మూగ ప్రేమ

బుజ్జి వాళ్ళ తాతయ్యకి రోజుగా సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు ఉంది. ఓ రోజు గుడికి వెళుతూ "గుడికి వెళుతున్నా. తోడు వస్తావా?" అని బుజ్జిని అడిగాడు.

"నాకు హోం వర్కు చాలా ఉంది. కానీ, నీతో రావాలని కూడా ఉంది మరి ఎలా?" అన్నాడు బుజ్జి.

ఆ మాట విన్న అమ్మ "తాతయ్య పిలిస్తే వెళ్ళాలి. హోం వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ వయసులో నీవు తాతయ్యతో వెళితే నీకు మంచి విషయాలు తెలుస్తాయి.

వెళ్ళిరా" అంది.

'సరే' అని తాతయ్యతో బయలుదేరాడు బుజ్జి
దేవుని దర్శనం చేసుకున్నాక అక్కడ గట్టు మీద కాసేపు కూర్చున్నారు. అప్పుడు దగ్గరలో ఉన్న చెట్టు పైకి ఒక కాకి వచ్చింది. అది వాళ్ళ వైపే చూస్తోంది.

తాతయ్య దాన్ని చూసి "కా...కా” అని అరిచి చేతిలో వున్న కొబ్బరి చిప్పను పగులగొట్టి చిన్న ముక్క దానికి వేశాడు. అది రివ్వున వచ్చి కొబ్బరి ముక్కను ముక్కున కరచుకుని ఎగిరి చెట్టుమీద కూర్చుంది. కొబ్బరిముక్కను కొరికి కొద్ది కొద్దిగా తిన్నది. కాసేపయ్యాక మళ్ళీ కాకికి ఇంకో కొబ్బరి ముక్క వేశాడు.

"ఎందుకు తాతయ్యా దానికి వేస్తావు? నువ్వు తిను" అన్నాడు బుజ్జి.

అది మనింటి దగ్గరకి రోజూ వచ్చే కాకే అనుకుంటా. రోజూ అన్నం తినే సమయంలో ఏదో ఒకటి వేస్తుంటాను. ఈరోజు ఒంట్లో బాగోలేక నేను తినలేదు కదా. దాని సంగతి మర్చిపోయా. అందుకే మనల్ని చూడగానే ఇక్కడకు వచ్చింది" అన్నాడు.

"అయ్యో తాతా! అంతా నీ పిచ్చి, అవి మనుషులని గుర్తుపెట్టుకుంటాయా ఏంటి?" అన్నాడు బుజ్జి.

"అవును, కాకికి లెక్కలు రావుగానీ అవి మనుషులని గుర్తుపట్టగలవు. అది మాత్రం నిజం. చూడు ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు” అన్నాడు.

'నిజమే' అన్నాడు బుజ్జి.

ఈసారి అది కొబ్బరి ముక్క తీసుకుని ఎటో వెళ్ళి పోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చేశారు. ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తను కళ్ళజోడు కనిపించటం లేదని ఇల్లంతా వెదుకుతున్నాడు. కాసేపు వెదికాక ఇందాక గుడి నుంచి వచ్చేప్పుడు మర్చిపోయానేమో అని అనుమానం వచ్చింది.

"వెళ్ళి చూస్తా" అని వెళ్ళబోతుంటే “వద్దులెండి మామయ్యగారూ! చీకటి పడుతోంది. మళ్ళీ మీరు వచ్చేప్పుడు ఇబ్బంది పడతారు. నేను ఎవరినైనా పంపిస్తాను" అంది బుజ్జి వాళ్ల అమ్మ.

"పోనీ నేను చూసొస్తానమ్మా" అని సైకిల్ తీయబోయాడు బుజ్జి. “వద్దులేరా. హోం వర్కు ఉందన్నావుగా.... రాసుకో, నేను పోయి చూసొస్తా" అని చెప్పులేసుకుంటుండగా కాకి రయ్యిన రెక్కలు ఆడిస్తూ వచ్చి అరుగు మీద తాత కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహరీ గోడపైకెళ్ళి వాలి చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దవయ్యాయి.

తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ “అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్న మాట. అది మనదని తెచ్చి ఇచ్చింది" అన్నాడు. వాళ్ళు సంతోషించారని తెలిసి కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.

బుజ్జి వాళ్ల అమ్మ విషయం తెలుసుకుని "కాకులు మనుషులను గుర్తుపెట్టుకోవటమే కాదు... కృతజ్ఞత కూడా చూపిస్తాయన్న మాట" అంది.

“పక్షులు, జంతువులు వాటి ప్రేమని ఇచ్చి పుచ్చుకుంటాయని మనకి ప్రత్యక్షంగా తెలిసింది కదా!” అన్నాడు తాతయ్య.

పశుపక్ష్యాదుల పట్ల తాతయ్యలా ప్రేమగా వుండాలి అని మనసులో అనుకున్నాడు బుజ్జి.



కామెంట్‌లు