నక్క తెలివి



ప్రచురణ:ఆంధ్రజ్యోతి
రచయిత: కనుమ ఎల్లరెడి
రామాపురం దగ్గరలో ఉన్న దట్టమైన అడవి రకరకాల జంతువులకు ఆవాసంగా ఉంది.

ఒకరోజు ఆ అడవిలోని జంతువులన్నీ అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశానికి ముఖ్య కారణం మృగరాజైన సింహం నవ్వకపోవడం.

మృగరాజు ఎప్పుడూ కోపంగా, ఏదో కోల్పోయినట్టుగా ఉండటం మిగిలిన జంతు వులకు నచ్చడం లేదు. ఆ విషయమై మాట్లాడుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.

"మన మృగరాజు ఎప్పుడూ ముఖం అదోలా పెట్టి చాలా తీక్షణంగా చూస్తుంటాడు. నవ్వింది ఎప్పుడూ చూడలేదు. అలా ఉండటం అడవిలో ఎవ్వరికీ నచ్చడం లేదు. కాబట్టి మృగరాజును నవ్వించే బాధ్యత నక్క బావకు అప్పగిద్దాం" అని ఎలుగుబంటి అంది.

ఆ మాటలు వినగానే నక్క "అమ్మో నా వల్ల కాదు. మృగరాజు గాండ్రింపు వింటేనే నాకు భయం" అని అంది.

“అదేం కుదరదు. నీ ఎత్తులు, జిత్తులతో నువ్వే నవ్వించాలి" అంది ఏనుగు.

ఆ మాటకు శృతి కలుపుతూ "అవును అది నీకే సాధ్యం" అన్నాయి. మిగిలిన జంతువులు.

ఇక తప్పదనుకున్న నక్క “సరే నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను" అని చెప్పి సమావేశం నుంచి బయటపడింది.

మృగరాజును నవ్విస్తానని మాట అయితే ఇచ్చింది కానీ ఎలా నవ్వించాలో అర్థం కావడం లేదు నక్కకి.

అప్పుడే ఒకానొక సమయంలో కుందేలు తన యుక్తితో సింహాన్ని బావిలోకి దూకించిన సంఘటన గుర్తుకు వచ్చింది. నవ్వించడానికి అదే ప్రణాళికను అమలు చేయాలని మనసులో అనుకుని నవ్వుతూ మృగరాజు దగ్గరకు వెళ్ళింది.

నక్కను చూసిన మృగరాజు "ఏమిటా వెకిలి నవ్వు" అని గర్జించింది.

నక్క నవ్వుతూ "మీలాగే ఉన్న ఓ మృగరాజు నవ్వుతుంటే నాకు నవ్వు వచ్చింది" అంది నక్క.

"సింహం నవ్వడమా? ఏం వేళాకోలంగా ఉందా?" అంది మృగరాజు.

"కావాలంటే రండి చూపిస్తాను" అని మృగరాజును బావి దగ్గరకు తీసుకెళ్లింది. "అదిగో చూడండి" అంటూ నక్క నవ్వుతూ బావిలోకి చూపించింది. నక్క ప్రతిబింబం నవ్వుతూ కనిపించింది. మృగరాజు కూడా తొంగి చూసి ఓ నవ్వు నవ్వింది. ప్రతిబింబం నవ్వుతూ ఉండటంతో మృగరాజు మరింత బిగ్గరగా నవ్వింది.

జరుగుతున్న తతంగాన్ని చాటుగా గమనిస్తున్న జంతువులన్నీ నక్క తెలివిని చూసి కేరింతలు కొట్టాయి. ఆ తరువాత మృగరాజును నవ్వించినందుకు నక్కను అభినందించాయి.

కామెంట్‌లు