నిషిద్ధాక్షరి

ప్రచురణ: ఈనాడు 
రచయిత: సింహప్రసాద్ 

తల్లికేదో ముఖ్యమైంది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత.సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలీక తనలో తాను సతమతమవుతోంది. భయసంకోచాలు ఆమెని వెనక్కెనక్కి లాగుతున్నాయి.

అది గ్రహించి చిన్నగా నవ్విందామె తల్లి. “నా దగ్గర సంకోచిస్తావేంటే. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు. అడగాలనుకుంటే అడుగు."

"నేనేదో అడగబోతున్నట్లు నీకెలా తెలిసిందమ్మా?" ఆశ్చర్యపోతూ అడిగింది.

"అమ్మని కదా. చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసి ఏడ్చావో, అజీర్తితో ఏడ్చావో, అసౌకర్యంగా ఉండి ఏడ్చావో, అభద్రతతో ఏడ్చావో ఇట్టే పసిగట్టినదాన్ని!"

“నువ్వు గ్రేట్ అమ్మా.”

"ఈ ఉపోద్ఘాతం దేని గురించి?"

“ఏం లేదు... మరి... మధుకర్ తెలుసుగా?"

“చూడలేదు గానీ విన్నాను. నాన్చక సంగతేంటో చెప్పు."

ఉత్సాహంగా అతడి ఫోటో చూపించింది.

“బావున్నాడు..”

“థాంక్ గాడ్. నీకు నచ్చాడు. నాకు సగం దిగులు పోయింది.
అతడూ నేనూ ప్రేమించుకుంటున్నాం...”

“ప్రేమించుకోండి” నవ్వింది.

“పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.”

“దానికి ఫోటో ఒక్కటే చాలదు. చాలా చూడాలి. చాలా రకాలుగా ఆలోచించాలి" గంభీరంగా అంది.

“వాళ్లింట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట."

"నీ జీతం గురించి చెప్పాడేమో!"

"భలేదానివి అమ్మా. నా గురించీ, నా జాబ్ గురించీ చెప్పినప్పుడు నా ప్యాకేజ్ గురించి చెప్పడా?"

“అందుకనే వెంటనే ఒప్పేసుకుని ఉంటారు."

“నువ్వూ ఒప్పుకుంటే మేం పెళ్లి చేసుకుందామని..."

క్షణకాలం తీక్షణంగా చూసి అంది, "ప్యాకింగ్ చూసి లోపలి సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలీదు తల్లీ.”

“అతణ్ణి వాళ్ల వాళ్లనీ తీసుకొస్తాను. అన్నీ తెలుసుకోవచ్చు..."

"నాకన్నా ఎక్కువ చదివినదానివి. అన్నీ అంచనా వేసుంటావు. మళ్లీ నేను తూచనక్కర్లేదు గానీ, ఆడదాని రెక్కలు బలంగా శక్తిమంతంగా ఉండాలి. అప్పుడే ఇంటినీ కుటుంబాన్నీ రక్షించుకోగలదు. కొన్ని బలహీనతలు ఆమె శక్తికి తూట్లు పొడిచి అసహాయురాలిని చేస్తాయి. అంచేత అతడికి ఓ రెండు దుర్లక్షణాలు ఉంటే మీ పెళ్లికి నేను ఒప్పుకోను. అవి లేకపోతే నాకు అంగీకారమే' " అంటూ అవేమిటో చెప్పింది తల్లి.
"బీసీ కాలం దానిలా మాట్లాడుతున్నావమ్మా. ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్కి సింబల్స్. కాస్మోపాలిటన్ కల్చర్లో ఓ భాగం. వాటినెవరూ సీరియస్గా తీసుకోరు. చెడుగా భావించరు. కాలంతోపాటూ మనమూ నడవాలమ్మా, లేకపోతే వెనక బడిపోతాం.

“ఫరవాలేదు. జీవితంలో వెనకబడి పోయేకన్నా అదే నయం కదా. ఆ రెండూ ఆడవారికి నిషిద్ధాలు. వారి జీవితాల్లో ప్రవేశించ నివ్వకూడదు. అతడికి ఆ రెండు అలవాట్లూ లేవనీ, వాటిమీద ఎలాంటి ఆసక్తి లేదనీ నువ్వు హామీ ఇస్తే, మీ పెళ్లికి నేనే ముహూర్తం పెట్టిస్తా."

“ఇలాంటి పీటముడి వేశావేంటమ్మా" అయిష్టంగా చూసి, ఇబ్బంది పడుతూ అంది.

“చిక్కుముడిలా కన్పిస్తోందా?"

"అహహ... అయినా మధుకర్కి ఆ అలవాట్లు లేవనుకుంటానమ్మా, రెండేళ్ల నుంచీ చూస్తున్నాగా!"

"అనుకోవడం వేరు, పక్కాగా తెలుసు కోవడం వేరు. మగాళ్లు చిరుగుల బనీను మీద తెల్లని చొక్కా తొడుక్కుని ఆపైన టై కట్టుకోగలరు. పైకి కనిపించినంత ఫెయిర్గా లోపలుండరు. బాగా గుర్తు పెట్టుకో..."

ఆలోచనలో పడింది హర్షిత. తల్లి ఎలా రియాక్టవుతుందోనని మొదట భయపడింది. ఒప్పుకుందన్న సంతోషం మిగలకుండా మెలికపెట్టింది.

మధుకర్ని ఎలా అడగటం? పెళ్లిదాకా వచ్చాక ఇప్పుడు అడిగితే ఏమనుకుంటాడో!

తల్లి షరతు తోసి రాజనేస్తే? పోనీ అబద్ధమాడేస్తే? ఎంతో గిల్టీగా అనిపించింది.
తనకి తల్లి. తల్లికి తను. నిజానికి తనకోసమే బతికి ఉంది. తనకోసమే బతుకుతోంది. ఆమెని మోసం చేయలేదు సరికదా, ఆమెకి ఇష్టం లేని పని సైతం తను చేయలేదు, చేయదు.

'ఇన్నాళ్లూ మధుని ప్రేమ కళ్లతో చూశాను. అవి మోసం చేయొచు ఇక నిఘా నేత్రంతో చూస్తాను' అని ఒక నిశ్చయానికి వచ్చేసరికి మనసు తేలికపడింది.

మర్నాడు మధుకర్ని కలిసీ కలవంగానే, “మీ అమ్మగారు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు కదా? ఎందుకు ఒప్పుకోరులే. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరలేదుగా" అన్నాడు హర్షితతో.

“మన గురించి ఇంకా చెప్పలేదు."

"ఎందుకాలస్యం? అయినా మావాళ్లు ఓకే అనేశారుగా. మీ అమ్మగారు కాదన్నా జానేదేవ్ అనేసేయొచ్చులే."

“అది తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు ఇంకో ప్రాబ్లమ్ వచ్చి పడింది మధూ. ఎలా టాకిల్ చెయ్యాలో తెలీట్లేదు."

“ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అనేవాణ్ణి నేనున్నాగా. నాకు చెప్పి బుర్ర బరువు దింపేసుకో."

“మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఫారెన్ క్లయింట్ అప్రిసియేషన్ లెటర్ పంపించడమే గాక ఇంకో కొత్త ప్రాజెక్టు ఇచ్చాడు. రేపు రాత్రికి మావాళ్లు గెట్ టుగెదర్ ఏర్పాటుచేశారు."

“దానికి నా పర్మిషన్ కావాలంటావ్?

గో ఎహెడ్

“అది కాదు సమస్య. మా ప్రాజెక్టు వాళ్లమే గాక కంపెనీ వైస్ ప్రెసిడెంటూ వస్తున్నాడు. అతడు డ్రింక్ చెయ్యనివాళ్లని 
అనాగరికుల్లా చూస్తాడన్నది ఓపెన్ సీక్రెట్. అతడి గుడ్లుక్స్లో ఉండటానికి పోటీ పడుతుంటామని నీకు తెలుసుగా. నేనేమో టీ టోటలర్ని. డ్రింక్ వాసనే పడదు."

“దానికింత బిల్డప్ ఎందుకు. ముక్కు మూసుకుని తాగెయ్... రెండో పార్టీకి దారిలో పడిపోతావ్. వోడ్కా, స్పిరిట్జ్, ఎక్స్ప్రెస్సో మార్టిని, నేగ్రోనీ తప్పకుండా ఉంటాయి. అవన్నీ గర్లీ డ్రింక్సే. వాటిల్లో ఏదైనా తాగు. స్వర్గానికి ద్వారాలు తెరుచుకోకపోతే నన్ను పిలువు" కన్నుగీటి కొంటెగా నవ్వాడు మధుకర్.

ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ “చాలా పేర్లు తెలుసే. నువ్వు డ్రింకర్వా?" అడిగింది.

"జనరల్ నాలెడ్జోయ్. అయినా డ్రింక్ చేయడం ఘోరాపరాధం ఏమీకాదు. నీకు ఎంబరాసింగ్గా ఉండదంటే నీ బాయ్ ఫ్రెండ్గా వస్తాను. కలిసి రెండు పెగ్గులేద్దాం. థ్రిల్లవుతూ ఛిల్లవుదాం" అన్నాడు మధుకర్.

హర్షిత ముఖం మ్లానమైంది. అతడు పట్టించుకోలేదు. తొలిసారి డ్రింక్ ఏ వయసులో రుచి చూశాడో, తర్వాత ఏయే సందర్భాలలో తాగాడో, ఫ్రెండ్స్ బలవంతం మీద ఏయే బ్రాండ్స్వి తాగాడో చెప్పుకొచ్చాడు.

“ఫ్రెండ్స్ నిన్ను బలవంతపెట్టారా, నువ్వు వాళ్లని బలవంతపెట్టావా?" సందేహం తీరక అడిగింది.

"భలే జోక్. ఎవరు ఎవరిని బలవంతపెట్టారన్నది అప్రస్తుతం. పానం ఒక్కటే ముఖ్యం. ఏ యుఎస్ ఫ్రెండో ఫారెన్ బ్రాండ్ తెస్తే తాగకుండా మడిగట్టుక్కూర్చోవడం ఏ మగాడికీ సాధ్యం కాదు. సాధ్యమైతే గనుక వాళ్లకి ఆనందానికి డెఫినిషన్ తెలీదని ముఖంమీద ముద్ర కొట్టేయొచ్చు."

వేరే అప్పుడైతే అతడి మాటలకు పడీపడీ నవ్వేదే. కానీ ఇవాళ ఆమె పెదాలు బిగుసుకుపోయాయి తప్ప చిరునవ్వు చిందించలేకపోయాయి. పెదవి కొరుక్కుంటూ అతణ్ణి చూస్తుంటే అతడి మొబైల్ మోగింది. వార్త వింటూనే గంతేశాడు.

"టూ లాక్స్! రెండు లక్షలు! రియల్లీ?!" అని రెట్టించి కన్ఫామ్ చేసుకుని, ఆమె భుజాలు పట్టుకుని కుదిపేశాడు.

“ఐ గాటిట్. క్రికెట్ బెట్టింగ్లో జస్ట్ పదివేలు బెట్ వేస్తే రెండు లక్షలు కొట్టుకొచ్చాయి డియర్..."

“నువ్వు బెట్టింగ్ చేస్తావా? నమ్మలేకపోతున్నాను.”

“ఇది క్వైట్ కామన్. సిల్లీగా విస్తుబోకు. నేను క్రికెట్ పిచ్చోడినని నీకు తెలుసుగా. ప్రతి క్రికెటర్ జాతకం, ఆట తీరు నాకు క్షుణ్ణంగా తెలుసు. నా గురి, అంచనా ఎప్పుడూ తప్పవు. దానికిదే లైవ్ ఎగ్జాంపుల్” పొంగిపోతూ చెప్పాడు.

అంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆమె వంక చూసి, “వావ్” అని అరిచి అన్నాడు. "ఈ అకేషన్ని మనిద్దరం మందు సాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం. నీ మందు భయాలూ వీక్నెస్లూ అన్నీ ఎగరగొట్టేస్తాను. రేపు మీ పార్టీలో విలేజ్ గాళ్లా గాక హైదరాబాదీలా బిహేవ్ చేసి మీ వీపీ దగ్గర మార్కులు కొట్టేద్దువు గాని. ఎలా ఉంది మన ఐడియా?" కళ్లెగరేశాడు.

దిమ్మెరబోయి చూసింది హర్షిత. విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది!

నిషిద్ధాక్షరి

“ఇప్పుడే అడవిలోంచి డైరెక్టుగా వచ్చినట్టు చూస్తావేంటి డియర్. నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్లది అమెరికన్ కల్చర్. ఇడ్లీ దోసెలకి ఎప్పుడో గుడ్బై చెప్పేసి, పిజ్జాలూ, బర్గర్లూ, అన్ని దేశాల డిషెస్ తింటున్నాం. అన్ని బ్రాండ్లూ తాగుతున్నాం. నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్లు పూర్తిగా డిఫరెంట్ స్పెసీస్. పాత నమ్మకాలూ, సంస్కృతీ గట్రా చెత్తని డస్ట్బిన్లో పారెయ్. అలాంటి కొలబద్దలకి అందనంత రేంజ్ మనది!" గర్వంగా చెప్పాడు మధు.

"నన్ను కొంచెం ఆలోచించుకోనీ."

"ఇందులో బుర్ర కూల్ చేసేదే గానీ బద్దలు కొట్టుకునేది ఏముంది?" పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు. ఆమె ముఖంలోని జీవకళ ఆవిరవ్వడం చూసి విస్తుబోయి ఏదో అనబోయేంతలో, "సీ యూ..." అంటూ వెళ్లి స్కూటీ స్టార్ట్ చేసింది హర్షిత.

ఆరోజూ ఆ మర్నాడూ మూడీగానే ఉందామె. మూడో రోజున తల్లి కూరగాయలు తరుగుతోంటే పీట వాల్చుకుని కూర్చుంది.

ఏమిటన్నట్లు చూసింది తల్లి.

“తాగేవాళ్లూ, జూదం ఆడేవాళ్లూ అంటే నీకెందుకు అసహ్యం అమ్మా?" బాధగా నవ్విందామె. "నా బతుకుని నాశనం చేసినవి అవే గనుక!"

"అమ్మా..."

“మాది పల్లెటూరు. నేను కూలిపని చేసేదాన్ని. మీ నాన్న కొబ్బరిచెట్లు మీంచి కాయలు దించడం, కాయలు ఒలవడం చేసేవాడు. బలిష్ఠంగా ఉండేవాడు. పెద్ద మీసాలతో షోకిల్లాలా ఉండేవాడు- ఎలాంటి పనైనా అవలీలగా చేసేసేవాడు. మేం ఒకర్నొకరం ఇష్టపడ్డాం. అతడు కల్లు తాగుతాడని మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో పనీపాటా చేసేవారిలో చాలామంది చీకటి పడితే చాలు కల్లో, సారాయో తాగేవారు. అలసట మరిచిపోయేవారు. అంచేత నేను దాన్నో అడ్డంకిగా భావించలేదు. పైపెచ్చు అవసరమైతే నా ప్రేమతో అతణ్ణి తేలిగ్గా మార్చెయ్యగలనన్న ధీమా ఉండేది. 

పెద్దవాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. తరచూ సారా తాగొచ్చేవాడు. తిట్టేదాన్ని, ఏడ్చేదాన్ని. ఏవో కథలు చెప్పేవాడు. రెండ్రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు. మళ్లీ మామూలే.

ఊళ్లో కుట్టుమిషను శిక్షణా కేంద్రం పెట్టారు. కూలిపని కన్నా ఎంతో మంచిదని నేర్చుకున్నా. జాకెట్లూ, గౌన్లూ కొత్తరకాలుగా కుట్టడం వచ్చింది. సంపాదన పెరిగింది. మీ నాన్న కూలి డబ్బులు తన తాగుడుకే చాలని స్థితికొచ్చేశాడు.

నన్ను తిట్టీ కొట్టీ బతిమాలీ బామాలి డబ్బు గుంజుకుపోయేవాడు.

మెల్లగా పనికెళ్లే రోజులు తగ్గి, తాగి మత్తుగా పడుండే రోజులు పెరిగాయి.

పనీ పాటా లేని గ్యాంగ్తో తిరుగుతూ మూడుముక్కలాట ఆడటం మొదలెట్టాడు. డబ్బుకోసం నన్ను పీడించేవాడు. అతడి బాధ భరించలేక పుట్టింటికి పోయాను. అక్కడికొచ్చి నానా గొడవ చేశాడు. నామీదా కడుపులో ఉన్న నీమీదా ఎన్నో ఒట్లు పెట్టగా తిరిగొచ్చాను.

రెండు మూడ్రోజులు బుద్ధిగా ఉన్నాడు. తర్వాత కుక్కతోక అయిపోయాడు.

నువ్వు పుట్టావు. ఆడపిల్ల పుట్టిందనీ, ఆమెకి చక్కని భవిష్యత్తు ఇవ్వాలనీ చిలక్కి చెప్పినట్టు చెప్పాను. దురలవాట్లు మానేయమనీ, డబ్బు కూడబెడదామనీ చెప్పాను. శ్రద్ధగా విన్నాడు. నీ తలమీద చెయ్యిపెట్టి మరీ ఒట్టు వేశాడు. చీకటి పడేసరికి షరా మామూలే.

అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది. చీటికీ మాటికీ పేకాటవాళ్లతో గొడవపడేవాడు. కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక పేకాట అప్పులూ తీర్చాను. ఇక నావల్ల కాదని తెగేసి చెప్పాను.

ఒక రోజున అతడి పేకాట మిత్రుల్లో ముగ్గురు బాగా తాగి ఇంట్లోకి జొరబడ్డారు. మీ నాన్న చాలా బాకీ పడ్డాడనీ, దానికింద నన్ను ఆ రాత్రికి వాడుకోమన్నాడనీ చెప్పారు.

నేను కాళినయ్యాను. కత్తిపీట అందుకుని వారిని అడ్డంగా నరకబోయాను. పారిపోయారు. నిన్ను చంకనేసుకుని రాత్రికి రాత్రే ఇంట్లోంచి వచ్చేశాను. స్టేషన్లో ఆగి ఉన్న రైలెక్కి ఇక్కడికొచ్చిపడ్డాను.

స్కూల్లో ఆయాగా చేరాను. నీతోపాటూ చదువుకున్నాను. ప్రైవేటుగా టెన్త్ పాసై టీచరమ్మగా మారాను..." చెప్పటం ఆపి కన్నీటి ధారలు తుడుచుకుందామె.

"నాన్నంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా. తలచుకుంటేనే ఒళ్లు కంపరంగా ఉంది" సానుభూతిగా చూస్తూ అంది హర్షిత.

"అన్ని ధర్మాలూ తెలిసిన ధర్మరాజేం చేశాడు చెప్పు?”

అవాక్కై చూసింది.

“సరదాగా మొదలుపెట్టి కట్టుబానిసలైన వాళ్లెందరో ఉన్నారు. దేవదాసు కథ ఏనాటిది చెప్పు. ఇప్పుడెవడూ అలా తాగి రోడ్డు మీద పడడం లేదు. కానీ సంసారాలు రోడ్డున పడుతున్నాయి. దురలవాట్లు వేరు పురుగులాంటివి తల్లీ. చదువుకున్నదానివి నీకింతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు.”

రెండ్రోజుల తర్వాత మధుకర్ హర్షితని వెతుక్కుంటూ వచ్చాడు. "నన్ను తప్పించుకుని తిరుగుతున్నావేంటి. కొంపతీసి అమెరికా వాడు తగులుకున్నాడా? ఐ మీన్ అమెరికా సంబంధం..." నవ్వాడు.

"అలాంటిదేం లేదు..."

"మరెందుకిలా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడే నేనంటే విసుగు వచ్చేసిందా. నేనేం పాపం, నేరం చేశాను నా బంగారం."

“అవధానం తెలుసుగా... ఇచ్చిన అంశం మీద ఆశువుగా పద్యాలు చెప్పడం. అవధానిని పృచ్ఛకుడు కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు. వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి. అంటే ఆ అక్షరాలు ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాలు ఆశువుగా చెప్పాలన్నమాట.

"నేనిప్పుడేం అవధానం చెయ్యడం లేదోయ్."

“ఆడవారి జీవితంలోనూ కొన్ని నిషిద్ధాక్షరాలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది."

“ఐసీ... మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పుపట్టిన ఆ అక్షరాలేంటో..?"

"అయిదు అక్షరాలు... రెండు పదాలు... అవి- తాగుడు, జూదం!"

“వాట్!” అదిరిపడి అరిచాడు మధుకర్.

“వీటిని నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయి అంది అమ్మ. దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నేను. మనకి పొసగదు. గుడ్బై..."

హర్షిత నిటారుగా అయి ధీమాగా వెళ్లిపోతుంటే అయోమయంగా చూస్తుండిపోయాడతను.

కామెంట్‌లు