసారి చూడగలిగితే ఎంత బాగుణ్ణు! కానీ ఎలాగ? తను చిన్నవాడు, ఒకరిమీద ఆధారపడి ఉన్నవాడు. ముంబయి వంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్లగలడు. ‘ప్స్, పోనియ్. తను చూడకపోతేనేమి? సుభద్రమ్మగారి లాంటి చల్లటి తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది.' ఆ విశ్వాసంతో సంతృప్తి పడిపోయాడు జగదీష్.

కమ్యూనిటీలో చాలామందికి మీరా కెనడా వెళుతున్నట్లు తెలిసిపోయింది. అందరూ సుభద్రమ్మను పొగిడినవారే. ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా....

*

*

నెలలూ సంవత్సరాలూ గడిచాయి. టెన్త్ పాసయ్యాక ఐ.ఐ.టిలో సీటు వచ్చింది జగదీష్కి. అది పూర్తిచేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.

మొదటి శాలరీ అందుకున్నాక పళ్లూ పూలూ తీసుకొచ్చాడు ఇంటికి. భవానీశంకరం దంపతులకు భక్తిగా నమస్కారం చేశాడు. తనని ఇంతటివాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. “ఎంత చేసినా మేము సుభద్రమ్మగారి తర్వాతే" మనస్ఫూర్తిగానే తనని తాను తగ్గించుకుంటూ అన్నది రేవతి- భవానీశంకరం గారి భార్య.

ఆరోజే ఫ్యాక్టరీ వర్కర్స్కిచ్చిన క్వార్టర్స్లోకి మారిపోయాడు. తన వర్క్ భవిష్యత్తు గురించి ఓ ప్రణాళిక, భవానీశంకరం గారి సలహా... ఇలా ఒక గాడిన పడిపోయాడు జగదీష్.

ఇన్ని సంవత్సరాలకు గానూ సుభద్రమ్మగారు కాల్ చేసింది రెండు తడవలే. కెనడాకి చేరుకున్న మొదట్లో అందరం స్థిరపడ్డాం అనీ, మనవడు పుట్టాడు, మీరాకి మంచి స్కూల్లో సీటు దొరికింది అని రెండవసారీ. జగదీష్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడడం లేదు.

సుభద్రమ్మగారు ముందే హెచ్చరించారు- "ప్రత్యేకించి నాకిక్కడ ఫోన్ లేదు. మా అమ్మాయికో, అల్లుడికో నువ్వు ఫోన్ చెయ్యటం, వాళ్లకి ఇష్టం లేకపోవచ్చును. వీలు చూసుకుని నేనే చేస్తుంటాను” అని. 

ప్రెసిడెంటుగారి రెండవ అబ్బాయి వంశీకృష్ణ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు. కోడలి కాన్పు సమయంలో సాయానికి ప్రెసిడెంటుగారి భార్య అమెరికా వెళ్లింది. అప్పటికింకా డెలివరీకి టైముంది కదా అని ఓ ఆదివారం 'నయాగరా'కి వెళదామనుకున్నారు అందరూ. కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్టులూ అవీ రెడీ చేశాడు వంశీ.

అక్కడ కనిపించింది సుభద్రమ్మగారు ప్రెసిడెంటుగారి భార్యకి...

చెర్రీ పళ్లమధ్యన పాలసపోటా కనిపించినట్లు, ఆ తెల్లవాళ్ల మధ్యన తెలిసినావిడ కనిపించే సరికి ప్రాణం లేచి వచ్చింది ప్రెసిడెంటుగారి భార్యకి. పైగా ఆవిడంటే తామందరికీ ఆరాధ్యదైవమయ్యె. కోడలికి చెప్పి చకచకా అందర్నీ తప్పించుకుంటూ సుభద్రమ్మగారి దగ్గరగా వెళ్లింది ఆమె.

“మీరేమిటి ఇక్కడ?" ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ. ఇక పదినిమిషాల పాటూ గుక్క తిప్పుకోకుండా పేరుపేరునా అందరి సంగతులూ అడిగేసింది. కనిపిస్తున్న కూతుర్నీ అల్లుణ్ణి చూపించింది. అల్లుడి హోదా గురించీ కూతురి ఉద్యోగం గురించీ ఆకాశానికెత్తి చెప్పింది. వాళ్లు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి వర్ణించింది.

పావుగంట తరవాత “మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది, నేనిక వెళతాను” అంటూ సుభద్రమ్మగారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంటుగారి భార్య... "మీరా ఎలా ఉంది?" అని...

“ఓహ్... మీకు మీరా గుర్తుందా. తనకేం చాలా బావుంది. చక్కగా చదువుకుంటోంది. మా ఇంట్లో ఇద్దరు చంటి పిల్లలు కదా. దాని స్టడీకి ఇబ్బందవుతుందనీ హాస్టల్లో ఉంచాను. అన్నదావిడ హుందాగా బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ...

తిరుగు ముఖం పడుతూ కొడుకూ కోడలూ కార్లో అన్నీ సర్దుతున్నారు. డిక్కీ పక్కనే ఎవరో నక్కుతున్నట్టనిపించి పక్కకి తిరిగి చటుక్కున చెయ్యి పట్టుకుని ఇవతలికి లాగారు ప్రెసిడెంటుగారి భార్య.

తైలసంస్కారం లేని జుట్టూ, తనవి కావని తెలిసిపోతున్న బట్టలూ, అమాయకమైన చూపులూ... తను మీరా!

“ఇందాకే మిమ్మల్ని చూశాను ఆంటీ... మేడమ్ ఎదురుగా వస్తే చంపేస్తారు. అందుకని రాలేదు. మా అన్న ఎలా ఉన్నాడు ఆంటీ?" అడుగుతోంది ఆత్రంగా బేలగా.

“ఏం చేస్తున్నావ్ నువ్విక్కడ?" గొంతులో తడి ఆరిపోతుండగా అడిగింది.

"మేడమ్ ఇంట్లో వంట చేస్తాను. మిగతా పనులూ చేస్తాను. వాళ్ల

పిల్లల్ని చూసుకుంటాను."

"ఔరా!"

కరుణామయిగా తమ హృదయాలలో ఏర్పరిచిన ఉన్నతపీఠం కూకటి వేళ్లతో పెళ్లగించ బడుతోంటే నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది ఆమె.

కామెంట్‌లు